- మృతదేహాన్ని నీలగిరి తోపులో పారేసిన వైనం
- పరారీలో నిందితులు
దొడ్డబళ్లాపురం : దొడ్డబళ్లాపురం తాలూకా తంబేనహళ్లిలో వరకట్న భూతానికి వివాహిత బలైంది. తంబేనహళ్లిలోని కెంపణ్ణ, రుద్రమ్మ దంపతుల ఏకైక కుమార్తె జయలక్ష్మికి (19) సోమవారం రాత్రి అత్తింటిలో నూరేళ్లు నిండిపోయాయి. వివరాలు... బూచనహళ్లికి చెందిన కెంపయ్య, లక్ష్మమ్మ దంపతుల కుమారుడు చలపతికిచ్చి మూడేళ్ల క్రితం జయలక్ష్మి పెళ్లి జరిపించారు. వివాహ సమయంలో రూ. 2 లక్షల నగదుతో పాటు తాహతుకు మించి కట్నకానుకుల సమర్పించారు.
అయితే వివాహం జరిగిన నాటి నుంచి చలపతి, అతని తల్లి లక్ష్మమ్మ, అక్క రంగమ్మ అదనపు కట్నం తీసుకురావాలని నిత్యం వేధించేవారని సమాచారం. ఈ క్రమంలో జయలక్ష్మి అన్న లక్ష్మినారాయణ మూడుసార్లు రూ. లక్ష చొప్పున ఇచ్చాడు. ఇదిలా ఉంటే జయలక్ష్మిని పుట్టింటికి పంపించడానికి అనేక అంక్షలు విధించేవారని, కనీసం పండుగలకు కూడా తమ బిడ్డను పంపించే వారు కాదని జయలక్ష్మి తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
చలపతి హొసూరులోని ఒక ఫ్యాక్టరీలో పని చేస్తుండగా, బెంగళూరు హెగ్గనహళ్లిలో ఉన్న తన అక్క ఇంటిపై పోర్షన్‌లో భార్యతో కాపురం ఉండేవాడు. ఇదిలా ఉంటే భర్త చలపతి, అత్త లక్ష్మమ్మలు వారం క్రితం స్థలం కొనుగోలు కోసం మరో రూ. లక్ష తీసుకురావాలని జయలక్ష్మిని కొట్టి పుట్టింటికి పంపించా రు. అయితే అప్పటికే ఉన్న కాస్త పొలం విక్రయించి పెళ్లి జరిపించడంతో తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేకపోయా రు. దీంతో ఆగ్రహించిన భర్త, అత్త కలిసి జయలక్ష్మిని హత్య చేసి రాత్రి మృతదేహాన్ని తంబేన హళ్లికి అంబులెన్స్‌లో తీసుకు వచ్చి గ్రామ శివారులో ఉన్న నీలగిరితోటలో దించి కాల్చివేయడానికి ప్రయత్నించారు. అయితే గ్రామస్తులు గమనించడంతో శవాన్ని అక్కడే వదిలి పరారయ్యారు.
మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు నిందితులను అరెస్టు చేసేవరకూ తోటలో నుంచి మృతదేహాన్ని కదిలించేది లేదని పట్టుబట్టారు. దొడ్డబెళవంగల పోలీసులు ఘటనా స్థలంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రానికి దొడ్డబెళవ ంగల ఎస్‌ఐ బాలాజీ నిందితులను అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి గ్రామానికి తీసికెళ్లారు. మృతురాలి భర్త, అత్త, మామ, ఆడపడచు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.