
కదిలిన కంటైనర్లు
టీనగర్: అరవకురిచ్చి సమీపంలో నడిరోడ్డుపై రూ.1,600 కోట్లతో నిలిచిన కంటైనర్లు గురువారం బయలుదేరాయి. అక్కడ భద్రతా పనులు నిర్విహ స్తున్న పోలీసులు 22 గంటల తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. కర్నాటక రాష్ట్రం మైసూరు సమీపంలోని మదురా రిజర్వ్‌బ్యాంకు నుంచి తిరువనంతపురం శాఖకు రూ.1,600 కోట్ల నగదుతో రెండు కంటైనర్ లారీలు ఈ నెల 18వ తేదీ రాత్రి బయలుదేరాయి. ఈ లారీలు కరూర్ జిల్లా అరవకురిచ్చి సమీపంలోని మలైకోవిలూరు వద్ద బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వెళుతుండగా ఒక లారీ యాక్సిల్ మరమ్మతుకు గురైంది. దీంతో మరో లారీ నిలిచిపోయింది.
దీంతో భద్రతా సిబ్బంది లారీల చుట్టూ భద్రతా వలయంగా ఏర్పడ్డారు. లారీలు నిలిచిపోయినట్లు జీపీఎస్ పరికరం ద్వారా కనుగొన్న సదరు లారీ సంస్థ దీనిపై అధికారులకు సమాచారం తెలిపింది. దీనిగురించి కరూర్ ఎస్పీ రంజితాపాండేకు సమాచారం అందింది. ఎస్పీ ఉత్తర్వుల ప్రకారం అరవకురిచ్చి డీఎస్పీ గీతాంజలి, ఇన్‌స్పెక్టర్ విజయకుమార్ సహా పోలీసు బృందం అక్కడ భద్రతా పనులు నిర్వహించారు. మరమ్మతుకు గురైన కంటైనర్‌కు విడి భాగాలు పుణే నుంచి రావాల్సి ఉన్నందున అక్కడి నుంచి మదురైకు విమానంలో విడిభాగాలు తీసుకువచ్చారు. అక్కడి నుంచి అరవకురిచ్చికి కారులో పంపేందుకు కంటైనర్ సంస్థ ఏర్పాట్లు చేసింది.
ఇలాఉండగా నగదుతో కంటైనర్లు నిలిచినట్లు తెలియడంతో పత్రికా విలేకరులు అక్కడికి చేరుకున్నారు. అంతేగాకుండా కంటైనర్లు చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో పోలీసులకు సమస్య ఏర్పడింది. కంటైనర్‌లో యాక్సిల్ మరమ్మతుకు గురైనా మొదటి, లేదా రెండవ గేర్‌లో వాటిని నడపవచ్చు. లారీలను నెమ్మదిగా తీసుకువెళ్లమని పోలీసులు సూచించారు. అయితే డీజిల్ ఎక్కువగా ఖర్చవుతుందని డ్రైవర్ వ్యతిరేకించాడు. క్రమంగా అక్కడికి చేరుకునే ప్రజల సంఖ్య పెరుగుతుండడంతో ముందుజాగ్రత్తగా పోలీసులు చర్చలు అనంతరం అందుకు డ్రైవర్లు సమ్మతించారు.
ఇలాఉండగా బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రెండు కంటైనర్లు అక్కడి నుంచి బయలుదేరాయి. బుధవారం రాత్రి నుంచి రెండు కంటైనర్లు మదురైలో నిలిపిఉంచారు. పుణే నుంచి విడిభాగాలు అందిన తర్వాత మరమ్మతులు జరిపి తిరువనంతపురం తీసుకువెళ్లేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో కరూరు ఆదాయపన్ను శాఖ ఇన్‌స్పెక్టర్ నటరాజన్ ఆధ్వర్యంలోని అధికారులు కంటైనర్లకు సంబంధించిన దస్తావేజులను పరిశీలించారు. తర్వాత కంటైనర్ లారీలు బయలుదేరిన తర్వాత అక్కడి నుంచి వెళ్లారు.