మణికొండ: దేశంలో ప్రధాన పరీక్షలను మాతృభాషలోనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం హర్షణీయమని, పరిపాలన, న్యాయ, వైద్య, శాస్త్ర సాంకేతిక లాంటి అన్ని రంగాలలో మాతృభాషను అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం నార్సింగిలో సీనియర్ బీజేపీ నాయకుడు పి.మురళీధర్‌రావు సారధ్యంలో తెలుగు సంగమం సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మాతృభాషను చిన్నచూపు చూసే భావన పోవాలన్నారు. గతంలో ప్రపంచానికే విశ్వగురువులుగా ఉన్న మనం రాబోయే పదేళ్లలో తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటామని వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. మనది దీపం వెలిగించే సంస్కృతి అని.. అదే పాశ్చాత్య దేశాల వారు వాటిని ఆర్పి ఉత్సవాలు చేసుకుంటారని వ్యాఖ్యానించారు. బీబీసీ డాక్యుమెంటరీలో ప్రధానమంత్రి మోదీ పట్ల అవమానకరంగా కథనం ప్రసారం చేయటం దేశానికే అవమానంగా భావించాలన్నారు. తాను పదవీ విరమణే చేశానని, పెదవి విరమణ చేయలేదని, రిటైర్డ్ అయ్యాను తప్ప టైర్డ్ కాలేదని ఆయన చమత్కరించారు.
మన సంస్కృతి ఎంతో గొప్పది..
మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రస్తుతం ప్రపంచమంతా ఆచరిస్తున్నారని, మనం మాత్రం వారు వదిలిపెట్టిన సంస్కృతి వెంట పడుతున్నామని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాతృభాషకు మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రధాన పరీక్షలను స్థానిక భాషల్లోనే నిర్వహించేందుకు ముందుకు రావటం మంచి పరిణామమన్నారు. కార్యక్రమంలో సినీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు, పద్మశ్రీ డాక్టర్ శోభరాజు, డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ, లక్ష్మీనారాయణ, కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment