VAT tax
-
పెట్రోలుపై రూ. 3 తగ్గింపు.. నష్టాన్ని భరిస్తామన్న ప్రభుత్వం!
చెన్నై: లీటరు ధర వంద రూపాయల మార్క్‌ను దాటేసి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది పెట్రోలు. ఆగకుండా పెరుగుతున్న ధరతో ఫ్యూయల్ కోసం బంకు వెళ్లిన ప్రతీసారీ బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట పద్దు తయారీ సందర్భంగా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లీటరుపై రూ. 3 తగ్గింపు పెట్రోలు ధరలను తగ్గిస్తూ తమిళనాడు సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లినా పర్వాలేదు.. సామాన్యులకు ఊరట కలిగించేందుకు సిద్దమైంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వ్యాట్‌లో కోత దేశవ్యాప్తంగా పెట్రోలు ధర లీటరుకు రూ.100 దాటేసింది. పెట్రోలో ధరలో 36 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్నులు ఉండగా దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)లను విధిస్తున్నాయి. ఇలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల పోటుతో పెట్రోలు రేటు సెంచరీ మార్క్‌ని క్రాస్ చేసింది. దీంతో సామాన్యులకు పెట్రోలు ధరల నుంచి కొంత ఉపశమనం కలిగించేందుకు వ్యాట్‌ను తమిళనాడు ప్రభుత్వం తగ్గించింది. వంద దిగువకు ధరల తగ్గింపుకు ముందు చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 102.49గా ఉంది. మూడు రూపాయల తగ్గింపుతో పెట్రోలు ధర వందకు దిగువకు రానుంది. అయితే ధరల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అలాగే డీజిల్ రేట్ల తగ్గింపు ఉంటుందా లేదా అనేదానిపై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. -
అలా అయితే రూ.75కే లీటర్ పెట్రోల్!
ప్రస్తుతం పెరిగిపోతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ఇతర రాష్ట్రాలలో పెట్రోల్ ధర రూ.100 కూడా దాటేసింది. దింతో ప్రజానీకం ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా దేశంలో చమురు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తే లీటర్ పెట్రోల్ ధర రూ.75, డీజిల్ రూ.68 కు దిగొస్తుందని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అన్నారు. రాజకీయ నాయకులు సంకల్పం తీసుకోలేకపోవడం వల్ల భారతదేశంలో చమురు ఉత్పత్తి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నట్లు ఎస్బీఐ ఆర్థిక నిపుణులు తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులపై విధించే అమ్మకపు పన్ను/వ్యాట్ పన్నులే వారికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్ కమిషన్, ఎక్సైజ్ సుంకం, సెస్, వ్యాట్ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు. అందువల్ల చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై 50 నుంచి 60 శాతం పన్నులు విధిస్తున్నాయి. ఒకవేళ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28శాతం పన్ను మాత్రమే విధించాల్సి ఉంటుంది. నిజంగా తెస్తే మాత్రం వినియోగదారులపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.75, లీటర్ డీజిల్ రూ.68కే రానున్నట్లు ఆర్థికవేత్తలు తెలిపారు. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని, ఇది దేశ జీడీపీలో కేవలం 0.4శాతమేనని వారు పేర్కొన్నారు. చమురు వినియోగం రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని భవిష్యత్ లోకి పూడ్చుకోవచ్చు అని తెలిపారు. అంతేగాక, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. అంటే.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను, ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాలన్నారు. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చమురు ధర విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే! ఈపీఎఫ్ వడ్డీరేటు యథాతథం -
పెట్రోల్‌పై జీఎస్టీ+వ్యాట్..!!
సాక్షి, న్యూఢిల్లీ : రోజురోజుకూ పెరుగుతూ పోతూ సామాన్యుడికి చుక్కలు చూపెడుతున్న పెట్రోల్, డిజీల్ ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క మార్గం వాటిని వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లోకి తీసుకురావడం. అయితే, పెట్రోల్, డీజిల్, సహజ వాయువు, జెట్ ఇంధనం, క్రూడ్ ఆయిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోతాయి. జీఎస్టీలో అత్యధిక పన్ను శ్లాబ్ 28 శాతం. దీనిలోకి పెట్రో సంబంధిత ఉత్పత్తులను తెచ్చినా ప్రభుత్వాలకు దాదాపు 20 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో ఇందుకు మరో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా జీఎస్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాట్ విధించే అవకాశం ఇవ్వడం ఒకటని సీనియర్ ప్రభుత్వ అధికారి వెల్లడించారు. త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా పెట్రో ఉత్పత్తులపై కేవలం జీఎస్టీని మాత్రమే విధించడం లేదని తెలిపారు. అందుకే జీఎస్టీతో పాటు వ్యాట్‌ను పెట్రో ఉత్తత్పులపై విధించాలని భావిస్తున్నట్లు వివరించారు. కేంద్రం ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్ డ్యూటీని విధిస్తోంది. వీటికి ఆయా రాష్ట్రాలు అదనంగా వ్యాట్‌ను విధిస్తున్నాయి. అత్యధికంగా ముంబైలో 39.12 శాతం వ్యాట్‌ను వసూలు చేస్తుండగా.. అండమాన్‌లో అత్యల్పంగా 6 శాతం వ్యాట్ విధిస్తున్నారు. -
వినియోగదారులపై భారం సరికాదు
⇔ జీఎస్టీ వ్యాట్‌ట్యాక్స్ తగ్గించాలి ⇔ హోటల్స్ అసోసియేషన్ సభ్యుల డిమాండ్ ⇔ పట్టణంలో ర్యాలీ.. నిరసన మహబూబ్‌నగర్ క్రైం: కేంద్ర ప్రభుత్వం హోటళ్లలో వ్యాట్‌ట్యాక్స్‌ను పెంచడం వల్ల వ్యాపారం బాగా దెబ్బతింటుందని, వెంటనే ఈ నిర్ణయం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చేపట్టిన హోటళ్ల బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మహబూబ్‌నగర్ పట్టణంలోని అవంతి హోటల్ దగ్గరనుంచి న్యూటౌన్, బస్టాండ్, క్లాక్‌టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మనోహార్‌రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ చట్టంలో వినియోగదారులైన సామాన్య ప్రజలపై అధిక భారం పడేవిధంగా 18శాతం వ్యాట్‌ట్యాక్స్ వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 30న జిల్లాలో హోటళ్ల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించి సామాన్యులపై భారం పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో హోటల్ వ్యాపారం అశించిన స్థాయిలో లేదని, ఈ క్రమంలో పన్నుభారం అధికంగా ఉంటే హోటల్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి నిరంజన్‌రెడ్డి, సమత్‌ఖాన్, చంద్రశేఖర్‌శెట్టి, శ్రీకాంత్‌రెడ్డి, జీతేందర్‌రెడ్డి, ఉమమహేశ్వర్రెడ్డి, భాస్కర్‌రెడ్డి,నాగరాజు పాల్గొన్నారు. -
పెట్రో మంటలు
► వ్యాట్ పన్ను పెంపు ► అధికారపక్షంపై భగ్గుమన్న విపక్షం ► పెట్రోలు లీటరు రూ.74.39 ► డీజిల్ లీటరు రూ.62.49. వేసవి తీవ్రత పెరగకముందే రాష్ట్రం పెట్రో మంటలతో మండిపోతోంది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ పన్ను పెరగడమే ఈ మంటలకు కారణం. ప్రజలపై ప్రభుత్వం మోపిన పెట్రోభారంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన వ్యాట్ పన్ను పెంపు వల్ల లీటరు పెట్రోలు ధర రూ.70.61 నుంచి రూ.74.97లకు, లీటర్ డీజిల్ ధర రూ.60.73లకు పెరిగింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎడపాడి పళనిస్వామి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అన్నీ సంచలనాలే. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి 15 రోజుల్లోగా విశ్వాసపరీక్షలో నెగ్గాలని గవర్నర్ ఆదేశించగా, ఆలసించిన ఆశాభంగం అనుకున్నారో ఏమో మూడోరోజనే బలపరీక్షకు సిద్ధమయ్యారు. అసెంబ్లీలో అనేక నాటకీయ పరిణామాల మధ్య ఎడపాడి విశ్వాసపరీక్ష నుంచి గట్టెక్కారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత చాంబర్లో కూర్చుని ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ ఇచ్చిన హామీలపై దృష్టి సారిస్తూ తొలి ఐదు సంతకాలు చేశారు. ఇలా అడుగడుగునా వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సీఎం ఎడపాడి తాజాగా పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు కారణమై మరో చర్చకు తెరదీశారు. పెట్రోలుపై ప్రస్తుతం 27 శాతంగా ఉన్న వ్యాట్ పన్నును 34 శాతానికి పెంచారు. అలాగే డీజిల్‌పై వ్యాట్ పన్నును 21.43 శాతం నుంచి 24 శాతానికి పెంచారు. రాష్ట్రప్రభుత్వ స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఉరుములేని పిడుగులా ఒక్కసారిగా పెరిగిపోయాయి. లీటరు పెట్రోలుపై రూ.3.78 లు, లీటరు డీజిల్‌పై రూ.1.76 అదనపు భారం పడింది. ప్రజల దిగ్భ్రాంతి.. ప్రతిపక్షాల ఆగ్రహం: పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గినా, పెరిగినా సహజంగా కేంద్ర పరిధిలో సాగుతుంది. అయితే రాష్ట్రప్రభుత్వం కారణంగా రాత్రికి రాత్రే పెట్రోలు, డీజిల్ ధరలు మోతమోగ డంపై ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంపు చేపల వేట, రవాణా, పర్యాటక, పారిశ్రామిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. అంతేగాక అన్నిరకాల వృత్తులను బాధించగలదని ఆరోపిస్తున్నారు. బియ్యం, పప్పులు, నూనె తదితర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోగలవని అంటున్నారు. మధ్య, కింది తరగతి ప్రజలను తీవ్రంగా బాధించగలదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలు, డీజిల్ ధరల పెంపునకు రాష్ట్రంలో బినామీ ప్రభుత్వం కారణం కావడం శోచనీయమని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎద్దేవా చేశారు. ఈ అరాచక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రగతిని తిరోగమన బాటపడుతుందని విమర్శించారు. పెంచిన వ్యాట్ పన్నును ఉపసంహరించేలా తాము అసెంబ్లీలో పోరాడుతామని చెప్పారు. పీఎంకే అ«ధినేత డాక్టర్ రాందాస్, తమాకా అధ్యక్షుడు జీకే వాసన్, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో తీవ్రంగా ఖండించారు. తమిళనాడు పెట్రోలు, డీజిల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళీ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యాట్ పన్నును విపరీతంగా పెంచారని తెలిపారు. ఏ కారణం చేత వ్యాట్ పన్నును పెంచాలి్సవచి్చందో ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోలు ధర తమిళనాడు కంటే రూ.6 తక్కువగా ఉందని అన్నారు. తమిళనాడు వ్యవసాయ సంఘం సంయుక్త కార్యాచరణ సమితి అధ్యక్షుడు పీఆర్ పాండియన్ మాట్లాడుతూ ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదో అర్థం కావడం లేదని ఆక్షేపించారు. జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఎన్నడూ వ్యాట్ పన్నును పెంచలేదని ఆయన గుర్తు చేశారు. వ్యాట్‌పన్ను పెంపును ఎంతమాత్రం అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు ఇసుక లారీల యజమానుల సంఘం సమ్మేళన్ అధ్యక్షుడు చెల్ల రాజామణి, వ్యాపార సంఘం రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మురుగయ్యన్ తీవ్రంగా ఖండించారు. -
ధరల మోత
ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు కందిపప్పు కిలోపై రూ. 20-30లు పెంపు మినప్పప్పు ధర ఏకంగా రూ.130 బావురుమంటున్న బడుగుజీవి మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. నిన్న మొన్నటి వరకు తక్కువగా ఉన్న ధరలు ఒక్కసారిగా చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు పెరిగిన డీజిల్ ధరలు, మరో వైపు రెండు రాష్ట్రాల్లోని ఎంట్రీ ట్యాక్స్, ఇంకో వైపు వ్యాట్ పన్ను వెరసి సరుకుల ధరలు వినియోగదారుని వీపు విమానం మోత మోగిస్తున్నాయి. సాధారణ జనం ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదని ఆందోళన చెందుతున్నారు. కడప అగ్రికల్చర్ : సాధారణంగా ప్రతి ఇంట్లో కందిపప్పు, మినపప్పు, శనగ, వేరుశనగ పప్పులు, పప్పులు తప్పక వినియోగిస్తారు. వారం క్రితం మినపప్పు(ఉద్దిపప్పు) కిలో రూ. 80 ఉండగా నేడు అది రూ. 130కి చేరింది. అలాగే కందిపప్పు రకాలు కిలో రూ. 80-100 ఉండగా ఇప్పుడు రూ. 100-120 ధర పలుకుతున్నాయి. వేరుశనగ పప్పు కిలో రూ. 56లు ఉండగా నేడు రూ. 80, శనగ బేడలు కిలో రూ.45 ఉండగా ఇప్పుడు వాటి ధర కిలో రూ. 60 పలుకుతున్నాయి. పప్పులు కిలో రూ. 45 ఉండగా ఇప్పుడు కిలో రూ. 60ల ధర ఉంటోంది. ఎండు మిరపకాయలు కిలో రూ. 80 ఉండేవి, ఇప్పుడు కాస్త కిలో రూ.110కి చేరింది. తెల్లగడ్డలు కిలో రూ.40 నుంచి రూ. 60, చింతపండు కిలో రూ. 55 నుంచి రూ. 78లకు చేరుకుంది. ధరలు ఇలా పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా చంద్రబాబు పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని రకాల నిత్యావసర ధరలు అదుపులో ఉంటాయని ఎన్నికల సందర్భంలో ప్రచారంతో హోరెత్తించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని రకాల పన్నులు విధించి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. అప్పట్లో 9 రకాల నిత్యావసర వస్తువులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ప్రజలకు సబ్సిడీపై అందించేది. దాని వల్ల ప్రతి కుటుంబానికి కనీసం నెలకు రూ. 170ల వరకు భారం తగ్గేది. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తగ్గడం మాట అటుంచి మార్కెట్లో ఉన్న ధరల్లో కూడా ఒక్కో సరుకు ధర రూ. 120-130ల వరకు పెరిగాయి. ప్రస్తుతం వినియోగదారునిపై భారం అమాంతంగా పడుతోంది. -
కిక్కు తగ్గింది..!
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన మద్యం టెండర్లకు జిల్లాలో ఈ సారి ఆశించిన స్పందన రాలేదు. గతేడాది 170 దుకాణాలకు 2,404 దరఖాస్తులు రాగా ఈ సారి 194 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా, 181 దుకాణాలకు 1930 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తుగ్గలి, ఉల్లిందకొండ, పులకుర్తి, నందికొట్కూరు, డోన్‌లో 2, సున్నిపెంటలో 2, ఆత్మకూరులో 2, కోవెలకుంట్లలో 1, బనగానపల్లె 2 షాపులకు దరఖాస్తులు రాలేదు. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం లాటరీ పద్ధతిని అమలు చేస్తోంది. నాటి నుంచి ఆశించిన మేరకు దరఖాస్తులు రావడం లేదు. గతేడాది మిగిలిపోయిన 20 దుకాణాలకు వ్యాపారులకు అప్పగించేందుకు పలుమార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ప్రభుత్వమే జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో ఔట్లెట్ల పేరుతో దుకాణాలను తెరిచి నిర్వహించింది. ఈసారి కూడా ఖచ్చితంగా గరిష్ట ధరకే విక్రయాలు జరపాలనే నిబంధన విధించడం బెల్టు షాపులకు విక్రయాలు లేకపోవడం వంటి కారణాల రీత్యా దరఖాస్తు చేయడానికి వ్యాపారులు వెనుకడుగు వేశారు. బెల్టు షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండి 50 నుంచి 100 శాతం అధిక ధరలకు విక్రయించుకునే వీలుంది. అయితే బెల్టు షాపుల రద్దుపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తే పెట్టుబడులు కూడా రావన్న ఉద్దేశంతో వ్యాపారులు వెనుకడుగు వేశారన్న చర్చ జరుగుతోంది. లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు అమ్మకాలు జరిపే విక్రయాలపై తొమ్మిది శాతం ప్రివిలేజ్ ఫీజు, వ్యాట్‌ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. దీంతో లాభాలు తగ్గిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యాపారులు అంచనాకు వచ్చారు. డిమాండ్ ఉన్న దుకాణాలకు మాత్రం పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఏడాదికి రూ.6 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న దుకాణాలకు మాత్రం వ్యాపారులు పోటీ పడ్డారు. మొదటి రెండు రోజులు 474 దరఖాస్తులు రాగా చివరి రోజు శుక్రవారం, అమావాస్య అయినప్పటికీ సెంటిమెంట్‌ను సైతం లెక్క చేయకుండా జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు జిల్లా కేంద్రానికి తరలివచ్చి 1456 దరఖాస్తులను సమర్పించారు. చివరి రోజు కావడంతో మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కార్యాలయానికి వచ్చిన వారందరినీ మైదానంలో క్యూలో నిలబెట్టి గేట్లు మూసి వేసి దరఖాస్తులను స్వీకరించారు. ఈనెల 24వ తేదీ ప్రారంభమైన ఈ ప్రక్రియ శుక్రవారం రాత్రి పొద్దు పోయే దాకా కొనసాగింది. గతంలో దుకాణాలు పొందిన వారిలో కొందరు ఈసారి కూడా తమ చేయి దాటకూడదని భావించి అనుచరులు, బంధుగణంతో పదుల సంఖ్యలో దరఖాస్తులు వేయించారు. గతంలో జి.శింగవరం, రేమటలో ఉన్న దుకాణాలను కర్నూలు నగరానికి మార్పు చేశారు. ఇదిలా ఉండగా శనివారం.. లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున అక్కడ భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.