సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ పిల్లర్లలో పగుళ్లు, మెట్రోరైలు ప్రయాణంలో తరచూ ఎదురవుతున్న ఇబ్బందులపై డీఎంఆర్‌సీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ రవాణా వ్యవస్థలో పెను మార్పులకు కారణమైన ఢిల్లీ మెట్రోరైలు తమ ప్రభుత్వ హయాంలోనే వచ్చిదంటూ క్రెడిట్ కొట్టేసేందుకు కాంగ్రెస్ నాయకులు యత్నిస్తుండడంతో బీజేపీ మెట్రోరైలు వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నట్టు కనబడుతోంది. సోమవారం బీజేపీ నేత విజయ్ గోయల్ విలేకరులతో ఈ విషయమై మాట్లాడారు.
ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌లో ఢిల్లీ ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉన్నా ప్రయాణికులకు ఉన్నత ప్రమాణాల్లో సేవలందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. మెట్రోరైలు వ్యవస్థలో తరచూ ఏర్పడుతున్న ఇబ్బందులు, వాటిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘సాంకేతిక కారణాలతో తరచూ మెట్రోరైళ్లు ఆగిపోతున్న ఘటనలకు బాధ్యులైన వారిపై ఏయే చర్యలు తీసుకున్నారు. మెట్రోఫిల్లర్లలో ఏర్పడుతున్న పగుళ్లకు, సాంకేతిక కారణాలకు బాధ్యులెవరో తేల్చాలి’అని డిమాండ్ చేశారు.
మెట్రోరైలు మా హయాంలోనే వచ్చింది...
ఢిల్లీ మెట్రోరైలును తొలుత 1998లో ప్రవేశపెట్టింది ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలోనే అని గోయల్ గుర్తు చేశారు. ఢిల్లీ మెట్రోరైలు మొట్టమొదటి లైన్‌ను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 2002, డిసెంబర్ 24న ప్రారంభించారని పేర్కొన్నారు. నేడు మెట్రోరైలు ఢిల్లీవాసుల దైనందిక జీవితాల్లో ఒకటిగా మారిపోయిందన్నారు. లక్షలాదిమంది ప్రయాణికులు ఆధారపడుతున్నా మెట్రోరైలు అధికారుల పనితీరు ఆశాజనకంగా లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ ఏదోఒక లోపాలు తలెత్తుతున్నాయన్నారు. జూలై 2012లో ఎయిర్‌పోర్టు మెట్రోఎక్స్‌ప్రెస్‌లైన్‌లో ఫిల్లర్లలో పగుళ్లు ఏర్పడ్డాయని గుర్తు చేశారు. నోయిడా సిటీ సెంటర్ స్టేషన్‌లో ఏర్పడిన పగుళ్లను అధికారులు సీరియస్‌గా తీసుకోలేదన్నారు. ఇదే తరహాలో ఏర్పడిన మరికొన్ని సంఘటనలను ఆయన ఉదహరించారు. లక్షల మంది ప్రయాణికుల రక్షణకు సంబంధించిన అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
శ్వేతపత్రం విడుదల చేయండి
Published Mon, Nov 18 2013 11:36 PM | Last Updated on Tue, Oct 16 2018 5:07 PM
Advertisement
Advertisement