ప్రముఖ టీవీ నటి భర్త ఆత్మహత్య
చెన్నై: ప్రముఖ తమిళ టీవీ నటి నందిని భర్త కార్తికేయన్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం చెన్నైలోని ఓ లాడ్జిలో కార్తికేయన్ మరణించగా, మంగళవారం లాడ్జి సిబ్బంది అతని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. తాను ఆత్మహత్య చేసుకోవడానికి అత్తమామలే కారణమని ఆయన సూసైడ్ నోట్‌లో రాశాడు.
కాగా కార్తికేయన్ చావుకు తన తల్లిదండ్రులు కారణం కాదని నందిని చెబుతోంది. ఆయనకు అవినీతి వ్యాపార కార్యకలాపాలతో సంబంధముందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తాను ఈ విషయం గురించి కార్తికేయన్‌ను నిలదీయగా, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని, దీంతో తాను తల్లిదండ్రుల దగ్గరకు వచ్చానని చెప్పింది. కార్తికేయన్‌కు వివాహేతర సంబంధముందని, ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారని చెప్పింది. ఈ విషయాన్ని తాను ఎవరికీ చెప్పలేదని, తన భర్త దుబాయ్‌కు వెళ్లాడని అబద్ధం చెప్పానని తెలిపింది. ఈ రహస్యాలన్నింటినీ తనలో దాచుకున్నానని, తన తల్లిదండ్రులకు ఎలాంటి సంబంధం లేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయాలను బయట పెడుతున్నానని నందిని చెప్పింది. తన భర్తకు ఆర్థిక సాయం కూడా చేశానని, సమస్యలు పరిష్కారమయ్యాక మళ్లీ కలిసుందామని చెప్పానని తెలిపింది.
నందిని (32) శర్వాణన్ మీనాక్షి సీరియల్ ద్వారా పాపులర్ అయ్యింది. కార్తికేయన్ ఓ జిమ్‌ను నిర్వహించేవాడు. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న తర్వాత సమస్యలు వచ్చాయి.