
పళనిస్వామికి దినకరన్ చెక్!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో పళనిస్వామి, శశికళ వర్గాల మధ్య పోరు కొనసాగుతోంది. పార్టీ తాత్కాలిక పదవి నుంచి ‘చిన్నమ్మ’ను తొలగించిన మరుసటి రోజే సీఎం ఎడపాడి పళనిస్వామికి టీటీవీ దినకరన్ ఝలక్ ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యాలయం కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగిస్తున్నట్టు దినకరన్ ప్రకటించారు. ఆయన స్థానంలో పి. పళనియప్పన్‌ను నియమించినట్టు తెలిపారు. పార్టీ కోశాధికారి పదవి నుంచి దిందిగల్ సి శ్రీనివాసన్‌ను తప్పించి, ఎం. రంగస్వామిని నియమించినట్టు ఆయన ప్రకటించారు.
అన్నాడీఎంకే సేలం జిల్లా కార్యదర్శి పదవి నుంచి పళనిస్వామిని తొలగించినట్టు గత నెలలో దినకరన్ తెలిపారు. తన దగ్గరున్న 19 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గవర్నర్‌ను కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎస్ రాజేంద్రన్‌ను కూడా పార్టీ పదవి నుంచి అప్పుడే తప్పించారు. రాజేంద్రన్ స్థానంలో పి ముతుయాన్‌ను నియమించినట్టు వెల్లడించారు. పళనిస్వామిని సీఎం పీఠం నుంచి దించాలన్న లక్ష్యంతో గత కొద్దిరోజులు పార్టీ పదవుల నుంచి ఆయన వర్గీయులను దినకరన్ తొలగిస్తున్నారు. అంతకుముందు ఐదుగురు మంత్రులను పార్టీ పదవుల నుంచి తొలగించి, తన అనుచరులను నియమించారు. కాగా, ఇప్పటివరకు సీఎం మార్పు కోసమే ప్రయత్నించానని, ఇకపై పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చమే లక్ష్యంగా పనిచేస్తానని దినకరన్ నిన్న ప్రకటించారు.