భార్య, స్నేహితుల గాలింపు
మధురై: వేందర్ మూవీస్ మదన్ గంగలో సమాధి అవుతానని లేఖ రాసి పెట్టి అదృశ్యం అయిన సంఘటన తీవ్ర సంచలనం కలిగించింది. దీంతో ఆయనను వెదుక్కుంటూ భార్య, మిత్రులు కాశీకి బయల్దేరారు. వేందర్ మూవీస్ సంస్థాపకుడు మదన్. ఈయన 2011లో ఈ సంస్థను ప్రారంభించి ‘అరవాన్’, విశాల్ నటించిన పాండియనాడులతో సహా పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా 20 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు.
ఈయన ఎస్‌ఆర్‌ఎం విద్యాసంస్థల అధ్యక్షుడు పచ్చముత్తుకు సన్నిహితుడు. వేందర్ అని పిలవబడే పచ్చముత్తు తరఫున వేందర్ మూవీస్ అనే సంస్థను ప్రారంభించారు. అంతేకాకుండా ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో అడ్మిషన్ల భర్తీకి మదన్‌కు పూర్తి స్వేచ్ఛ ఉంది. విద్యార్థులు చెల్లించే డొనేషన్ మదన్ ద్వారా కళాశాలకు చేరుతుంది. ఈ స్థితిలో వేందర్ మూవీస్ లెటర్ హెడ్‌లో ఐదుపేజీల లేఖను రాసిపెట్టి మదన్ అదృశ్యం అయ్యారు.
ఈ లేఖ జిరాక్స్‌ను వాట్సప్ ద్వారా సినిమా, పత్రికల్లోని స్నేహితులకు పంపారు. అంతేగాకుండా సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారు. ఆ లేఖలో తాను కాశీలోని గంగలో సమాధి అవుతానని తెలిపారు. తాను ఎంతో నిజాయితీగా, నిస్వార్థంగా పచ్చముత్తు వద్ద పనిచేశానని, కొందరు తనపై చాడీలు చెప్పి మా ఇద్దరి మధ్య వున్న స్నేహాన్ని దెబ్బతీశారని, ఐజేకే పార్టీ అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడినట్లు మదన్ తెలిపారు. ఈ స్థితిలో విరక్తి చెందిన తాను ఇకపై ప్రాణాలతో బతికి ఉండడం వృథా అని పేర్కొన్నారు. దీంతో అతను ఎక్కిడికి వెళ్లాడనే ఆచూకీ తెలియలేదు. మదన్‌ను వెతుకుతూ అతని భార్య, అమ్మ క్రియేషన్స్ శివ, నటుడు లారెన్స్ కాశీకి బయలుదేరి వెళ్లినట్లు సమాచారం.
వేందర్ మూవీస్ మదన్ అదృశ్యం
Published Tue, May 31 2016 2:07 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM
Advertisement
Advertisement