సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు భార్యలున్న భర్త బాధలు ఇన్నిన్ని కాదయా అంటారు.. బతికి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఏమోగానీ మరణించాక మాత్రం ఆ భర్తకు తిప్పలు తప్పలేదు. ఓ భార్య దహనం అంటే.. మరొకరు ఖననం అని మొండికేయడంతో కోర్టు జోక్యం చేసుకోవాల్సిన విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడు చెంగల్పట్టుకు చెందిన దక్షిణామూర్తి భార్య తంగమ్మాళ్. భార్య జీవించి ఉండగానే గౌరీ అలియాస్ ఏసుమేరీని రెండో వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కంటే రెండో భార్య ఇంట్లోనే ఎక్కువకాలం గడిపే దక్షిణామూర్తి ఈ నెల 16న మృతి చెందాడు. అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం దహనం చేయడమా.. లేక క్రైస్తవ సంప్రదాయం పద్ధతిలో ఖననం చేయడమా అనే ప్రశ్న తలెత్తింది. ‘చివరి దశలో ఆయన నా వద్దనే ఉన్నారు కాబట్టి ఖననం చేయాలి.. అంతేకాదు తన భర్త కూడా అదే ఆదేశించారు’ అని పేర్కొంటూ దక్షిణామూర్తి రాసినట్లుగా ఒక ఉత్తరాన్ని రెండో భార్య వెలుగులోకి తెచ్చింది.
అయితే అందులో సంతకానికి బదులు వేలిముద్ర ఉంది. ‘ఆయనకు నేను మొదటి భార్యను.. మా సంప్రదాయం ప్రకారమే అంత్యక్రియలు జరగాలి. సంతకం చేయడం తెలిసిన ఆయన వేలిముద్ర ఎందుకు వేస్తారు? రెండో భార్య చూపుతున్నది నకిలీ ఉత్తరం’ అంటూ పెద్ద భార్య వాదించింది. ఇద్దరు భార్యల మధ్య సామరస్యం కోసం పోలీసుల ప్రయత్నం కూడా విఫలమైంది. భార్యల కుమ్ములాట కొలిక్కిరాకపోగా దక్షిణామూర్తి శవం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లడంతో పోలీసులు చెంగల్పట్టు మార్చురీకి తరలించారు. భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యలూ కోర్టుకెక్కారు. ఇరుపక్షాల వాదనలు ముగిశాక న్యాయమూర్తి ప్రకాశ్ శుక్రవారం ఇరుపక్షాలనుద్దేశించి.. ‘దక్షిణామూర్తి అంత్యక్రియలపై ఇద్దరు భార్యలు ఏకాభిప్రాయానికి వస్తారని ఎంతో ఎదురుచూశాం.. అయితే ఇద్దరూ మొదటి నుంచి అదే పట్టులో ఉన్నారు.. రెండు రోజుల్లో ఒక నిర్ణయానికి రాకుంటే.. అనాథ శవంగా పరిగణించి ప్రభుత్వమే అంతిమ సంస్కారాలు నిర్వహిస్తుంది’ అంటూ తీర్పును వెలువరించారు.
దహనం.. కాదు ఖననం!
Published Sat, Aug 25 2018 1:53 AM | Last Updated on Sat, Aug 25 2018 12:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment