పెద్దలపై వలసల వల.. పై‘చేయి’ కోసం యాక్షన్ ప్లాన్
మండలిలో 40 మందికి గాను 29 మంది బీఆర్‌ఎస్ సభ్యులే
అయితే మొత్తం 8 మంది ఇప్పటికే హస్తం గూటికి
12కు చేరిన కాంగ్రెస్ బలం.. 21కి తగ్గిన గులాబీ దళం
మరికొందరు ఎమ్మెల్సీలపై అధికార పార్టీ నజర్
బిల్లుల ఆమోదంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రయత్నాలు
పార్టీ ఫిరాయింపుల్ని గతంలో వ్యతిరేకించి ఇప్పుడు
ప్రోత్సహించడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర శాసనమండలిలో సంఖ్యాపరంగా మైనారిటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వలసలను ప్రోత్సహించడం ద్వారా పట్టు బిగించేందుకు ప్రయతి్నస్తోంది. ఇందులో భాగంగా మండలిలో సుమారు నాలుగింట మూడొంతుల ఎమ్మెల్సీల బలం ఉన్న బీఆర్‌ఎస్‌పై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకోగా, గురువారం అర్ధరాత్రి ఒకేసారి అర డజను మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు హస్తం కండువా కప్పుకున్నారు. వీరి చేరికతో మండలిలో కాంగ్రెస్ బలం డజను స్థానాలకు చేరింది.
అయినా కీలక బిల్లులు, తీర్మానాల ఆమోదానికి అవసర మైన సంఖ్యా బలం ఆ పార్టీకి చేకూరలేదు. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం జరిగితే తప్ప నిధులు వ్యయం చేయడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమస్యలు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. రానున్న రోజుల్లో మరికొందరు ఎమ్మెల్సీలను చేర్చుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మండలిలో బీఆర్‌ఎస్ బలం 29 నుంచి ప్రస్తుతం 21కి పడిపోయింది.
కాగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించినప్పుడు తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులే.. ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహించడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరోపారీ్టలోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టాలని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పారీ్టలో చేరితే వారిపై అనర్హత వేటు ఆటోమేటిక్‌గా అమలయ్యేలా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ జాతీయ మేనిఫెస్టోలో హామీ ఇచి్చన విషయాన్ని కూడా వారు ప్రస్తావించడం గమనార్హం.
దూరం పాటిస్తున్న చైర్మన్, మరో ఎమ్మెల్సీ: గత ఏడాది
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడేనాటికి మండలిలో బీఆర్‌ఎస్ 29 మంది సభ్యుల బలాన్ని కలిగి ఉంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ముగ్గురు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్) కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన కసిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో తిరిగి బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుపొందారు.తాజాగా బీఆర్‌ఎస్‌కు చెందిన మరో ఆరుగురు
ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, దండె విఠల్, టి.భానుప్రసాద్‌రావు, ఎంఎస్ ప్రభాకర్‌రావు, బొగ్గారపు దయానంద్, బసవరాజు సారయ్య కాంగ్రెస్‌లో చేరారు. దీంతో 40 మంది సభ్యులున్న శాసన మండలిలో ప్రస్తుతం బీఆర్‌ఎస్‌కు 21 మంది, కాంగ్రెస్ 12 మంది, ఎంఐఎంకు ఇద్దరు సభ్యులుండగా, బీజేపీకి ఒక సభ్యుడు ఉన్నారు. మరో ఇద్దరు స్వతంత్రులు. గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉండగా, వీటి భర్తీపై వివాదం నెలకొంది. ఇలావుండగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా ఇటీవలి కాలంలో బీఆర్‌ఎస్‌తో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి గతంలో బీఆర్‌ఎస్‌తో సన్నిహితంగా కొనసాగినా, ప్రస్తుతం ఆయన కూడా దూరం పాటిస్తున్నారు.
మరో టర్మ్ పొడిగిస్తామనే హామీతోనే..?
మండలిలో బడ్జెట్, ప్రభుత్వ బిల్లులు, తీర్మానాలకు ఆమోదం పొందడం కాంగ్రెస్‌కు సవాలుగా మారింది. కీలక బిల్లులు మండలిలో పాస్ అయ్యేందుకు బీఆర్‌ఎస్ మోకాలు అడ్డుతుందని భావిస్తున్న కాంగ్రెస్ చేరికల ద్వారా బలోపేతం అయ్యేలా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో మరో దఫా పదవి ఇస్తామనే హామీతో ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ ఎర వేస్తున్నట్లు తెలిసింది. పార్టీ మారిన ఎమ్మెల్సీల్లో ఎగ్గే మల్లేశం వచ్చే ఏడాది మార్చి 25న, ఎంఎస్ ప్రభాకర్‌రావు వచ్చే ఏడాది ఆగస్టు 6న ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, బసవరాజు సారయ్య 2026 నవంబర్‌లో, మిగతా ఎమ్మెల్సీలు 2028 జనవరిలో పదవీ కాలం పూర్తి చేసుకుంటారు.
అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల్లో స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో పార్టీ మారే వారిలో వారే ఎక్కువగా ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు గత ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. ఈ ఇద్దరి పేర్లను నాటి గవర్నర్ తమిళిసై తిరస్కరించడంతో తర్వాత అధికారంలోకి వచి్చన రేవంత్ ప్రభుత్వం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాంతో పాటు అమేర్ అలీఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఈ అంశంలో గవర్నర్ తీసుకోబోయే నిర్ణయం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శిబిరాల్లో ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment