బహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల పోలింగ్‌ను శాంతి, భద్రతల నడుమ పూర్తి పారదర్శకంగా
రేపు బీబీఎంపీ ఎన్నికల పోలింగ్
ఓటు హక్కు వినియోగించుకోనున్న 73 లక్షల మంది
పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు
1900కు పైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత
బెంగళూరు :బహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల పోలింగ్‌ను శాంతి, భద్రతల నడుమ పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శ్రీనివాసాచారి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గురువారమిక్కడి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు శ్రీనివాసాచారి సమాధానమిచ్చారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్, బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్‌లు సైతం పాల్గొని పోలింగ్ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ....బీబీఎంపీ పరిధిలోని 198 వార్డులకు ఇప్పటికే ఒక వార్డులో ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 197 వార్డులకు ఈనెల 22న పోలింగ్ జరగనుందని వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్‌తో పాటు బీబీఎంపీ, పోలీసు శాఖలు సంయుక్తంగా ఎన్నికలఏర్పాట్లను నిర్వహిస్తున్నాయని తెలిపారు. గత బీబీఎంపీ ఎన్నికల్లో కేవలం 44శాతం పోలింగ్ మాత్రమే జరిగిందని, ఈ ఎన్నికల్లో పోలింగ్‌ను 60శాతానికి పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్నికల్లో పూర్తి పారదర్శకత కోసం ఐఏఎస్ స్థాయిలోని ఏడుగురు అధికారులను ప్రత్యేక మానిటరింగ్ అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు. ఇదే సందర్భంలో 53 మంది ప్రత్యేక ఎన్నికల అధికారులను సైతం నియమించినట్లు తెలిపారు. 197వార్డుల్లో పోలింగ్ కోసం మొత్తం 6,759 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఓటు హక్కును వినియోగించుకోనున్న 73లక్షల మంది ఓటర్లు....
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీబీఎంపీ కమిషనర్ కుమార్ నాయక్ సైతం ఓటర్ల వివరాలను వెల్లడించారు. కొత్తగా ఓటు హక్కును పొందిన 3.5లక్షల మంది ఓటర్లతో కలిపి నగరంలో మొత్తం 73,88,256 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని చెప్పారు. వీరిలో 38,76,244 మంది పురుష ఓటర్లు కాగా, 35,10,828 మంది మహిళా ఓటర్లు. ఇటీవలే సహకార సంఘాల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఓటర్ల ఎడమ చేతి బొటనవేలికి సిరాగుర్తు వేయనున్నట్లు తెలిపారు. నోటా ఓటును వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ఫారం నంబర్ 27ను నింపి తమ నోటా ఓటును నమోదుచేయవచ్చని సూచించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్ మేఘరిక్ మాట్లాడుతూ....ఎన్నికల కోసం 20వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. నగరంలో 2,069 పోలింగ్ బూత్‌లను సమస్యాత్మకమైనవిగా, 1,909పోలింగ్ బూత్‌లను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్లు తెలిపారు. ఈ పోలింగ్ బూత్‌లలో మరింత ఎక్కువగా భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు మేఘరిక్ వెల్లడించారు.