- శతాయు ఆయుర్వేద సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ మృత్యుంజయ
సాక్షి, బెంగళూరు : ఆయుర్వేద వైద్య విధానాలకు ప్రస్తుతం దేశంలో రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోందని శతాయు ఆయుర్వేద సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ మృత్యుంజయ వెల్లడించారు. శతాయు ఆయుర్వేద సంస్థ నగరంలోని ఉత్తరహళ్లిలో ఏర్పాటు చేసిన వెల్‌నెస్ క్లినిక్‌ను నటి శ్వేతా శ్రీవాస్తవ, ఎమ్మెల్యే ఎం.కృష్ణప్పలతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మృత్యుంజయ మాట్లాడారు. ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం ప్రకృతి వస్తువులతోనే అందించే ఆయుర్వేద వైద్య విధానానికి భారతదేశంతో పాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోందని అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, రక్తపోటు తదితర సమస్యలతో పాటు ఊబకాయం వంటి లైఫ్‌స్టైల్ వ్యాధులను కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయం చేయగల సామర్థ్యం ఆయుర్వేదానికి ఉందన్నారు.
ఇక చర్మ సౌందర్యం విషయంలో ఆయుర్వేద ఉత్పత్తుల కొనుగోలుకే ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, అందుకే తమ సంస్థ తరఫున ‘వైట్ హర్బల్స్’ పేరిట సౌందర్య ఉత్పత్తులను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. దేశ వ్యాప్తంగా 100 వెల్‌నెస్ క్లినిక్‌లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం నటి శ్వేతా శ్రీవాస్తవ మాట్లాడుతూ... రసాయనాలు కలిసిన ఉత్పత్తుల కారణంగా చర్మానికి హానికలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అందుకే తాను ఎప్పుడూ ఆయుర్వేద ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.