సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు సవతి భార్యల పోరులో భర్త అంత్యక్రియల వ్యవహారం ప్రహసనంగా మారింది. భర్త శవం తనకే సొంతమంటూ ఇద్దరు భార్యలు పోట్లాడుకుని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కిన ఉదంతం తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీలో సెక్యూరిటీ పని చేస్తున్న సెంథిల్ కుమార్ (44), విజయ దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయి అదే వర్సిటీలో పనిచేస్తున్న మహేశ్వరి అనే మహిళను సెంథిల్ కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వర్సిటీ క్వార్టర్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. అయితే బుధవారం రాత్రి సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంథిల్ కుమార్ గుండెపోటుకు గురై స్పృహతప్పి పడిపోయాడు. సహచర ఉద్యోగులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న రెండో భార్య మహేశ్వరి.. భర్త అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని బంధువుల సహాయంతో ఇంటికి చేర్చింది. ఈ సమాచారం అందుకున్న మొదటి భార్య విజయ అక్కడికి వెళ్లగా.. విడాకులు ఇచ్చిన నీకు భర్త మరణంతో సంబంధం ఏమిటని మహేశ్వరి వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో బంధువులు చేసేది లేక పోలీసులకు సమాచారం ఇవ్వగా సెంథిల్‌కుమార్ మృతదేహాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేయగా ఫలించకపోవడంతో పోలీసులు.. విద్యుత్ శ్మశానవాటికలో విజయ కుమార్తె తన తండ్రికి అంత్యక్రియలు చేయవచ్చని తీర్మానం చేశారు. దీంతో సెంథిల్‌కుమార్, ఇద్దరు భార్యలు, బంధువుల సమక్షంలో అంతిమ సంస్కారాలు గురువారం పూర్తయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment