కెప్టెన్ విజయ్‌కాంత్
పళ్లిపట్టు: డీఎంకేది పిల్ల బెదిరింపులని, అన్నాడీఎంకే అవినీతి సొమ్ముతో సామాన్యులను కొని జనాక్షరణగా చేస్తున్న ప్రచారాలు ఎన్నికల్లో చెల్లవని డీఎండీకే అద్యక్షుడు విజయకాంత్ ఎద్దేవా చేశారు. డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి, తమాకాతో పాటు ఆరు పార్టీల ఆధ్వర్యంలో పొత్తు ఏర్పాటు చేసుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఆ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా విజయకాంత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ప్రచారంలో భాగంగా తిరుత్తణి డీఎండీకే అభ్యర్థి కృష్ణమూర్తికి మద్దతుగా శుక్రవారం రాత్రి తిరుత్తణిలో బహిరంగ సభ నిర్వహించారు. టీఎంసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామన్, ఎండీఎంకే జిల్లా కార్యదర్శి డీఆర్ ఆర్ సెంగుట్టవన్, వీసీకే జిల్లా కార్యదర్శి సిద్ధార్థన్, సీపీఐ జిల్లా కార్యదర్శి కన్నన్, సీపీఎం జిల్లా కార్యదర్శి పన్నీరు సెల్వం, టీఎంసీ జిల్లా అధ్యక్షుడు శేఖర్‌తో సహా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
సమావేశంలో కెప్టెన్ విజయకాంత్ పాల్గొని అభ్యర్థి కృష్ణమూర్తిని పరిచయం చేసి మాట్లాడారు. తను కూటమిలో ఆరు పార్టీలున్నాయని కూటమి పార్టీల అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని, తిరుత్తణిలో కృష్ణమూర్తికి ఢంకా గుర్తుకు ఓట్లేయాలని పిలుపు నిచ్చారు. డీఎంకే పిల్ల బెదిరింపులతో స్టాలిన్ జపం చేస్తున్నారని, అలాగే అన్నాడీఎంకే డబ్బుతో నిరుపేదలను కొనుగోలు చేసి భారీగా బహిరంగ సభలు చూపి ప్రచారాలకు పరిమితమవుతున్నట్లు చెప్పారు. అయితే తమ కూటమి ఎలాంటి ఆకర్షణలకు, ప్రలోభాలకు, ప్రజలను గురి చేయకుండా ప్రజలే ఆసక్తిగా తమ వెంట నడుస్తున్నట్లు చెప్పారు.