వేధింపులతో చంపేస్తున్నారు..! | They are killing students with harassment | Sakshi
Sakshi News home page

వేధింపులతో చంపేస్తున్నారు..!

Published Mon, Oct 24 2016 10:54 PM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM

బాల సంధ్యారాణి (ఫైల్‌) - Sakshi

బాల సంధ్యారాణి (ఫైల్‌)

* మానసికంగా, లైంగికంగా కూడా..
ఈటెల్లాంటి మాటలంటున్న ఫ్రొఫెసర్లు
మనోవేదనతో ఉసురు తీసుకుంటున్న వైద్య విద్యార్థినులు
జీఎంసీ, జీజీహెచ్‌లో కొరవడుతున్న వైద్యాధికారుల పర్యవేక్షణ
 
‘గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వరః’ అనే సూక్తికి విరుద్ధంగా గుంటూరు వైద్య కళాశాలలోని కొందరు బోధనసిబ్బంది వ్యవహరిస్తున్నారు. కన్నవారిని, ఉన్న ఊరును విడిచి  వైద్య విద్యను అభ్యసించేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడాల్సిన గురువులే సూటిపోటి మాటలతో తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. 
 
సాక్షి, గుంటూరు: వైద్య కళాశాలలో సీనియర్‌ విద్యార్థులు వేధించకుండా ప్రశాంత వాతావరణంలో విద్యాబోధన జరిగేలా చూడాల్సిన ప్రొఫెసర్‌లే వేధింపులకు పాల్పడుతుండడం దారుణం. వైద్య విద్యార్థినులపై ర్యాగింగ్,  లైంగిక వేధింపులు జరగకుండా ప్రొఫెసర్ల నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ పనిచేయాల్సిఉంది. కాగా గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్‌లో కొందరు బోధన సిబ్బంది వైద్య విద్యార్థినులపై మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. కొందరు ప్రొఫెసర్ల విపరీత పోకడల వల్ల ప్రసిద్ధిగాంచిన గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రతిష్ట దిగజారుతోంది. గుంటూరు జీజీహెచ్, వైద్య కళాశాలల్లో కొందరు ప్రొఫెసర్లు వైద్య విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతుండడంతో తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 
  • తాజాగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ బాల సంధ్యారాణి వేధింపులకు బలైంది. ఆమె స్థానిక కన్నావారితోటలో ఓ రూమ్‌ అద్దెకు తీసుకునిఉంటూ  గుంటూరు వైద్య కళాశాలలో గైనకాలజీ (డీజీఓ) ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ చిట్టిప్రోలు రవితో వివాహమైంది. పెళ్లికి 20 రోజులు సెలవు పెట్టగా.. అన్ని రోజులెందుకంటూ సంబంధిత యూనిట్‌ ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ ఎ.వి.వి.లక్ష్మి దుర్భాషలాడారని మృతురాలి తల్లిదండ్రులు  అంటున్నారు. తాను ప్రొఫెసర్‌ లక్ష్మి వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ సంధ్యారాణి చనిపోయే ముందు తన డైరీలో రాసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంజక్షన్‌ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంధ్యారాణి మృత్యువుతో పోరాడుతూ సోమవారం మృతి చెందింది.
  • ఈ ఏడాది ఆగస్టు 11న రాచమళ్ల విజయలక్ష్మి (24) అనే విద్యార్థిని సైతం ఇంజక్షన్‌ చేసుకుని మృతిచెందిన విషయం తెలిసిందే. హెచ్‌ఐవీ సోకిన రోగికి ఆపరేషన్‌ చేస్తుండగా విజయలక్ష్మి చేతికి రోగికి వాడిన సూది గుచ్చుకుంది. దీంతో తనకు ఆ వ్యాధి వస్తుందనే భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే సూది గుచ్చుకున్నప్పుడు అక్కడే ఉన్న ప్రొఫెసర్లు సదరు విద్యార్థినికి కౌన్సెలింగ్‌ ఇవ్వకుండా వదిలేయడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తోటి విద్యార్థినులు చెబుతున్నారు.
  • గత ఏడాది జీజీహెచ్‌ చర్మ వ్యాధుల విభాగంలో ఓ ప్రొఫెసర్‌ వైద్య విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై వైద్యాధికారులు విచారణ జరిపి లైంగిక వేధింపులు నిజమేనని తేల్చినా కేవలం బదిలీతో సరిపెట్టారు.
గుంటూరు జీజీహెచ్, ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు ప్రైవేట్‌ ప్రాక్టీసులు పెట్టుకుని పనిభారం మొత్తం పీజీలపై నెడుతున్నారు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు మాత్రం తప్పు వీరిపైకి నెట్టేస్తున్నారు. వైద్య విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నా వైద్యాధికారులు పట్టించుకోకపోవడం వల్లే భావి వైద్యులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement