= నానాటికీ పెరుగుతున్న ఏటీఎం నేరాలు
= దేశంలో మూడో స్థానంలో కర్ణాటక
= దక్షిణాదిలో ప్రథమం
= వినియోగదారులకు భద్రత కరువు
= అలసత్వం వీడని పాలకులు, అధికారులు
= విదేశీ పర్యటనలకే పరిమితమైన ‘అధ్యయనం’
సాక్షి, బెంగళూరు : ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు బ్యాంకర్లు ప్రవేశపెట్టిన ఏటీఎం (ఆటోమెటిక్ టెల్లర్ మిషన్) వ్యవస్థ అసాంఘిక శక్తులకు వరప్రసాదమవుతోంది. ఏటీఎం ఏర్పాట్లపై ఉన్న శ్రద్ధ వాటి సంరక్షణపై చూపకపోవడంతో ప్రజాధనానికే కాదు.. వినియోగదారుల ప్రాణాలకే భద్రత లేకుండా పోతోంది. మొన్నటిమొన్న మహదేవపుర వద్ద ఉన్న ఏటీఎం కేంద్రంలో సెక్యూరిటీ గార్డు హత్య, తర్వాత కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్‌పై దాడి, నిన్న సెక్యూరిటీ గార్డుపై దాడి ఘటనలు ఇందుకు అద్దం పడుతున్నాయి.
సంఘటన చోటు చేసుకున్నప్పుడు హడావుడి చేయడం తప్ప అసలు సమస్యకు పరిష్కారం కనుగొనడంలో బ్యాంకర్లు, పాలకులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఏటీఎం కేంద్రాల్లో చోటు చేసుకుంటున్న నేరాల్లో దేశవ్యాప్తంగా పోలిస్తే కర్ణాటక మూడో స్థానం, దక్షిణాది రాష్ట్రాలలో మొదటి స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించేలా ఉన్న ఏటీఎం దోపిడీలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మేరకు ఏటీఎం కేంద్రాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర హోం శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల ఓ లేఖ రాసింది.
అమలుకు నోచుకోని విదేశీ అధ్యయనాలు!
రాష్ట్ర ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా అధ్యయనం పేరిట ప్రజా ప్రతినిధులు విదేశాలకు వెళ్తున్న విషయం తెలిసిందే.
అక్కడ వారు అధ్యయనం చేసిన విషయాలను ఇక్కడ అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే విమర్శలూ లేకపోలేదు. ఏటీఎంల నిర్వహణ విషయంలోనే ఈ విషయం తేటతెల్లమవుతోంది. విదేశాల్లోని ఏటీఎం కేంద్రాలు అక్కడి పోలీస్ స్టేషన్, అగ్నిమాపక కేంద్రాలతో అనుసంధానమై ఉంటాయి. విపత్కర పరిస్థితుల్లో ఏటీఎం కేంద్రాల్లోని అలారం మీట నొక్కితే అయా పోలీస్ స్టేషన్లు, అగ్నిమాపక కేంద్రాలు అప్రమత్తమై క్షణాల్లో అక్కడకు చేరుకునే సదుపాయం విదేశాల్లో ఉంది. ఇలాంటి వ్యవస్థ ఇక్కడ లేకపోవడం గమనార్హం. దీంతో ఏటీఎం కేంద్రాల్లో లూటీ, దాడులు నిత్యకృత్యమవుతున్నాయి.
2013లో చోటు చేసుకున్న ముఖ్య ఏటీఎం దురా‘గతాలు’..
= బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌లోని కార్పొరేషన్ ఏటీఎం కేంద్రంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళుతున్న వ్యాన్‌ను ముసుగులు ధరించిన ఏడుగురు మారణాయుధాలతో అటకాయించి, రూ.1.91 కోట్ల నగదును లూటీ చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకూ కేవలం రూ. 50 లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.
= నాగశెట్టిహళ్లిలోని కెనరా బ్యాంక్ ఏటీఎంను ధ్వంసం చేసిన ముగ్గురు వ్యక్తులు రూ.31.9 లక్షల నగదును దోచుకున్నారు. తర్వాత వీరిని పోలీసులు పట్టుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో నగదు రికవరీ చేయలేకపోయారు.
= ఔటర్ రింగ్ రోడ్డు మహదేవపుర వద్ద ఉన్న ఏటీఎంను ముగ్గురు వ్యక్తులు దోచుకోవడానికి విఫల యత్నం చేశారు. అడ్డు వచ్చిన సెక్యూరిటీ గార్డును చంపేశారు.
= కార్పొరేషన్ బ్యాంక్ ఉద్యోగి జ్యోతి ఉదయ్‌పై 40 రోజుల క్రితం ఏటీఎం కేంద్రంలో జరిగిన పాశావిక దాడిలో నిందితుడి ఆచూకీని ఇప్పటికీ పోలీసులు గుర్తించలేకపోయారు.
= హొంగసంద్రలోని ఎస్‌బీఎం ఏటీఎం లూటీకి ఇద్దరు విఫల యత్నం చేశారు. ఈ ఘటనలో ఒక దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఏటీఎం సెక్యూరిటీ గార్డు షహబుద్దీన్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
లక్షలే లక్ష్యం
Published Thu, Jan 2 2014 5:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 AM
Advertisement
Advertisement