రాష్ట్రంలో రాజకీయ పార్టీల్లో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్‌లు తమ తొలి జాబితాను శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు పార్టీల్లో వరుసగా 20 మంది, 14 మందికి టికెట్లు దక్కాయి. వీరిలో చాలా మంది సిట్టింగ్ పార్లమెంటు సభ్యులే కావడం గమనార్హం. టికెట్లు దక్కిన వారిలో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఆదివారం నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
మిగిలిన వారంతా సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం చేయనున్నారు. అయితే ఈ రెండు పార్టీల్లో కూడా మొదటి జాబితాలో ప్రముఖులైన సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు దక్కలేదు. వీరిలో కాంగ్రెస్ నుంచి కేంద్రమంత్రి వీరప్పమొయిలీ (చిక్కబళాపుర), బీజేపీ నుంచి టీబీ చంద్రేగౌడ (బెంగళూరు ఉత్తర) టికెట్లు దక్కించుకోలేకపోయారు. దీంతో ఇరు పార్టీలకు అసమ్మతి సెగ తగులుతోంది.
వీరప్పమొయిలీకు రెండో జాబితాలో టికెట్టు దక్కుతుందని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ చెబుతున్నా ఆయన అనుచరులు శాంతించడం లేదు. మంత్రి కృష్ణబైరేగౌడకు టికెట్టు కేటాయించాలనే ఉద్దేశంతోనే వీరప్పమొయిలీకు మొండి చెయ్యి చూపించారనేది రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, సదానందగౌడకు టికెట్టు కేటాయించడం ఖారారైన ప్పటి నుంచి చంద్రేగౌడ పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీంతో ఇరు పార్టీలు అసమ్మతులను బుజ్జగించే పనిలో పడ్డారు. రాజకీయ పార్టీల పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల విధుల్లో ప్రధాన పాత్ర వహించే పోలీసు, అబ్కారీ, ఎన్నికల కమిషన్ రాష్ట్ర శాఖల పరిస్థితి మరోలా ఉంది. నల్లధనం బయటకు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు వివిధ చెక్‌పోస్టుల్లో నిఘా పెంచారు.
అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అదే విధంగా అసాంఘిక శక్తులపై నిఘా ఉంచారు. ఇక ఎన్నికల వేళ అక్రమ మద్యం విక్రయాలపై కూడా అధికారులు దృష్టి సారించారు. సమాచారం కోసం బెంగళూరు కేంద్రంగా 24 గంటలూ పనిచేసే కాల్‌సెంటర్‌ను అబ్కారీ శాఖ ఏర్పాటు చేసింది. సమాచారం తెలిసినవారు 080-22103105కు ఫోన్‌చేయవచ్చు. ఓటరు కార్డు ఉండి ఓటరు జాబితాలో పేర్లులేనివారు తమ పేర్లను చేర్చుకోవడానికి వీలుగా ఎన్నికల కమిషన్ రాష్ట్ర శాఖ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించింది. అంతేకాకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించే వారిని గుర్తేంచేందుకు వీలుగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసే పనిలో ఎన్నికల అధికారులు తలములకలై ఉన్నారు.
నేడు రెండు రెండు పార్టీల జాబితా...
ఇక రాష్ట్రంలో మరో ప్రధాన పార్టీ జేడీఎస్ కూడా నేడు (సోమవారం) తన తొలిజాబితాను ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ పార్టీ తరఫున హాసన్ నుంచి మాజీ ప్రధాని పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ, శివమొగ్గ నుంచి శాండిల్‌వుడ్ నటుడు శివరాజ్‌కుమార్ భార్య గీత శివరాజ్‌కుమార్ పోటీచేయనున్నారు. ఇక అమ్‌ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలో రాష్ట్ర పార్లమెంటు స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల పేర్లతో కూడిన తొలిజాబితా నేడు విడుదలచేయనున్నట్లు పార్టీ రాష్ట్ర శాఖ ప్రతినిధి మహంతేష్ ‘సాక్షి’కి తెలిపారు.
కాంగ్రెస్ ‘అంతర్గత’ం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం తొలిసారిగా అంతర్గత ఎన్నికలు నిర్వహించింది. ప్రకటించిన రెండు లోక్‌సభ స్థానాలకు గాను ఆదివారం మొదట మంగళూరులో నిర్వహించారు. ఆ పార్టీ పదాధికారులు, కార్యకర్తలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేశారు. ప్రస్తుతం ఈ స్థానానికి పార్టీ సీనియర్ నాయకుడు జనార్దనపూజారి, కేంద్ర మంత్రి మొయిలీ కుమారుడు హర్షమొయిలీ పోటీ పడుతున్నారు. ఈనెల 13న బెంగళూరు ఉత్తర లోక్‌సభ నియోజకవర్గానికి అంతర్గత ఎన్నికలు నిర్వహిస్తారు