జలరవాణాకు అత్యంత ప్రాధాన్యం: గడ్కరీ
Published Sat, Jan 28 2017 4:23 PM | Last Updated on Tue, Sep 5 2017 2:21 AM
విశాఖ: జలరవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, పంజాబ్ ఎన్నికల తర్వాత బకింగ్ హామ్ కెనాల్ పనులు ప్రారంభిస్తామని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ చెప్పారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమంలో పారిశ్రామిక కారిడార్‌పై నిర్వహించిన సెషన్‌లో ఆయన మాట్లాడారు. విశాఖ పోర్టు లాభాలను బకింగ్‌హామ్ కెనాల్ అభివృద్ధికి ఉపయోగిస్తామని చెప్పారు. జలరవాణాకు భూసేకరణ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనంటూ ఆంధ్రప్రదేశ్‌లో భూసేకరణ సమస్య ఉండదని భావిస్తున్నానన్నారు.
ఏపీలో 2 లక్షల కి.మీ. మేర జాతీయ రహదారులు నిర్మించాలనుకున్నాం.. ఇప్పటికే రూ.1.70 లక్షల కి.మీ మేర జాతీయ రహదారులు నిర్మించాం.. సాగర్‌మాల ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైంది.. ఈ ప్రాజెక్టులో తీర ప్రాంత అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని ఆయన తెలిపారు. పోర్టు ఆధారిత అభివృద్ధి తమ లక్ష్యం అని, రెండు తీరప్రాంత ఆర్థిక కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయని, విశాఖ పోర్టు వద్ద రూ.6 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నామని, ఏపీలో తీర ప్రాంత అభివృద్ధి కేంద్రాల్లో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు తమ లక్ష్యమని అన్నారు. అనంతపురం-అమరావతి రహదారి పనులు వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. రాయపూర్-విశాఖ రహదారి పనులనూ చేపడతామని, ఈ ప్రాజెక్టు వ్యయం రూ.5 వేల కోట్లు అని, చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అని గడ్కరీ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నామంటూ ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా ముందు రహదారులు అభివృద్ధి చెందాలన్నారు. రాష్ట్రంలో అన్ని పోర్టులను అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణం జరపాలని, విశాఖ-రాయపూర్ మధ్య మలుపులు లేని 6 లేన్ల రహదారి నిర్మించాలని కోరుతున్నామన్నారు. రహదారికి సమాంతరంగా రైల్వే లైను కూడా ఏర్పాటు చేయాలంటూ దేశంలో అత్యుత్తమ రహదారుల నిర్మాణానికి గడ్కరీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్, డిఫెన్స్, లైవ్‌స్టాక్, ఆక్వా.. ఇలా అన్నింటా సానుకూల వాతావరణం ఉందంటూ ఏపీ నంబర్ వన్ రాష్ట్రంగా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు అని పేర్కొన్నారు. కాగా, సమావేశానికి ముందు గడ్కరీతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
Advertisement
Advertisement