డ్రైవర్ హత్య కేసులో ఇద్దరి అరెస్టు
Published Wed, Oct 2 2013 12:09 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: చెన్నై కొట్టివాక్కంలో సోమవారం సాయంత్రం జరిగిన కారు డ్రైవర్ హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కొట్టివాక్కం వెంకటేశ్వరపురం కామరాజర్ వీధికి చెందిన సెంథిల్ కారు డ్రైవర్. అతని భార్య ముంతాజ్. సోమవారం సాయంత్రం ముంతా జ్ సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంటిలో ఒంటరిగా ఉన్న సెంథిల్‌ను ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేసి పరారయ్యారు. ఇంటికి వచ్చిన ముంతాజ్ భర్త మృతి చెంది ఉండడాన్ని చూసి దిగ్భ్రాంతి చెంది బోరున విలపించింది.
దీంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని పోలీ సులకు ఫిర్యాదు చేశారు. నీలాంకరై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. హత్య జరిగిన స్థలంలో హంతకులు వదిలి వెళ్లిన కత్తి, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివాహేతర సంబంధం వ్యవహారంలో సెంథిల్‌ను అతని పెదనాన్న కుమారుడు సుకుమారన్, అతని మిత్రులు మణి, కోటీశ్వరన్ హత్య చేసినట్టు తెలిసింది. వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కొట్టివాక్కం ప్రాంతంలో దాగివున్న మణి, కోటీశ్వరన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు వారు ఇచ్చిన వాగ్మూలంలో తాము, సుకుమారన్ స్నేహితులమని తెలిపారు.
కొన్ని నెలల క్రితం సుకుమారన్ ఇంటి పైఅంతస్తులో అతని బంధువువైన సెంథిల్ అద్దెకు చేరాడని పేర్కొన్నారు. ఆ సమయంలో సుకుమారన్ భార్య లక్ష్మికి, సెంథిల్‌కు వివాహేతర సంబంధం ఏర్పడిందని వెల్లడించారు. ఈ సంబంధాన్ని మానుకోవాలని సెంథిల్‌ను సుకుమారన్ హెచ్చరించాడని తెలిపారు. సెంథిల్ కుమార్ తన ప్రవర్తన మార్చుకోలేదని, అందుకే అతన్ని హత్య చేయాలని పథకం వేసి సోమవారం మధ్యాహ్నం ఒంటరిగానున్న సమయంలో హత్య చేసినట్టు తెలిపారు. ప్రధాన నిందితుడు సుకుమారన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
Advertisement