
ఆంక్షలతో చేపల వేటకు ఇబ్బంది
తీర ప్రాంత భద్రత నెపంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మత్స్యకారులు వాపోతున్నారు
వాపోతున్న మత్స్యకారులు
ఆంక్షల వల్ల వేట మానుకోవాల్సి వస్తోందని ఆవేదన
గుజరాత్ విధానం అమలు చేయాలని డిమాండ్
సాక్షి, ముంబై : తీర ప్రాంత భద్రత నెపంతో పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మత్స్యకారులు వాపోతున్నారు. ఆంక్షలు విధించడంతో చేపల వేటను మానుకోవాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. రెక్కాడితేగాని డొక్కాడని తమకు చేపల వేటే జీవనాధారమని మచ్చీమార్ కృతి సమితి అధ్యక్షుడు దామోదర్ తాండేల్ అన్నారు. తీర ప్రాంత భద్రతలో భాగంగా గుజరాత్ ప్రభుత్వం మత్స్యకారుల లాంచీలకు జీపీఎస్ పరికరం అమర్చుతోందని, ఆ విధానాన్ని రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
నగరానికి ఉగ్రదాడుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పోలీసులు తీర ప్రాంత భద్రతను కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు లాంచీలకు ప్రత్యేక రంగులు వేయించుకోవాలని పోలీసులు ఆంక్షలు విధించడంతో జాలర్లు ఆ ప్రకారం లాంచీలకు రంగులు వేసుకున్నారు. సముద్రంలో అనుమానస్పద వ్యక్తులు, లంగరు వేసిన స్టీమర్లు, నౌకలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక మత్స్యకారులకు తెలిపారు.
తాజాగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే ముందు కూపన్ తీసుకోవాలని ఆంక్షలు విధించారు. లేదంటే తిరుగు ప్రయాణంలో నగరంలోకి ప్రవేశం ఉండదని హెచ్చరించారు. అయితే క్యూలో నిలబడి కూపన్ తీసుకోవడం వల్ల సమయం వృథా అవుతోందని, దీని వల్ల మత్స్యకారుల ఉపాధిపై తీవ్ర పభావం పడుతోందని దామోదర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 56 బందర్లు, 23 వేల లాంచీలు ఉన్నాయని, 10 లక్షలకుపైగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్తారని, ప్రతి రోజు రెండు వేల కోట్ల చేపలు ఎగుమతి చేస్తుంటారని ఆయన వెల్లడించారు. కూపన్ పద్ధతి అమలు చేస్తే ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు.