♦ ఈవీఎం యంత్రాలకు ప్రింటర్లు అమర్చాలి
♦ కేంద్ర ఎన్నికల సంఘానికి టీపీసీసీ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, పాలేరు ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కేంద్రాన్ని కోరింది. ఎన్నికల్లో ఈవీఎం యంత్రాలకు ప్రింటర్లు అమర్చాలంది. ఈ విధానం ఎన్నికల్లో అక్రమాలకు ఆస్కారం లేకుండా దోహదపడుతుందని పేర్కొంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీతో పాటు ఎన్నికల కమిషనర్లను కలిసి వినతిపత్రం అందించింది.
బృందంలో పార్లమెంటు సభ్యులు వి.హనుమంతరావు, గుత్తా సుఖేందర్‌రెడ్డి, నంది ఎల్లయ్య, పాల్వాయి గోవర్దనరెడ్డి, రాపోలు ఆనందభాస్కర్, ఎం.ఎ.ఖాన్, రేణుకాచౌదరి, పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, గురిజాల వెంకట్, నిరంజన్, కైలాష్ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించుకోవడానికి ఇచ్చిన అనుమతిని వెనక్కితీసుకోవాలని కోరారు.
ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసు బలగాలను ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఉప ఎన్నిక సజావుగా సాగేందుకు అదనపు కేంద్ర పోలీసు బలగాలను మోహరించాలని, ధనప్రవాహాన్ని అడ్డుకోవాలని కోరారు. వరంగల్ లోక్‌సభ, నారాయణఖేడ్ ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీతో పాటు మరో రెండు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయన్నారు.
ప్రజాప్రతినిధులను కొంటున్నారు...
తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యాంగ విరుద్ధంగా, అప్రజాస్వామికంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తోందని ఉత్తమ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ అధికార పార్టీ తొత్తుగా మారిందన్నారు.