తిరుమల : ఈ నెల 14న తిరుమలలో కిడ్నాప్ అయిన చిన్నారి బాలుడి ఆచూకీ లభ్యమైంది. బాలుడిని అపహరించిన దంపతులు తమిళనాడులోని నమ్మకల్ పోలీసులు ఎదుట లొంగిపోయారు. కాగా తమకు పిల్లలు లేని కారణంగానే కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. పోలీసులు బాబును తిరుమల తీసుకు వస్తున్నారు.
కాగా తల్లిదండ్రులతో కలసి నిద్రిస్తున్న బాలుడిని గుర్తు తెలియని ఓ మహిళ, పురుషుడు కలసి ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. నిద్రలేచిన తల్లిదండ్రులు తమ బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు సీసీటీవీ ఫుటేజ్‌ను గమనించగా.. బాబును ఎత్తుకెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం ఛాయాపురానికి చెందిన వెంకటేశ్వర్లు, రత్నమ్మలు తమ పిల్లలు ప్రమీల(8), శ్రీనివాసులు(6), సువర్ణ(2), చిన్నకుమారుడు చెన్నకేశవులు(7నెలలు)తో కలసి శ్రీవారి దర్శనం కోసం ఈ నెల 13వ తేదీ మంగళవారం ఉదయం తిరుమల వచ్చారు.
దర్శనం పూర్తిచేసుకున్న వారు రాత్రికి ఆలయం ఎదురుగా ఉన్న గొల్లమండపం ప్రాంతంలో నిద్రించారు. బుధవారం వేకువన నాలుగు .. 5.30 గంటల సమయాల్లో బాలుడికి తల్లి రత్నమ్మ పాలుపట్టి.. నిద్రలోకి జారుకుంది. ఉదయం 6.30 గంటలకు నిద్రలేచిన తల్లిదండ్రులు బిడ్డ కనిపించకపోవటంతో కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.