వైభవంగా వరలక్ష్మీవ్రతం
Published Sat, Aug 17 2013 11:48 PM | Last Updated on Fri, Sep 1 2017 9:53 PM
సాక్షి, ముంబై: భివండీలోని నవజీవన్ కాలనీలో ఉన్న శ్రీ సద్గురు బ్రహ్మర్షి విద్యానందగిరి ఆశ్రమంలో భక్తబృందం ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు మహిళలు వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొన్నారు. ప్రతి శ్రావణమాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుతామని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూజా కార్యక్రమం జరిగిందన్నారు. పూజానంతరం మధ్యాహ్నం భక్తులందరికీ మహాప్రసాదం అందజేశామని తెలిపారు. ఇదిలా ఉండగా పద్మనగర్, మార్కండేయనగర్, గాయిత్రీనగర్, కామత్‌ఘర్, కన్నేరి, కొంబడ్‌పాడా, కాసార్ అలీ, నయీబస్తీ తదితర తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో కూడా మహిళలు తమ ఇళ్లల్లో వరలక్ష్మీవ్రతం నిర్వహించారు. పద్మనగర్‌లోని వైష్ణవ దేవాలయం, బాలాజీ మందిరాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు జరిగాయి. ఒకవిధంగా పండుగ వాతావరణం కనిపించిందని చెప్పవచ్చు.
శ్రీ సత్యానందమహర్షి భక్తమండలి ఆధ్వర్యంలో
ప్రభాదేవిలోని శ్రీ సత్యానంద మహర్షి భక్తమండలి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ‘వరలక్ష్మీ వ్రతం’ శ్రీహరి తీర్థ స్వాముల వారిచే ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వ్రతం తర్వాత స్వామీజీ ఉపన్యసిస్తూ వ్రతం విశిష్టతను వివరించారు. హారతి తర్వాత భక్తులకు ప్రసాదం పంపిణీ చేసినట్లు మండలి కార్యదర్శి మంచె పురుషోత్తం తెలిపారు.
Advertisement
Advertisement