భయంతో నడుస్తున్న ఆటోలోంచి దూకేసిన ఇద్దరు యువతులు
సాక్షి, ముంబై: డ్రైవర్ అశ్లీల సైగలతో భయపడిన ఇద్దరు యువతులు నడుస్తున్న ఆటోలోంచి దూకేసిన సంఘటన ఆదివారం రాత్రి ఠాణేలో చోటుచేసుకుంది. యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్ కోసం వర్తక్‌నగర్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. గాయపడిన ఇద్దరు యువతులు ఠాణేలోని జూపిటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రత్నగిరి నుంచి వచ్చిన ప్రతీక్ష పురాణిక్ (17), సారిక పాటిల్ (21) ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు ఠాణేలో రైలు దిగారు.
భివండీలో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కారు. కొద్ది దూరం వెళ్లగానే ఆటో డ్రైవర్ అద్దంలో వారి వంక చూస్తూ అశ్లీల సైగలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో భయపడిన యువతులు ఆటో ఆపాలని చెప్పినా ఆపకుండా ముందుకు వెళ్లసాగాడు. ఆటో హైవేపై ఉండటంతో వేగాన్ని పెంచాడు. దీంతో భయపడిన ఇరువురు దిక్కు తోచక వేగంగా వెళుతున్న ఆటోలోంచి దూకేశారు. అదృష్టవశాత్తు అటుగా వెళుతున్న ఓ మహిళ గాయపడ్డ వీరిని గమనించి ఆస్పత్రిలో చేర్పించింది.
గతేడాది ఆగస్టు 1న విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న సప్నాలి లాడ్ కూడా ఇలాగే నడుస్తున్న ఆటోలోంచి దూకేసింది. తీవ్రగాయాలతో 21 రోజుల పాటు కోమాలోకి వెళ్లింది. ఈ ఘటన కూడా ఠాణేలోనే జరిగింది. అంతకు ముందు విజయవాడ నుంచి వచ్చిన ఎస్తేర్ అనూహ్య కూడా దారుణ హత్యకు గురయ్యింది. అప్పుడు ఈ రెండు ఘటనలు నగరంలో సంచలనం సృష్టించాయి. ఇవి మర్చిపోక ముందే ఇప్పుడు మరో సంఘటన జరగటంతో ముంబై వాసుల ఆటో ఎక్కాలంటేనే బెంబేలెత్తుతున్నారు.
ఆటో డ్రైవర్ వికృత చేష్టలు
Published Mon, Mar 2 2015 10:50 PM | Last Updated on Sat, Sep 29 2018 5:33 PM
Advertisement
Advertisement