సాక్షి , చెన్నై : కన్నతల్లి మమకారం ఆ అక్కాచెల్లెళ్లను పొదుపరులుగా మార్చింది. ఏనాటికైనా చావు తప్పదు, అయితే తమ అంత్యక్రియలకు ఆయ్యే ఖర్చు తమ సంతానానికి భారం కాకూడదని తలచేలా చేసింది. ఏడుపదులు దాటిని వృద్ధాప్య దశలో ఎదురవుతున్న అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఇద్దరూ కలిసి గోప్యంగా దాచి ఉంచిన రూ.46వేలు బయటకు తీయగా అవన్నీ రద్దయిన పెద్దనోట్లు కావడంతో ఖిన్నులై కృంగిపోయారు. బిడ్డలకు చెప్పుకుని బోరుమని విలపించారు.
తిరుప్పూరు జిల్లా పల్లడం సమీపంలోని పూమలూరులో కే రంగమ్మాళ్ (75), పీ తంగమ్మాళ్ (72) అనే అక్కచెల్లెళ్లు నివసిస్తున్నారు. రంగమ్మాళ్‌కు ఏడుగురు, తంగమ్మాళ్‌కు ఆరుగురు సంతానం. అందరికీ పెళ్లిళ్లయి వేర్వేరు ఊళ్లలో కాపురం ఉంటున్నారు. వారిద్దరి భర్తలు చనిపోవడంతో పశువులు మేపడం వృత్తిగా పెట్టుకుని వేర్వేరుగా కాపురం ఉంటూ ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే సంపాదనలో ఇద్దరూ కూడబలుక్కుని పిల్లలకు తెలియకుండా కొంతదాచిపెట్టేవారు.
నెలరోజుల క్రితం తంగమ్మాళ్ ఆస్మావ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం పెరుందురై ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఒక కుమారుడిని పిలిచి ఇంటిలో తన అంత్యక్రియల ఖర్చుకోసం కొంతసొమ్ము పొదుపుచేసి ఉన్నాను, అందులో నుంచి కొంత తీసుకురమ్మని పంపింది. ఇంటికి వెళ్లి నగదును చూడగా అవన్నీ రూ.24వేల విలువైన రద్దుకు గురైన రూ.1000, రూ.500 పెద్దనోట్ల కావడంతో అతడు బిత్తరపోయాడు. ఈవిషయాన్ని తల్లికి చెప్పగా తనతోపాటూ సోదరి రంగమ్మాళ్ కూడా ఇలానే రూ.22వేలను దాచిపెట్టి ఉందనే విషయాన్ని తెలిపి కన్నీరుపెట్టుకుంది.
లోకజ్ఞానం లేని నిరక్షరాస్యులైన ఈ అక్కచెల్లెళ్లకు పెద్దనోట్ల రద్దు విషయం వీరికి తెలియకపోవడంతో సదరు సొమ్మును బ్యాంకులో మార్చుకోకుండా అలానే ఉంచుకున్నారు. రంగమ్మాళ్ కుమారుడు సెల్వరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఉచిత టీవీలు వారిద్దరి ఇళ్లలో ఉన్నా గత కొంతకాలంగా అవిపనిచేయడం లేదని, దీంతో పెద్దనోట్ల రద్దు విషయం వారి దృష్టికి రాలేదని తెలిపాడు. రోజువారీ ఇంటి ఖర్చుల కోసం కొడుకుల నుంచి కొంత తీసుకుంటూ అంత్యక్రియల కోసం వారిద్దరూ కలిసి రూ.46వేలు దాచుకున్నారు. ఆ సొమ్ము ఇక చెల్లదని తెలియడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారని ఆయన అన్నాడు.
వారిని హెల్పేజ్‌లైన్ ఆదుకునేనా :
నిరక్షరాస్యులైన ఆ అక్కాచెలెళ్లకు పెద్దనోట్ల రద్దుతో అనుకోని సమస్య వచ్చి పడింది. మూడేళ్ల కిత్రమే చెల్లకుండా పోయిన నోట్లను చెల్లుబాటు చేసే పరిస్థితులు లేకపోవడం వారిని దిగాలులోకి నెట్టేసింది. వృద్ధుల అవసరాలు, సమస్యలు తీర్చేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం జారీచేసిన ఉత్తర్వులు అక్కాచెల్లెళ్ల సమస్యను తీర్చేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా సీనియర్ సిటిజన్స్, వృద్ధులకు ప్రభుత్వం ఇప్పటికే చట్టపరమైన సామాజిక భద్రత కల్పిస్తోంది.
అంతేగాక వృద్ధులు తమకు అవసరమైన సహాయాన్ని పొందేందుకు టోల్‌ఫ్రీ నంబరును సిద్ధం చేసింది. చెన్నై పరిధిలోని వారు 1253, చెన్నై మినహా ఇతర జిల్లాల వారు 1800–180–1253 టోల్‌ఫ్రీ నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చు. హెల్పేజ్ ఇండియా అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రభుత్వం ఈ సేవలను అందిస్తోంది. ప్రస్తుతం మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రం నలుమూలలా ఉన్న సీనియర్ సిటిజెన్స్, వృద్ధులకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం అదనంగా ఫోన్ నంబర్లను ప్రవేశపెట్టింది. ల్యాండ్ లైన్ : 044–24350375, సెల్‌ఫోన్ : 93612 72792 నంబర్లను ప్రకటించింది. ఈ హెల్పేజ్ లైన్‌కు అక్కాచెల్లెళ్లు తమ సమస్యను తీసుకెళితే ఒక సవాలుగా మారే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment