Mother tongue Telugu
-
పరిపాలన మాతృ భాషలోనే జరగాలి
మణికొండ: దేశంలో ప్రధాన పరీక్షలను మాతృభాషలోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని, పరిపాలన, న్యాయ, వైద్య, శాస్త్ర సాంకేతిక లాంటి అన్ని రంగాలలో మాతృభాషను అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నార్సింగిలో సీనియర్ బీజేపీ నాయకుడు పి.మురళీధర్‌రావు సారధ్యంలో తెలుగు సంగమం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాతృభాషను చిన్నచూపు చూసే భావన పోవాలన్నారు. గతంలో ప్రపంచానికే విశ్వగురువులుగా ఉన్న మనం రాబోయే పదేళ్లలో తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటామని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మనది దీపం వెలిగించే సంస్కృతి అని.. అదే పాశ్చాత్య దేశాల వారు వాటిని ఆర్పి ఉత్సవాలు చేసుకుంటారని వ్యాఖ్యానించారు. బీబీసీ డాక్యుమెంటరీలో ప్రధానమంత్రి మోదీ పట్ల అవమానకరంగా కథనం ప్రసారం చేయటం దేశానికే అవమానంగా భావించాలన్నారు. తాను పదవీ విరమణే చేశానని, పెదవి విరమణ చేయలేదని, రిటైర్డ్ అయ్యాను తప్ప టైర్డ్ కాలేదని ఆయన చమత్కరించారు. మన సంస్కృతి ఎంతో గొప్పది.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రస్తుతం ప్రపంచమంతా ఆచరిస్తున్నారని, మనం మాత్రం వారు వదిలిపెట్టిన సంస్కృతి వెంట పడుతున్నామని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాతృభాషకు మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రధాన పరీక్షలను స్థానిక భాషల్లోనే నిర్వహించేందుకు ముందుకు రావటం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో సినీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, పద్మశ్రీ డాక్టర్ శోభరాజు, డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ, లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అధికార భాషకు పట్టంకట్టిన మూర్తులు
దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో అధికార భాషా సంఘం ఉనికిలో ఉన్నప్పటికీ ఆ సంఘానికీ, దాని కార్యకలాపాలకూ, అన్ని స్థాయిల్లోనూ తెలుగుభాష వాడకాన్ని స్థానిక అధికారులు పెంచడానికీ అవసరమైన బడ్జెట్ లేదు. ఆ పరిస్థితుల్లో అధికార భాషగా తెలుగు వాడకాన్ని పెంచడానికి అవసరమైన తొలి బడ్జెట్‌ను నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది. ప్రత్యేక బడ్జెట్ ఎంత కావాలని వైఎస్సార్ అడగగా, సంవత్సరానికి కనీసం రూ. 2 కోట్లు అవసరమని చెప్పాము. ఆయన దానికి సమ్మతించారు. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలోనూ సాధికారికంగా భాషా సంఘం ఆధ్వర్యంలో, ఉధృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం కలిగించాము. నాటి ఉన్నతాధికారుల సహకారం ఫలితంగా అనేక జిల్లాలలో అధికారుల స్థాయిలో తెలుగు వాడకం పెరిగింది. సమీప జిల్లాలను ఒకచోట కలిపి ప్రాంతీయ సదస్సులు జరిపి తెలుగు భాష వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాం. ఇంత కృషికీ, ఆచరణకూ దోహదపడింది... వైఎస్సార్–రోశయ్య చేసిన ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులే! ‘దేశభాషలందు తెలుగులెస్స’ అనీ, అది కండగల భాష అనీ, దేశంలోని పాలకులంతా దానిని కొలవడానికి పోటాపోటీలు పడింది అందుకేననీ శ్రీకృష్ణదేవరాయలు వందల సంవత్సరాల క్రితమే ఎంతో గర్వంతో చాటి చెప్పారు. కానీ ఆచరణలో క్రమంగా పాలకుల అనాదరణవల్ల తెలుగు భాష సౌరు, సొగసూ తరిగిపోతూ వచ్చింది. చివరికి ఏ స్థాయికి మన పాలకులు దిగజారవలసి వచ్చిందంటే... అధికార భాషా సంఘం ఉనికిలో ఉన్నప్పటికీ ఆ సంఘానికీ, దాని కార్యకలాపాలకూ, అన్ని స్థాయిల్లోనూ తెలుగుభాష వాడకాన్ని స్థానిక అధికారులు పెంచడానికీ అవసరమైన బడ్జెట్ అంటూ లేదు. తెలుగు భాష వాఢకానికి వారే స్ఫూర్తి ఆ పరిస్థితుల్లో అధికార భాషా సంఘం ఉద్యమ స్ఫూర్తితో భాష వాడకాన్ని పెంచడానికి అవసరమైన తొలి బడ్జెట్‌ను అధికారికంగా ప్రకటించింది. కీర్తిశేషులైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, రోశయ్య నాటి ఆర్థికమంత్రిగా ఉండేవారు. అప్పటి దాకా పేరుకు అధికార భాషా సంఘం ఉన్నా ప్రయోజనం లేక పోయింది. ఈ దశలో ఆ సంఘానికి అధ్యక్షునిగా వైఎస్సార్ నన్ను నియమించినప్పుడు–నా పని (వ్యాసకర్త) అప్పటికి ‘చీకట్లో చిందు లాట’గా మారింది. ఎందుకంటే అంతవరకూ అధికార భాషా సంఘా నికి లేని ఒక ప్రత్యేక బడ్జెట్ కోసం నేను ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయవలసి వచ్చింది, అప్పుడు వైఎస్సార్, నన్ను రోశయ్యతో మాట్లాడుకుని ఏర్పాటు చేసుకోమని చెప్పారు. కానీ, రాష్ట్ర ముఖ్య మంత్రి ఒకమాట చెబితే తప్ప ఎలా కేటాయించగలనని రోశయ్య పటుపట్టారు. ఆర్థిక మంత్రి రోశయ్య ‘చిక్కడు–దొరకడ’న్న సామెత అప్పుడే నాకు గుర్తుకొచ్చింది. ఈలోగా అధికార భాషా సంఘం అభ్యర్థనను సుకరం చేస్తూ తెలుగు భాషా ప్రేమికులైన నాటి ఉన్నతాధికారులు డాక్టర్ రమా కాంతరెడ్డి, సెక్రటరీ కృష్ణారావు భాషా సంఘం చేస్తున్న కృషికి మన సారా దోహదం చేశారు. ప్రత్యేక బడ్జెట్ ఎంత కావాలని వైఎస్ అడ గగా, సంవత్సరానికి కనీసం రూ. 2 కోట్లు అవసరమని చెప్పాము. అందుకు ఆయన మరోమాట లేకుండానే సమ్మతించారు. కాబట్టే ఉమ్మడి రాష్ట్రంలోని 23 జిల్లాలలోనూ సాధికారికంగా భాషా సంఘం ఆధ్వర్యంలో, ఉధృతంగా అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యం కలిగించాము. దీని ఫలితంగా అనేక జిల్లాలలో అధికారుల స్థాయిలో తెలుగు వాడకం పెరిగింది. మాండలికాలకు పట్టం కట్టిన భాషా సంఘం ఈ సదస్సులు క్రమంగా రాష్ట్రేతర ఆంధ్రులను, అక్కడి తెలుగు భాషా భిమానుల్ని సహితం కదిలించివేశాయి. మన భక్త రామదాసు బరంపురం వాసి కావడంతో తెలుగు–ఒడిశా సంబంధాలు కూడా మరింతగా సన్నిహితం కావడానికి దోహదకారి అయింది. అందుకే మనం మనం బరంపురం అన్న రావిశాస్త్రి వ్యాఖ్య విశేష ప్రచారంలోకి వచ్చింది. భాషా సంఘం ప్రత్యేక బడ్జెట్ కేటా యింపులతో ప్రారంభించిన ప్రత్యేక సదస్సుల సందర్భంగా, పలు ప్రోత్సాహకాల స్వేచ్ఛా వాడకం కూడా నమోదు కావడం మరో విశేషం. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ ఒకసారి కాదు, రెండేసి సార్లు భాషా సంఘం తిరిగింది. సమీప జిల్లాలను ఒకచోట కలిపి ప్రాంతీయ సదస్సులు జరిపి తెలుగు భాష వాడకాన్ని పెంచడానికి అవగాహన కల్పించాం. ఒక్కమాటలో చెప్పాలంటే – ఇంత కృషికీ ఆచరణ దోహదపడింది... వైఎస్ రాజశేఖరరెడ్డి– రోశయ్య చేసిన ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులేనని మరచిపోరాదు! ప్రముఖ భాషా సాహిత్యకారుడు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు ఏనాడో (1917) అన్నట్టుగా ఆయా మండలాల్లో వాడే భాషలు ఇతరులకు తెలియనంత మాత్రాన ఆ భాష చెడ్డదనడం, స్థాయి తక్కు వదనడం తప్పు. ‘మారడం, మార్పు చెందడం భాషకు అత్యంత సహజం’! అందుకే మన కాళోజి నారాయణరావు మాతృ భాషను, మాండలిక భాషనే సమర్థించాల్సి వచ్చింది... ‘‘తెలుగు బాస ఎన్ని తీర్లు తెలుగు యాస ఎన్ని తీర్లు వాడుకలున్నన్ని తీర్లు వాడుక ఏ తీరుగున్నా తెలుగు బాస వాడుకయే అన్ని తీర్ల వాడుకకు పరపతి – పెత్తనమొకటే’ ... అన్నారు కాళోజీ! ఇలా కింది స్థాయి వరకు తెలుగు అధికారులంతా, అధికార భాషగా భాష వాడకాన్ని పెంచడానికి అవసరమైన ప్రత్యేక బడ్జెట్‌ను తొలిసారిగా ఆమోదించిన ఘనత వైఎస్ – రోశయ్యల హయాంకే దక్కింది! చివరికి న్యాయస్థానాల్లో తీర్పులు సహితం తెలుగులోనే వచ్చేలా చేయడం ఈ ప్రత్యేక బడ్జెట్ వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే బౌద్ధం నాగరీక ధర్మం కాబట్టే అది కాలు పెట్టిన దేశాలన్నిటా అక్కడి సంస్కృతులను నాగరీకరించి మరీ సుసంపన్నం చేయడంతోపాటు, అది వాటితో ఏకమై, తనతో ఇముడ్చుకోగలిగింది. అంతవరకూ అర్ధ నాగరిక, బర్బర, యక్షనాగుల జాతిని మహాభారతం సహితం ‘అంధక జాతి’ అని పిలవగా ఆ మాటను సవరించి ‘ఆంధ్ర జాతి’గా పరిగణించిన ఖ్యాతి ఒక్క బౌద్ధానికే దక్కిందని మరచిపోరాదు. కనుకనే బౌద్ధం పునర్వికాసానికి, భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ అంబేడ్కర్ చరమదశలో పూనుకున్నారు. దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది దళితుల్ని బౌద్ధులుగా ఆయన పరివర్తింప జేశారు. ఇలా దక్షిణ భారతదేశంలో బౌద్ధ పునర్వికాసానికి తోడ్పడిన వారెందరో ఉన్నారు. అందుకే అన్నాడు మహాకవి గురజాడ.. ‘బౌద్ధాన్ని భారతదేశ సరిహద్దులు దాటించి దేశం ఆత్మహత్య చేసు కుంది’ అని! ఇప్పుడీ ఆత్మహత్యా ప్రయత్నంలో భాగమే భారతీయ భాషల సంరక్షణలో ఎదురవుతున్న సంకటం! వర్తక వ్యాపారానికి లాభాల వేటలో ప్రపంచీకరణ పేరిట ఇంగ్లిష్ భాషా పెత్తనాన్ని స్థిరపరచడం కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగు తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసంఖ్యాకమైన దేశీయ భాషల సహజ పురోభివృద్ధికి కృత్రిమ ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సందర్భం గానే ఐక్యరాజ్యసమితి విద్యా సాంస్కృతిక శాఖ నిద్ర మేల్కొని దేశీయ మాతృ భాషల సంరక్షణకు పదే పదే హెచ్చరికలు జారీ చేయవలసి వచ్చింది. ప్రపంచ భాషా పటంలో ప్రతి పదమూ ఒక ఆణిముత్య మనీ, దాని సొగసును, సోయగాన్నీ రక్షించుకోవడం మాతృభాషా ప్రేమికుల కర్తవ్యమనీ ఐరాస విద్యా సాంస్కృతిక శాఖ ఆదేశించిం దన్న సంగతిని మనం ఎన్నటికీ మరవరాదు! అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాల కల్పన కోసం ఇంగ్లిష్ భాషకు ప్రాధాన్యం కల్పించడం ఎంత అవసరమో.. ప్రాంతీయ భాషగా తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా చేయడం అంతే అవసరం. ఈ ముందు చూపు ఏపీ ప్రభుత్వానికి ఉన్నందునే ఆంధ్ర, ఆంగ్ల భాషల మేలు కలయికగా పాఠశాల, కళాశాల స్థాయిలో భాషా మాధ్య మాన్ని పరివర్తింపచేశారని మర్చిపోరాదు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
మాతృభాషకు ప్రాధాన్యం తెలుగు వికీపీడియా సదస్సు–2020లో వక్తలు
రాయదుర్గం: విజ్ఞానమంతా ఆంగ్లంలోనే నిక్షిప్తమై ఉందని, దాన్ని అనువదించి భవిష్యత్తు తరాలకు అందించాలంటే మాతృభాష తెలుగుకు ప్రాధాన్యమివ్వాలని వికీపీడియా సదస్సు–2020లో వక్తలు అభిప్రాయపడ్డారు. వికీపీడియాలో ప్రస్తుతం దాదాపు 72 వేల వరకూ ఉన్న వ్యాసాలను ఏడు లక్షలకు పెంచాలని సదస్సులో తీర్మానించారు. గచ్చిబౌలి ట్రిపుల్ఐటీ–హైదరాబాద్‌లోని కోహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలిజెంట్ సిస్టమ్స్ (కేసీఐఎస్) ఆడిటోరియంలో శనివారం ‘ప్రాజెక్ట్ తెలుగు వికీ’ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొని మాట్లాడుతూ.. వికీపీడియాలో వ్యాసాలు పెంచడం కోసం ప్రత్యేక యంగ్ బ్రిగేడ్‌ను తయారు చేసేందుకు ట్రిపుల్ఐటీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సాంస్కృతిక శాఖ ద్వారా అనేక చారిత్రక, భాషా, పండుగల కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటుతున్నామని పేర్కొన్నారు. వికీపీడియాలోనే కాకుండా ఎక్కడైనా మాట్లాడే భాష, రాసే భాష వేర్వేరుగా ఉండాలని అనుకుంటారనీ, కానీ మాట్లాడే భాషలోనే రాయడం మంచిదని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు. సాంకేతిక విజ్ఞానం పెరగడంతో మనిషి మేధస్సు పెరిగినా మనస్సు మాత్రం పెరగడం లేదని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం డిజిటల్ లిటరసీ సమస్య ఉందని, వికీపీడియాలో ఏడు మిలియన్ల ఇంగ్లిష్ వ్యాసాలుంటే అవి అమెరికా, యూరోప్ వాళ్లు రాసినవేనని ట్రిపుల్ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. వికీపీడియాపై ఉచిత శిక్షణ ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో ఉచితంగా ప్రతీ శుక్రవారం వికీథాన్ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, ప్రతీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వికీపీడియాపై శిక్షణ నిర్వహిస్తున్నామని ట్రిపుల్ఐటీ ఆర్ అండ్ డీ మాజీ డీన్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ చెప్పారు. తెలుగు వికీపీడియాలో వ్యాసాల సంఖ్య గణనీయంగా òపెంచేందుకు హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ఐటీలో ప్రాజెక్టు తెలుగు వికీ పేరిట ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పీజేనారాయణన్ తెలిపారు. ఈ సదస్సులో ఇంకా ట్రిపుల్ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు శ్రీనిరాజు, వెంకటేశ్వర్లు, దిలీప్‌కొణతం, ప్రవీణ్ గరిమెల్ల, ప్రాజెక్టు తెలుగు వికీ బృందం, పలువురు మేధావులు, ట్రిపుల్ఐటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. -
తేట తెలుగు వనిత
మాతృభాష అనేకన్నా మదర్‌టంగ్ అంటేనే తొందరగా అర్థమవుతుంది.. ఇది నేటిపరిస్థితి. కెరీర్అవకాశాలే లక్ష్యంగా సాగుతున్న నేటిచదువుల్లో మాతృభాష అధ్యయనంపై దృష్టితగ్గుతోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులు చక్కటి తెలుగు తెలిసిన వారి సంఖ్య చాలా తక్కువ. రేపటి తరాలు తెలుగు భాషకు మరింత దూరమయ్యేఅవకాశాలు లేకపోలేదు. అచ్చంగా తెలుగు ద్వారా నెట్లో తెలుగు రాసే వారి సంఖ్యను, తెలుగు మాట్లాడేవారి సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తున్నాం.– భావరాజు పద్మిని సాక్షి,సిటీబ్యూరో: ‘కాఫీ సరస్సు లాంటిది.. నిర్ణీత పాలల్లో పాలు చక్కెర, డికాషన్ కలిస్తేనే దానికి రుచి. కానీ టీ సముద్రం లాంటిది. తనతో ఏ ఫ్లేవర్నైనా కలుపుకు పోతుంది.. ఆ పరిమళాన్ని ఆపాదించుకుని, కొత్త రుచిని సంతరించుకుంటుంది’.. ఈ మాటలు అచ్చంగా ‘తెలుగు ఆన్లైన్’ మాసపత్రిక ఎడిటర్ భావరాజు పద్మిని రాసినవి. నిజంగా ఆమె కూడా ఇంతే, కొత్త పరిమళాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తూ, కొత్తదనాన్ని అందుకుంటూ, పంచుకుంటూ సాగుతున్నారు. ఇంట్లో ఉండి ఏం చెయ్యగలం అని డీలా పడే మహిళలెంతో మందికి మహిళలు ఎక్కడున్నా అనుకున్నది సాధించగలరని ఆదర్శంగా నిలుస్తున్నారు. వీణ వాయిద్యం, సంగీతం, సంప్రదాయ నృత్యాల్లో ప్రవేశమున్న పద్మిని లాభాపేక్షతో కాకుండా ఆసక్తితో ఏడేళ్లుగా తెలుగు భాషకు తనవంతు సేవ చేస్తున్నారు. తెలుగులో ఈ మెయిల్స్ రాయటం నుంచి 60 వేల సభ్యులుతో తెలుగు గ్రూపుని, తెలుగు ఆన్లైన్ మ్యాగ్జైన్ని, 10కి పైగా బ్లాగులను, యూట్యూబ్ చానల్స్‌ని నిర్వహిస్తున్నారు. వీలైనంత మందితో తెలుగులో రాయించటం, చదివించటం తెలుగు బిడ్డగా నా కర్తవ్యంమంటున్న పద్మిని చెప్పిన మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే.. మాటా.. మంతీ.. ఎల్బీ శ్రీరాంతో.. గుంటూరు దగ్గరలో చిన్న పల్లెలో పెరిగాను. నాన్న కృష్ణ ప్రసాద్ బ్యాంక్ ఉద్యోగి, అమ్మ పద్మావతి గృహిణి. అమ్మ చాలా కథలు చెప్పేది. ముగ్గులు, కుట్లు, అల్లికలతో పాటు వీణ వాయించటం కూడా నేర్పించారు. అమ్మ చెప్పిన కథలే సాహిత్యం వైపు నడిపించాయి. ప్రభుత్వ తెలుగు మీడియంలో చదువుకున్నాను. పాఠాలు బాగా చెప్పేవారు. పండగలప్పుడు పాటలు, కథలు రాయించేవారు. అది రచన వైపుకి మళ్లించింది. ఇంటర్ కాగానే హైదరాబాద్ వచ్చేశాం. డిగ్రీ చదువుతున్నప్పుడే కథ రాశాను. కొత్తగా నగరానికి వచ్చిన మాకు అన్నీ విచిత్రంగా కనిపించేవి. అప్పట్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత ఇంటికి రావడానికి చాలా రోజులు పట్టేది. ఎన్నో చోట్లకి ఒకరి ఇంటి నుంచి ఇంకో ఇంటికి తిరిగి తిరిగి వచ్చేది. దీనినే ‘చక్రభ్రమణం’ పేరుతో కథగా రాశాను. నగరంలో పూలు దొరక్కపోవటంపై ‘మహానగరంలో మందారపువ్వు’ కథ రాసాను. తర్వాత నుంచి నా రచనలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కొన్ని ఆన్లైన్లోను వచ్చాయి. ఉద్యోగం చేయకున్నా.. చదువులో క్లాస్‌లో టాపర్‌ని. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీతో పాటు బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సు పూర్తి చేశాను. పెళ్లికి ముందు లెక్చరర్‌గా పనిచేశాను. పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం చేయడం సాధ్యం కాదని తెలిసింది. జీమెయిల్లో తెలుగు టైపింగ్ 2011లో వచ్చింది. అప్పటి నుంచి అందరికీ తెలుగులో మెయిల్స్ పంపించేదాన్ని. చదివిన వారు, చాలా మంది బాగుందని ప్రోత్సహించే వారు. దాంతో 2012లో ఫేస్బుక్లో అచ్చంగా తెలుగు పేజీని ప్రారంభించాను. రోజు జరిగే విషయాలను సరదాగా ఉండేలా రాసి పోస్ట్ చేసే దాన్ని. అలా ఫేస్బుక్ గ్రూప్‌లో 60 వేల మంది చేరారు. ఐదేళ్ల క్రితం ఆన్లైన్ పత్రికను ప్రారంభించాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లకి సాహిత్య వారధిలా పనిచేస్తోంది. ఫ్రీలాన్సర్‌గా రేడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఏడాదిగా డిడి యాదగిరి లో ’సాహితీ సౌరభాలు’ అనే కార్యక్రమానికి యాంకరింగ్ చేస్తున్నాను. ‘మైండ్ మీడియా’ ఆన్లైన్ రేడియోకు ప్రోగ్రాం డైరెక్టర్‌గా పని చేశాను. ఈ ప్రస్థానంలో అనేకమంది సాహిత్యదిగ్గజాలను కలుసుకున్నాను. సిరివెన్నెల, రామజోగయ్య శాస్త్రి, భువనచంద్ర నా రచనలు చదివి ప్రశంసించడం మరువలేను. అప్పుడు ఒక్కదాన్నే.. ఇప్పుడు ఎంతో మంది సహకారం తోడైంది. -
తెలుగు వారి ఓట్లు ఏ పార్టీకి పడనున్నాయో?
హొసూరు: శాసనసభ సాధారణ ఎన్నికల్లో తమిళనాడులో తెలుగు వారి ఓట్లు ఏ రాజకీయ పార్టీకి పడనున్నాయోనని రాజకీయ పరిశీలకులంటున్నారు. తమిళనాడు రాష్ర్టంలో 40 శాతం తెలుగువారున్నారు. రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు వారి మాతృభాష తెలుగులో చదువుకుంటున్నారు. 2006లో అప్పటి డీఎంకే ప్రభుత్వం నిర్బంధ తమిళభాషా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టంను అప్పట్లో తెలుగు భాషా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 2011లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ జయకేతనం ఎగురవేసింది. జయలలిత ముఖ్యమంత్రి కావడంతో సమస్యలు పరిష్కారమవుతాయని పలువురు భావించారు. జయలలిత పట్టించుకోలేదు. ఈ విషయంపై హొసూరు ఎమ్మెల్యే కే.గోపీనాథ్, తళి టి.రామచంద్రన్, వాణియంబాడి ఎమ్మెల్యేలు శాసనసభలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ర్టంలో భాషా అల్పసంఖ్యాకుల భాషా సమస్యలు పరిష్కరించలేదు. తీరా చూస్తే నిర్బంధ తమిళ భాషా చట్టానికి పదును పెట్టారు. ఇందువల్ల 2016 విద్యాసంవత్సరంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే మైనార్టీ విద్యార్థులు అయోమయంలో పడ్డారు. తెలుగు, కన్నడ, మళయాళ, ఉర్దూ విద్యార్థులు నిర్బంద తమిళభాషా భోదనా విధానంతో విద్యార్థులు కన్నీరు మున్నీరయ్యారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళన చెందారు. చివరి నిమిషంలో తెలుగు సంఘాలు పోరాటాన్ని ఉధృతం చేశారు. అయినా ముఖ్యమంత్రి జయలలిత పట్టించుకోలేదు. హొసూరు ఎమ్మెల్యే కే. గోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించటంతో, చివరి నిమిషంలో విద్యార్థులు వారివారి మాతృభాషల్లో పబ్లిక్ పరీక్షలు రాసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. విద్యార్థులు నిర్బంధ తమిళభాషా చట్టంతో వేదనకు గురైయ్యారు. ఈ విషయమై అప్పట్లో జయప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థుల ఉసురు జయకు తప్పకుండా తగులుతుందని తెలుగు భాషాభిమానులు, రాజకీయ పరిశీలకులు అంటున్నారు.