రాత్రిపూట దొంగతనాలకు పాల్పడే 8మందిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
రూ. 9లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం
విజయవాడ: రాత్రిపూట దొంగతనాలకు పాల్పడే 8మందిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 9లక్షల విలువైన257 గ్రాముల బంగారం, 3.3. కేజీల వెండి ఆభరణాల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. కమిషనరేట్‌లో జాయింట్ పోలీసు కమిషనర్ హరికుమార్ విలేకరులతో మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు పరిసరాల్లో పలు దొంగతనాల్లో 8మంది నేరస్తులను అరెస్టు చేశామని చెప్పారు.
నిందితుల్లో విజయవాడ టుటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే చాట్ల శివారెడ్డి, కాగితాల శివశంకర్, గాడిల్లి శివ, పోలవరపు శ్రీను, తోటరామకృష పలు దొంగతనాలకు పాల్పడ్డారు. గత నెల 24వ తేదీన వన్‌టౌన్ శివాలయం ఏరియాలో రామ్‌గోపాల్ వీధిలో ఫస్ట్‌ప్లోర్‌లో తాళం వేసి ఉన్న ఓ ఇంల్లో ఈ ఐదుగరు దొంగతనానికి పాల్పడి, బీరువాలో నగలను దోచుకున్నారు.
నిందితులు తాము దోచుకున్న 167గ్రాముల బం గారం, 3 కేజీల వెండి వస్తువులను, ఒక ఎల్.ఇ.డి. టీవీని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా ఈనెల 7వ తేదీన వన్‌టౌన్ శివాలయం వీధిలో అనుమానంగా తిరుగుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
పట్టుబడిన ముగ్గురు నిందితులు గుంటూరు జిల్లా దేవరకొండకు చెందిన పాతనేరస్తులైన కర్రికిరణ్‌కుమార్, టి. వెంకటేశ్వరరావు, అలియాస్ బుడ్డా, దేవరకొండ శివరామకృష్ణగా గుర్తించారు. వీరంతా గతంలో పలు కేసుల్లో గుంటూరు జిల్లా జైలులో శిక్షను అనుభవించిన క్రమంలో వీరు స్నేహితులయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఒక ముఠాగా ఏర్పడి రాత్రిపూట ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ముగ్గురు రెండు నెలల కాలంలో నాలుగు దొంగతనాలకు పాల్పడ్డారు.
నగరంలో ఇబ్రహీంపట్నం, అజిత్‌సింగ్‌నగర్, మాచవరం, గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లిలో దొంగతనాలకు పాల్పడ్డారు. వారి నుంచి 88 గ్రాముల బంగారం, 300గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.