ఎకరన్నర కోసం పోరాడితే..
ఆరుడుగుల స్థలం దక్కింది
- పొలం పట్టా కోసం రైతు ప్రదక్షిణలు
- మనస్తాపంతో నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం
- చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మృతి
- భారీ బందోబస్తు మధ్య అంత్యక్రియలు
ఆలమూరు (రుద్రవరం): ఓ నిరుపేద రైతు ఎకరన్నర పొలాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గ్రామంలో కొందరు ఆ పొలంపై కన్నేసి ఆక్రమించే ప్రయత్నం చేశారు. పొలం పట్టా కోసం రైతు కొన్నేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా కరుణించలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరుగుతుందని భావించి కలెక్టర్‌ను కలిసే ప్రయత్నం చేయగా అవకాశం దక్కలేదు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎకరన్నర పొలం కోసం పోరాడితే చివరకు ఆరుడుగుల స్థలం దక్కింది. రైతు ప్రాణం పోయిన తర్వాత అధికారులు ఇప్పుడు న్యాయం చేస్తామని ముందుకొచ్చారు.
రుద్రవరం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన రైతు పోతురాజు కిరణ్ (23) 1.58 ఎకరాల పొలం కోసం పోరాడి చివరకు మృత్యుఒడి చేరాడు. నాలుగు రోజుల క్రితం కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు శనివారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఆదివారం మధాహ్నం మృతదేహాన్ని భారీ పోలీసు బందోభస్తు మధ్య స్వగ్రామానికి తీసుకొచ్చారు. అయితే గ్రామంలో కొందరు మృతదేహాన్ని గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి ఆధ్వర్యంలో శిరివెళ్ల, ఆళ్లగడ్డ సీఐలు ప్రభాకర్ రెడ్డి, దస్తగిరి బాబుతోపాటు ఆళ్లగడ్డ సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలతో పాటు ఏఎస్‌ఐలు, 100 మంది పోలీసులతో గ్రామం చేరుకున్నారు. ప్రతి వీధిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. స్థానిక శ్మశానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడికి భార్య విజయ, మూడేళ్ల కుమారుడు, తమ్ముడు దేవదాసు, నాన్నమ్మ మరియమ్మ ఉన్నారు.
ఆర్థిక సాయం అందజేత:
మృతుడి కుటుంబానికి కలెక్టర్ ప్రత్యేక నిధుల నుంచి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని అధికారులు చెక్ రూపంలో అందించారు. జిల్లా కలెక్టర్ విజయ మోహన్ ఆదేశాల మేరకు నంద్యాల ఆర్‌డీఓ సుధాకర్ రెడ్డి, రుద్రవరం తహసీల్దార్‌లు మాల కొండయ్య, ఆళ్లగడ్డ ఇన్‌చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసులు గ్రామానికి చేరుకుని రైతు కిరణ్ మృతు దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆర్‌డీఓ మాట్లాడుతూ మృతుని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 447 సర్వే నెంబర్‌లోని భూమి 1.58 ఎకరాలకు పట్టా ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరాగా.. ఆర్‌డీఓ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేస్తే వారి వాయిస్ రికార్డు చేసి కలెక్టర్‌కు నివేదిస్తామని ఆర్‌డీఓ తెలిపారు.