సాక్షి, ముంబై: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణ ముంబై లోక్‌సభ చతుర్ముఖ పోరుకు వేదిక కానుంది. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి, శివసేన-బీజేపీ, ఆర్‌పీఐ,స్వాభిమాన్‌ల మహాకూటమి, ఎమ్మెన్నెస్‌తోపాటు ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)ల మధ్య తీవ్ర పోరు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. పొత్తు పంపకంలో భాగంగా ఈసారి కూడా దక్షిణ ముంబై స్థానాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ అభ్యర్థిగా మిళింద్ దేవ్రాకే మళ్లీ అవకాశమిచ్చింది. గతంలో మాదిరిగా ఈసారి కూడా ఎమ్మెన్నెస్ వల్ల మిలింద్ దేవ్రాకే గెలుపు అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలా నందగావ్కర్ ఈసారి గెలవాలన్న కృతనిశ్చయంతో ఉన్నారు.
2009లో జరిగిన ఎన్నికల్లో 1,59,729 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలిచిన బాలా నందగావ్కర్ స్థానిక ఓటర్లను ఆకట్టుకొనే విధంగా ప్రచార శైలిలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన గెలుపు సంగతి దేవుడెరుగు? ఈసారి కూడా తమ విజయావకాశాలను ఎక్కడ దెబ్బతీస్తారోనని శివసేన అభ్యర్థి మోహ న్ రావులేలో ఆందోళన మొదలైంది. గత ఎన్నికల్లో 1,46,118 ఓట్లతో మూడో స్థానంలో నిలిచిన మోహన్‌రావులే ఈసారి గెలవడమే ధ్యేయంగా నియోజకవర్గాన్ని చుట్టుముట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈ లోక్‌సభ స్థానాన్ని ఎమ్మెల్సీ మంగల్‌ప్రభాత్ లోధా కుమారుడు అభినందన్ లోధాకు కేటాయించాలని బీజేపీ చేసిన విజ్ఞప్తిని శివసేన నిరాకరించింది. దీంతో ఈ నియోజకవర్గంలోని బీజేపీ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి నెలకొంది. ఇది శివసేన అభ్యర్థికి కొంత మైనస్ కాగా, పరోక్షంగా బాలా నందగావ్‌కర్‌కు వారు సహకరించే అవకాశాలు కూడా లేకపోలేదనే చర్చ మొదలైంది. దీనికితోడు బీజేపీ, ఎమ్మెన్నెస్‌ల మధ్య రహస్య ఒప్పందాలున్నాయంటూ చర్చలు జరుగుతున్నాయి. నరేంద్ర మోడీకి మద్దతు ప్రకటించి ఈ ఊహగానాలకు బలంచేకూరేలా ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే చేశారు. ఈ నేపథ్యంలో శివసేనకు కొంత నష్టం వాటిల్లే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఎమ్మెన్నెస్‌తో కాంగ్రెస్‌కు లాభం...?
దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో గతంలోమాదిరిగానే ఈసారి కూడా ఎ మ్మెన్నెస్ అభ్యర్థి కారణంగా కాంగ్రెస్ అభ్యర్థి లబ్దిపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలానాందగావ్కర్ కారణంగానే శివసేన ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి మిలింద్ దేవ్రా సునాయాసంగా విజయం సాధించారు. ఈసారి కూడా అదే సీన్ పునరావృతం అయ్యే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా బాలా నాందగావ్కర్‌కు కూడా నియోజకవర్గంలో మరింత పట్టు సంపాదించారు.
ఈ నేపథ్యంలో గట్టిపోటీ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈసారి ఆప్ నుంచి మీరా సన్యాల్ బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మీరా ఓటర్లను ఎంత వరకు ఆకట్టుకోనుందనేది వేచిచూడాల్సిందే.
దక్షిణ ముంబైలో చతుర్ముఖ పోరు
Published Tue, Mar 11 2014 12:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement