ఇక పండుగ భోజనం
విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు
అందించే దిశగా గుజరాత్ తరహాలో రాష్ట్రంలో
అమలు చేసేందుకు సమాలోచనలు
బెంగళూరు : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటి వరకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ భోజనాన్ని సైతం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పండుగల సందర్భాల్లో విద్యార్థులకు వివిధ రకాలైన పిండివంటలతో ప్రత్యేక భోజనం అందించేలా ఈ పథకాన్ని రూపొందిస్తోంది. ఇటీవల కేంద్ర మానవ వనరుల శాఖ విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ భోజనాన్ని ప్రత్యేకంగా అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. రానున్న విద్యా సంవత్సరం నుంచే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
గుజరాత్ తరహాలో
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు పండుగ సందర్భాల్లో ప్రత్యేక భోజనాన్ని అందించే పథకం ఇప్పటికే గుజరాత్‌లో అమల్లో ఉంది. గుజరాత్‌లో ‘తిథి భోజన్’ పేరిట ఈ పథకం అమలవుతోంది. పండుగ సందర్భాలు, స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో వివిధ రకాల పిండి వంటలతో కూడిన ప్రత్యేక భోజనాన్ని ‘తిథి భోజన్’ పేరిట అక్కడి విద్యార్థులకు అందజేస్తున్నారు. గుజరాత్‌లో ఈ పథకం ఎంతో విజయవంతమైంది. ఈ పథకం అమలు ద్వారా చాలా మంది చిన్నారులు అపౌష్టికత నుంచి సైతం బయటపడ్డారని గణాంకాలు వెల్లడించాయి. దీంతో ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ భావించారు. ఈ కారణంగా ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు ప్రారంభించింది. గత ఏడాది అక్టోబర్‌లో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి శ్మృతి ఇరానీ ఇందుకోసం ప్రత్యేక సమావేశాన్ని సైతం ఏరా్పాటు చేశారు. ఈ సమావేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో హబ్బదూట పేరుతో.
ఇక కర్ణాటకలో ఈ పథకాన్ని హబ్బదూట(పండుగ భోజనం)’ పేరుతో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి విధి, విధానాలు ఇప్పటికే తయారయ్యాయని రానున్న విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం రాష్ట్రంలో అమల్లోకి రానుందని రాష్ట్ర విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.