పెట్రో మంటలు
► వ్యాట్ పన్ను పెంపు
► అధికారపక్షంపై భగ్గుమన్న విపక్షం
► పెట్రోలు లీటరు రూ.74.39
► డీజిల్ లీటరు రూ.62.49.
వేసవి తీవ్రత పెరగకముందే రాష్ట్రం పెట్రో మంటలతో మండిపోతోంది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ పన్ను పెరగడమే ఈ మంటలకు కారణం. ప్రజలపై ప్రభుత్వం మోపిన పెట్రోభారంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన వ్యాట్ పన్ను పెంపు వల్ల లీటరు పెట్రోలు ధర రూ.70.61 నుంచి రూ.74.97లకు, లీటర్ డీజిల్ ధర రూ.60.73లకు పెరిగింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అన్నీ సంచలనాలే. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 15 రోజుల్లోగా విశ్వాసపరీక్షలో నెగ్గాలని గవర్నర్ ఆదేశించగా, ఆలసించిన ఆశాభంగం అనుకున్నారో ఏమో మూడోరోజనే బలపరీక్షకు సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎడపాడి విశ్వాసపరీక్ష నుంచి గట్టెక్కారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చాంబర్‌లో కూర్చుని ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తూ తొలి ఐదు సంతకాలు చేశారు. ఇలా అడుగడుగునా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సీఎం ఎడపాడి తాజాగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు కారణమై మరో చర్చకు తెరదీశారు. పెట్రోలుపై ప్రస్తుతం 27 శాతంగా ఉన్న వ్యాట్ పన్నును 34 శాతానికి పెంచారు. అలాగే డీజిల్‌పై వ్యాట్ పన్నును 21.43 శాతం నుంచి 24 శాతానికి పెంచారు. రాష్ట్రప్రభుత్వ స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఉరుములేని పిడుగులా ఒక్కసారిగా పెరిగిపోయాయి. లీటరు పెట్రోలుపై రూ.3.78 లు, లీటరు డీజిల్‌పై రూ.1.76 అదనపు భారం పడింది.
ప్రజల దిగ్భ్రాంతి.. ప్రతిపక్షాల ఆగ్రహం:
పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గినా, పెరిగినా సహజంగా కేంద్ర పరిధిలో సాగుతుంది. అయితే రాష్ట్రప్రభుత్వం కారణంగా రాత్రికి రాత్రే పెట్రోలు, డీజిల్ ధరలు మోతమోగ డంపై ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు చేపల వేట, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అంతేగాక అన్నిరకాల వృత్తులను బాధించగలదని ఆరోపిస్తున్నారు. బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోగలవని అంటున్నారు. మధ్య, కింది తరగతి ప్రజలను తీవ్రంగా బాధించగలదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు రాష్ట్రంలో బినామీ ప్రభుత్వం కారణం కావడం శోచనీయమని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఈ అరాచక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రగతిని తిరోగమన బాటపడుతుందని విమర్శించారు. పెంచిన వ్యాట్ పన్నును ఉపసంహరించేలా తాము అసెంబ్లీలో పోరాడుతామని చెప్పారు. పీఎంకే అ«ధినేత డాక్టర్ రాందాస్, తమాకా అధ్యక్షుడు జీకే వాసన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తీవ్రంగా ఖండించారు.
తమిళనాడు పెట్రోలు, డీజిల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యాట్ పన్నును విపరీతంగా పెంచారని తెలిపారు. ఏ కారణం చేత వ్యాట్ పన్నును పెంచాలి్సవచి్చందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు ధర తమిళనాడు కంటే రూ.6 తక్కువగా ఉందని అన్నారు. తమిళనాడు వ్యవసాయ సంఘం సంయుక్త కార్యాచరణ సమితి అధ్యక్షుడు పీఆర్ పాండియన్ మాట్లాడుతూ ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ వ్యాట్ పన్నును పెంచలేదని ఆయన గుర్తు చేశారు. వ్యాట్‌పన్ను పెంపును ఎంతమాత్రం అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు ఇసుక లారీల యజమానుల సంఘం సమ్మేళన్ అధ్యక్షుడు చెల్ల రాజామణి, వ్యాపార సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మురుగయ్యన్ తీవ్రంగా ఖండించారు.