
నిగ్గు తేల్చండి
భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి నివారణకు అధికశాతం మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
⇒ దిగుమతి మందుల నాణ్యతపై హైకోర్టులో పిటిషన్
⇒ ఎయిర్‌పోర్టు, హార్బర్లలో ల్యాబ్‌ల ఏర్పాటుకు వినతి
⇒ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయమూర్తి ఆదేశాలు
చైనా నుంచి తమిళనాడుకు దిగుమతయ్యే ఫార్మసీ మందుల నాణ్యతను పరిశీలించేందుకు అన్ని విమానాశ్రయాలు, హార్బర్లలో నిపుణుల కమిటీని నియమించాల్సిందిగా కోరుతూ మద్రాసు హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి నివారణకు అధికశాతం మందులు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఇలా విదేశాల మందుల్లో అధికశాతం చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. 1991లో చైనా నుంచి భారత్‌కు దిగుమతైన మందుల్లో చైనా వాటా 0.3 శాతం మాత్రమే. అయితే ప్రస్తుతం చైనా నుంచి భారత్‌కు దిగుమతయ్యే మందుల్లో యాక్టివ్ ఫార్మాసూటికల్స్ ఇంగ్రీడియన్స్ (ఏబీఐ) అనే మందుల ముడిసరుకు సరఫరా మాత్రమే 92 శాతంగా ఉంది. భారతదేశ మందుల తయారీని గత పాతికేళ్లలో చైనా కొంచెం కొంచెంగా మింగేసింది.
చైనా నుంచి దిగుమతయ్యే మందులపై పరిశోధనలు లేదా నాణ్యత పరిశీలనలు సాగడం లేదు. చైనా దిగుమతుల కారణంగా భారతదేశంలోని మందుల తయారీ కంపెనీలు మూతపడే స్థితికి చేరుకోవడంతో చైనా మందుల నాణ్యత పరిశీలనకు నిపుణులతో కూడిన కమిటీని కేంద్రం నియమించింది. చైనా నుంచి దిగుమతి అవుతున్న నాసిరకం మందులు ప్రజాబాహుళ్యంలోకి ప్రవేశించేలోగానే అన్ని విమానాశ్రయాలు, హార్బర్లలో నాణ్యతపై పరిశోధన కేంద్రాలు, స్వదేశీ మందులను ప్రోత్సహించేందుకు మెడికల్ హబ్‌ల ఏర్పాటుపై నిపుణుల కమిటీ కేంద్రానికి సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులను యుద్ధప్రాతిపదికన అమలు చేస్తామని 2015లో హమీ ఇచ్చిన కేంద్రం ‘మందుల తయారీ ముడిసరుకుల ఏడాది–2015’ అనే ప్రకటనతో సరిపెట్టుకుంది.
హైకోర్టులో పిటిషన్
ఈ దశలో కేంద్ర ప్రభుత్వం మందుల ముడిసరుకుల సేకరణ లక్ష్యాన్ని నిరసిస్తూ వినకెమ్ లేబ్స్ అనే మందుల పరిశోధన కేంద్రం బుధవారం కోర్టులో పిటిషన్ వేసింది. భారతదేశంలోని వ్యాధిగ్రస్తుల మేలు, దేశీయ విజ్ఞాన సంపద, తమిళనాడు రైతులు ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ముడిసరుకుల సేకరణ లక్ష్యంలోని నిబంధనల్లో మార్పుతెచ్చేలా ఆదేశించాలని ఆ సంస్థ కోరింది. అలాగే దేశంలోని అన్ని హార్బర్లు, విమానాశ్రయాల్లో మందుల పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎన్ కృపాకరన్ మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నాబార్డు బ్యాంకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పిటిషన్ దారుకు బదులివ్వాల్సిందిగా ఆదేశించారు.