నలుగురికి తీవ్ర గాయాలు
కొండపైనే ప్రాథమిక చికిత్స
{పాణాలతో బయటపడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు
మాకళి కొండపై ఘటన
దొడ్డబళ్లాపురం : తాలూకాలోని మాకళి కొండపై ట్రక్కింగ్ వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేసాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం బెంగళూరుకు చెందిన 13 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మాకళి కొండకు ట్రెక్కింగ్ వెళ్లారు. సగభాగం వెళ్లగానే ఉద్యోగుల అలజడికి సమీపంలోనే ఉన్న కొండ తేనేటీగలు మూకుమ్మడిగా దాడిచేశాయి. దీంతో బెంబెలెత్తి పోయిన ఉద్యోగులు పరుగులు తీస్తూ కొండకిందకు వచ్చి స్థానికుల సాయంతో బయటపడ్డారు. స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. తీవ్ర అస్వస్థులైన వారికి కొండ మీదే సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. తీవ్రంగా గాయపడిన నలుగురు ఇక్కడి నంది ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. గాయపడిన వారిని హర్షిత్, మహేశ్, విశ్వనాథ్, చౌడప్పలుగా గుర్తించారు.
ఘటనకు సంబంధించి ఘాటీ పీడీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ... బెంగళూరు నుంచి వచ్చే విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కనీసం ముందస్తు అనుమతి లేకుండా కొండపైకి వెళ్తున్నారని, దీంతో కొండపై అసంఖ్యాంగా ఉన్న తేనెటీగల స్వల్ప అలజడి ఏర్పడినా తట్టుకోలేవని అన్నారు. అదే విధంగా స్మోకింగ్ అలవాటు ఉన్నవారు, మరికొంత మంది ఆకతాయిలు అడవికి నిప్పటించి వెళ్తున్నారని దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.