సూరాడ రాముడు మృతదేహం
రణస్థలం: ఆ కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. సుమారు 35 ఏళ్లకు పైగా సముద్రాన్ని నమ్ముకుని వారంతా జీవిస్తున్నారు. రోజూలానే ఆదివారం తెల్లవారు జా మున ఐదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. చేపలను పట్టుకుని ఆనందంగా తిరిగి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో తీరానికి చేరుకుంటారనగా ఒక్కసారిగా సముద్రంలో అలలు ఉద్ధృతంగా రావడంతో వారు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మత్స్యకారుడు ఒకరు మృతిచెందగా మరో నలు గురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటన మండలంలోని అల్లివలస సముద్ర తీరంలో ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరాడ రాముడు(52) గార మండలంలోని కళింగపట్నంలో 20 ఏళ్లుగా నివసిస్తున్నాడు. సొంత గ్రామమైన అల్లివలసలో కూతురు ఉండటంతో అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి వేటకు వెళుతుంటారు. ఆదివారం ఉదయం 5 గంటలకు మరో నలుగురితో కలిసి రాముడు చేపల వేటకు పడవలో వెళ్లారు.
వేట ముగించుకుని 11 గంటలకు తిరిగి వస్తుండగా అల్లివలస సముద్ర తీరానికి వంద మీటర్ల దూరంలో కెరటాల ఉద్ధృతి పెరిగింది. దీంతో పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఒకవైపు కుర్చున్న రాముడు పడవ కింద ఇరుక్కుపోయారు. మిగిలిన నలుగురు పడవను, రాముడిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న ఆయన్ను ఒడ్డుకు తీసుకువచ్చినా ఫలితం లేకుండాపోయింది. కొద్ది నిమిషాల్లోనే రాముడు చనిపోయాడని మత్స్యకారులు తెలిపారు. కెరటాల తాకిడికి పడవ ఆయనపై పడిపోవడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయని వివరించారు. సంఘటనా స్థలాన్ని వీఆర్వో సుబ్రహ్మణ్యం, జె.ఆర్.పురం ఎస్సై వి.సత్యనారాయణ పరిశీలించారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. రాముడి కుమారుడు ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవపంచనామాకు పంపించారు. నెల రోజుల వ్యవధిలోనే పక్కపక్క గ్రామాల్లో ప్రమాదాలు సంభవించడంతో మత్స్యకార గ్రామాల్లోని ప్రజలు అందో ళన చెందుతున్నారు. తమ జీవితాలు ఎప్పడు ఎలాం టి ఉపద్రవం సంభవిస్తుందోనని వాపోతున్నారు. ప్రభుత్వమే మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని మత్స్యకార నాయకులు, ఎంపీటీసీ మైలపల్లి వెంకటేష్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment