ప్రక్షాళన | Today ministers resign | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన

Published Wed, Jun 15 2016 1:30 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Today ministers resign

నేడు మంత్రులను రాజీనామా  కోరనున్న సీఎం
మేజర్ సర్జరీ దిశగా కాంగ్రెస్ అధిష్టానం
యువ నాయకులకు పెద్దపీట
మంత్రి పదవులను కాపాడుకోవడానికి ఢిల్లీలో లాబీయింగ్

 

 బెంగళూరు :  అధికార కాంగ్రెస్ పార్టీలో త్వరలో భారీ స్థాయిలో ప్రక్షాళన జరగనుంది. అటు ప్రభుత్వ పరంగానే కాకుండా ఇటు పార్టీ పరంగా కూడా ఈ మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా మంత్రి మండలి పునఃరచన వివిధ కారణాలతో వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలు అటు సిద్ధరామయ్యతో పాటు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం అధిష్టానం కసరత్తులు మొదలు పెట్టింది. అందులో భాగంగా మంత్రిత్వశాఖల మార్పుతో పాటు కొంతమందిని పూర్తిగా మంత్రి మండలి నుంచే తప్పించడానికి అధిష్టానం నిర్ణయించుకుంది. ఈమేరకు ఖాళీ ఏర్పడిన స్థానాల్లో ఎక్కువ మంది యువ నాయకులకు స్థానం కల్పించాలనేది కాంగ్రెస్ పెద్దల భావన. మరోవైపు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న మాలికయ్యగుత్తేదార్, కోలివాడ వంటి ఒకరిద్దరు సీనియర్ నాయకులకు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నూతన మంత్రిమండలిలో స్థానం కల్పించనుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేడు (బుధవారం) మంత్రిమండలిని సమావేశం జరిపించి మంత్రులందరితో రాజీనామా చేయించనున్నారని తెలుస్తోంది. అటుపై ఆ రాజీనామా పత్రాలను తీసుకుని అధిష్టానం వద్దకు వెళ్లనున్నారు.


ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక శాఖ రాజకీయ వ్యవహరాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో ముఖ్యమంత్రి చర్చించి మంత్రి మండలి నుంచి ఎవరెవరిని తప్పించాలనే విషయంపై స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా సామూహిక రాజీనామా విషయమై ఇప్పటికే కొంతమంది మంత్రులు గుర్రుగా ఉన్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసేది లేదని వారు చెబుతున్నారు. అంతేకాకుండా తమ స్థానాలను కాపాడుకోవడానికి గత రెండు రోజుల నుంచి ఢిల్లీ మకాం వేసి లాబీయింగ్ నడుపుతున్నారు. మరోవైపు మంత్రి మండలిలో స్థానం ఆశిస్తున్న వారిలో ముందువరుసలో ఉన్న స్పీకర్ కాగోడుతిమ్మప్ప, శాసనసభ్యుడు రమేష్‌లు కూడా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకుడైన మల్లికార్జున ఖర్గే ద్వారా లాబీయింగ్  చేస్తున్నారు. ఇక సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలైన అశోక్ పట్టణ్, ప్రకాశ్‌రాథోడ్, మాలకయ్యగుత్తేదార్, ఏ.బీ మాలకరెడ్డి తదితరులు నేరుగా అధిష్టానం కలిసి ఇంతకాలం తాము కాంగ్రెస్‌కు చేసిన సేవను వివరించి మంత్రి పదవులు పొందాలని గట్టిపట్టుదలతో ఢిల్లీలో మకాం వేశారని సమాచారం.
 

కేపీసీసీ అధ్యక్షస్థానంలో డీ.కే శివకుమార్
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానంలో ఉన్న పరమేశ్వర్ పదవీ కాలం ఇప్పటికే ముగిసింది. అయితే ఉప ఎన్నికలు, పరిషత్ ఎన్నికల వల్ల ఆయన్ను ఆ స్థానం నుంచి తొలగించి మరొకకరికి ఆ భాద్యతలు అప్పగించడానికి హై కమాండ్ ఒప్పుకోలేదు. అయితే మరో రెండేళ్లవరకూ ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఈ సమయంలోపు పార్టీని బలోపేతం చేసే సమర్థుడిని కేపీసీసీ అధ్యక్షస్థానంలో ఉంచాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. అందువల్ల ఈ మంత్రి మండలి పునఃరచన ఘట్టం ముగిసిన వెంటనే కేపీసీసీ అధ్యక్షస్థానం పై నూతన వ్యక్తికి కూర్చొబెట్టనుంది. కాగా, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్‌కు అధ్యక్షస్థానం దక్కే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీనాయకులు చెబుతున్నారు. అందువల్లే ఇటీవల జరిగిన పరిషత్, రాజ్యసభ ఎన్నికల్లో మూడో అభ్యర్థి గెలుపును డి.కె.శివకుమార్ తన భుజస్కందాల పై వేసుకుని వ్యవహారాన్ని చక్కబెట్టారని వారు పేర్కొంటున్నారు. కాగా, కేపీసీసీ అధ్యక్ష స్థానానికి మంత్రి ఎస్.ఆర్.పాటిల్ పేరు కూడా వినిపిస్తోంది. డి.కె.శివకుమార్ కనుక కేపీసీసీ అధ్యక్షుడైతే పార్టీ పై తనకు ఉన్న పట్టు సడలిపోతుందని భావిస్తున్న సీఎం సిద్ధరామయ్య ఎస్.ఆర్.పాటిల్ పేరును హైకమాండ్ దృష్టికి తీసుకెళుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement