ఓటుపోయింది..!
- ఔత్సాహికుల నిరాశ..
- ఓటర్ల జాబితాలో కనబడని పేర్లు
- ప్రచారానికి పరిమితమైన బీబీఎంపీ
- వేలాది అర్జీలు బుట్టదాఖలు
- ఆన్‌లైన్‌లో అర్జీలకు దిక్కేలేదు
- తప్పులపై తప్పులు చేస్తున్న అధికారులు
- మండిపడుతున్న దరఖాస్తుదారులు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు పవిత్రమైనది. దానిని సద్వినియోగం చేసుకోవాలి...అని ఊదరగొట్టిన బీబీఎంపీ...తీరా ఓటర్ల జాబితాలో చోటు కోసం పేర్లు నమోదు చేసుకున్న వేల మంది ఔత్సాహికులను నిరాశ పరిచింది. గతనెల 16 వరకు ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీంతో వేల మంది ఉత్సాహంగా దరఖాస్తులను నింపి ఆయా కార్యాలయాల్లో సమర్పించారు.
ఇప్పుడు తుది జాబితాలో చూస్తే...వేల మంది పేర్లు కనబడలేదు. కళాశాలలు, వివిధ సంఘాలు, సంస్థల నుంచి పంపిన దరఖాస్తులతో పాటు పాలికె వార్డు కార్యాలయాల్లో సమర్పించిన అర్జీలు బుట్ట దాఖలా అయ్యాయి. ఆన్‌లైన్‌లో అర్జీలు సమర్పించిన వారి పేర్లు కూడా జాబితాలో కనిపించడం లేదు. కాగా పూర్తి వివరాలతో సమర్పించిన దరఖాస్తుదార్లకు ఓటర్ల జాబితాలో చోటు కల్పించామని పాలికె ఎన్నికల అధికారులు చెబుతున్నారు.
అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులతో పాటు గడువు ముగిశాక సమర్పించిన అర్జీలను ఇంకా పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా వచ్చిన అర్జీల్లో కూడా అర్హుల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చామని వెల్లడించారు. మరో వైపు పాలికె ఎన్నికల సిబ్బంది వైఖరి పట్ల అనేక మంది మండి పడుతున్నారు. తామిచ్చిన అర్జీల గురించి అడిగితే, మరో అర్జీ ఇవ్వండని ఉచిత సలహా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో వైపు ఓటరు గుర్తింపు కార్డుల్లో వచ్చిన తప్పులను సరిచేయాలని కోరుతూ, సంబంధిత ఫారాలను సమర్పించిన ఓటర్లు కూడా చేదు అనుభవాన్ని చవి చూస్తున్నారు. ముందుగా అందిన కార్డుల్లో ఒకటో, రెండో తప్పులుంటే, సవరణలు జరిగాక వచ్చిన కొత్త కార్డుల్లో మరిన్ని తప్పులు దొర్లుతున్నాయని పలువురు ఓటర్లు ఆరోపిస్తున్నారు. దీంతో పాత కార్డుతోనే ఎలాగో నెట్టుకొద్దాములే అని చాలా మంది రాజీ పడుతున్నారు.