సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నైరుతి రుతు పవనాల ఆగమనం సందేహాస్పదంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఆందోళన పెరుగుతోంది. జూన్‌లో ముఖం చాటేసినా, జులై తొలి వారంలో వాటి రాక ద్వారా వర్షాలు పడుతాయనే వాతావరణ శాఖ అంచనాలు కూడా తలకిందులవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడింది.
మేఘ మథనంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీనిపై వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. తదుపరి మంత్రి వర్గం సమావేశంలో ఆమోదానికి ఈ ప్రతిపాదనలు రానున్నాయి. వ్యవసాయ, భారీ నీటి పారుదల శాఖ అధికారులు దీనిపై ప్రాథమిక కసరత్తును పూర్తి చేశారు. వచ్చే పది రోజుల్లో వర్షాలు పడకపోతే మేఘ మథనం మినహా వేరే మార్గం లేదనే నిర్ణయానికొచ్చారు. రాష్ర్టంలో తొలిసారిగా 2002లో, తదుపరి 2012లో మేఘ మథనాన్ని నిర్వహించారు.
పస్తుత టెక్నాలజీతో పోల్చుకుంటే అప్పటి టెక్నాలజీ ఎంతో వెనుకబడి ఉండేది. మేఘాలు నిర్దుష్ట ప్రాంతంలో గుమికూడిన గంటలోగా మేఘ మథనాన్ని నిర్వహించాలి. అయితే అంత తక్కువ వ్యవధిలో మేఘాల సమీపానికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ఎయిర్‌క్రాఫ్ట్‌లు గతంలో అందుబాటులో లేవు. అన్నీ సర్దుకుని అక్కడికి వెళ్లేసరికి మేఘాలన్నీ చెల్లా చెదురయ్యేవి. దరిమిలా గత రెండు దఫాలు నిర్వహించిన మేఘ మథనాలు విఫలమయ్యాయి. ప్రస్తుతం అత్యంత వేగంతో మేఘాల వైపు దూసుకెళ్లే అధునాత ఎయిర్‌క్రాఫ్ట్ అమెరికాలో ఉంది. ఆ ఎయిర్‌క్రాఫ్ట్ సేవలను వినియోగించుకోవడానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం ప్రృకతి వైపరీత్యాల నిర్వహణా విభాగాన్ని ఆదేశించింది.
ఇక మేఘ మథనమే
Published Sun, Jul 6 2014 2:48 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement