
‘పుష్ప 2: ది రూల్’ సినిమాతో వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించారు అల్లు అర్జున్. ఆ సినిమా తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించనున్న కొత్త మూవీ ఏంటి? అనే ప్రశ్నకు అధికారికంగా జవాబు లేదు. కాగా ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత త్రివిక్రమ్, తమిళ దర్శకుడు అట్లీలతో అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఎవరితో ముందుగా మూవీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ సినిమా చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్.
‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో రూపొందనున్న నాలుగో సినిమా ఇది. ఈప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ భారీ కాన్వాస్ ఉన్న వైవిధ్యమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. శివుడి తనయుడైన కార్తికేయుడు యుద్ధ దేవుడిగా ఎలా మారాడు? తండ్రి అయిన శివుణ్ణి తిరిగి కలవడానికి కార్తికేయ బయలుదేరినప్పుడు అతని ప్రయాణం ఎలా సాగింది? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుందట.
సోషల్ మైథలాజికల్ ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు త్రివిక్రమ్ కథని సిద్ధం చేస్తున్నారని టాక్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుందని సమాచారం. అల్లు అర్జున్ ఇప్పటివరకు చేసిన పాత్రలకి పూర్తి వైవిధ్యంగా కార్తికేయ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment