కిక్కు తగ్గింది..!
కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరైన మద్యం టెండర్లకు జిల్లాలో ఈ సారి ఆశించిన స్పందన రాలేదు. గతేడాది 170 దుకాణాలకు 2,404 దరఖాస్తులు రాగా ఈ సారి 194 మద్యం దుకాణాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా, 181 దుకాణాలకు 1930 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తుగ్గలి, ఉల్లిందకొండ, పులకుర్తి, నందికొట్కూరు, డోన్‌లో 2, సున్నిపెంటలో 2, ఆత్మకూరులో 2, కోవెలకుంట్లలో 1, బనగానపల్లె 2 షాపులకు దరఖాస్తులు రాలేదు. గత రెండేళ్ల నుంచి ప్రభుత్వం లాటరీ పద్ధతిని అమలు చేస్తోంది. నాటి నుంచి ఆశించిన మేరకు దరఖాస్తులు రావడం లేదు. గతేడాది మిగిలిపోయిన 20 దుకాణాలకు వ్యాపారులకు అప్పగించేందుకు పలుమార్లు టెండర్లు ఆహ్వానించినా ఎవ్వరూ ముందుకు రాలేదు. చివరికి ప్రభుత్వమే జిల్లాలోని తొమ్మిది కేంద్రాల్లో ఔట్‌లెట్ల పేరుతో దుకాణాలను తెరిచి నిర్వహించింది.
ఈసారి కూడా ఖచ్చితంగా గరిష్ట ధరకే విక్రయాలు జరపాలనే నిబంధన విధించడం బెల్టు షాపులకు విక్రయాలు లేకపోవడం వంటి కారణాల రీత్యా దరఖాస్తు చేయడానికి వ్యాపారులు వెనుకడుగు వేశారు. బెల్టు షాపుల్లో 24 గంటలు మద్యం అందుబాటులో ఉండి 50 నుంచి 100 శాతం అధిక ధరలకు విక్రయించుకునే వీలుంది. అయితే బెల్టు షాపుల రద్దుపై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తే పెట్టుబడులు కూడా రావన్న ఉద్దేశంతో వ్యాపారులు వెనుకడుగు వేశారన్న చర్చ జరుగుతోంది. లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు అమ్మకాలు జరిపే విక్రయాలపై తొమ్మిది శాతం ప్రివిలేజ్ ఫీజు, వ్యాట్‌ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. దీంతో లాభాలు తగ్గిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వ్యాపారులు అంచనాకు వచ్చారు.
డిమాండ్ ఉన్న దుకాణాలకు మాత్రం పదుల సంఖ్యలో దరఖాస్తులు చేశారు. ఏడాదికి రూ.6 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న దుకాణాలకు మాత్రం వ్యాపారులు పోటీ పడ్డారు. మొదటి రెండు రోజులు 474 దరఖాస్తులు రాగా చివరి రోజు శుక్రవారం, అమావాస్య అయినప్పటికీ సెంటిమెంట్‌ను సైతం లెక్క చేయకుండా జిల్లా నలుమూలల నుంచి వ్యాపారులు జిల్లా కేంద్రానికి తరలివచ్చి 1456 దరఖాస్తులను సమర్పించారు. చివరి రోజు కావడంతో మధ్యాహ్నం మూడు గంటల సమయానికి కార్యాలయానికి వచ్చిన వారందరినీ మైదానంలో క్యూలో నిలబెట్టి గేట్లు మూసి వేసి దరఖాస్తులను స్వీకరించారు.
ఈనెల 24వ తేదీ ప్రారంభమైన ఈ ప్రక్రియ శుక్రవారం రాత్రి పొద్దు పోయే దాకా కొనసాగింది. గతంలో దుకాణాలు పొందిన వారిలో కొందరు ఈసారి కూడా తమ చేయి దాటకూడదని భావించి అనుచరులు, బంధుగణంతో పదుల సంఖ్యలో దరఖాస్తులు వేయించారు. గతంలో జి.శింగవరం, రేమటలో ఉన్న దుకాణాలను కర్నూలు నగరానికి మార్పు చేశారు. ఇదిలా ఉండగా శనివారం.. లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా నలుమూలల నుంచి దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున అక్కడ భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.