- దేశంలోనే తొలిసారిగా..
- మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా
- సక్సెస్ అయితే మరిన్ని బస్సులు
సాక్షి, బెంగళూరు : నగరంలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) దేశంలోనే తొలిసారిగా ఎలక్ట్రిక్ బస్సును ప్రవేశ పెట్టింది. ఇక్కడి శాంతినగర బస్సు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి ఈ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బస్సును మెజస్టిక్-కాడుగోడి మార్గంలో మూడు నెలల పాటు ప్రయోగాత్మకంగా నడుపుతామన్నారు. రోజుకు ఆరు ట్రిప్పులు చొప్పున ఈ బస్సు రాకపోకలు సాగిస్తుందన్నారు.
వోల్వో బస్సు మాదిరే ఇందులో చార్జీలు ఉంటాయన్నారు. అంతకు ముందు మంత్రి బీఎంటీసీ డ్రైవర్లు, కండక్టర్లు, డిపోలలో పని చేసే కార్మికుల సెలవుల కోసం నెలకొల్పిన యంత్రాన్ని (లీవ్ మేనేజ్‌మెంట్ కియోస్క్) ప్రారంభించారు. దీని వల్ల సెలవుల మంజూరు విషయంలో కార్మికులకు వేధింపులు తప్పుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
బస్సు విశేషాలు..
వంద శాతం కాలుష్య రహిత బస్సు (జీరో ఎమిషన్ వెయికల్)
బస్సుపై ఉన్న సౌర ఘటకాల ద్వారా కూడా వాహనాన్ని చార్జ్ చేసుకోవచ్చు
ఆరు గంటల పాటు చార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు
వాహనంలో రెండు సీసీ కెమరాలు
డ్రైవర్, కండక్టర్ సహా 31 మంది ప్రయాణించే సదుపాయం