
త్రివిధ దళాల వల్లే దేశంలో ప్రశాంతత
- ముఖ్యమంత్రి చంద్రబాబు
- ముగిసిన నౌకాదళ విన్యాసాలు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): దేశ రక్షణలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పాత్ర కీలకమని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రు సైనికులతో తలపడి విజయం సాధించడం వల్లే ప్రజలు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు నావికాదళం, ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా విజయవాడ పున్నమి ఘాట్‌లో మూడు రోజులపాటు నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు శనివారం ముగిశాయి.
దాదాపు గంటన్నర సేపు జరిగిన విన్యాసాలను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. భవిష్యత్‌లో ఇండియన్ నేవీకి విశాఖపట్నం కేంద్రంగా మారుతుందన్నారు. ఈస్ట్రన్ నావెల్ వైస్ అడ్మిరల్ బిస్త్ మాట్లాడుతూ నౌకాదళంపై యువతకు ఆసక్తి కలిగేలా ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు మంచి స్పందన లభించిందని తెలిపారు.