ఓటేద్దాం రండి..!
Published Wed, Apr 9 2014 10:34 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాలతోపాటు ఎన్సీఆర్‌లోని గుర్గావ్, ఫరీదాబాద్, గౌతమ్‌బుద్ధ్‌నగర్, ఘజియాబాద్ నియోజకవర్గాలలో గురువారం పోలింగ్ జరగనుంది. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ సజావుగా జరగడానికి ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఢిల్లీలోని 2,527 పోలింగ్ లొకేషన్లలో 11,763 పోలింగ్ బూత్‌లలో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం భారీగా పెరగడంతో పాటు, పోలింగ్ సమయం ముగిసిన తరువాత కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో లోక్‌సభ ఎన్నికల కోసం ఓటింగ్ సమయాన్ని రెండు గంటలపాటు పెంచారు.
గుర్తింపు కార్డు లేకపోయినా...
ఓటరు గురింపు కార్డు లేకపోయినా, ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేదా 11 రకాల గుర్తింపు కార్డులతోపాటు ఎన్నికల కమిషన్ జారీచేసిన ఫొటో ఓటరు స్లిప్ చూపించి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. తమ పేరు ఓటరు జాబితాలో ఉందా? లేదా? అన్న విషయాన్ని ఓటర్లు ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ద్వారా లేదా నిర్ధారిత నంబర్లకు ఎస్‌ఎంఎస్ పంపి తెలుసుకోవచ్చు. మొబైల్ ఫోన్లను పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లడాన్ని అనుమతించరు. గురువారం మెట్రో సేవ తెల్లవారు జామున నాలుగు గంటలకు మొదలుకానుంది.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు...
1.27 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో 3.37 లక్షల మంది మొదటిసారి ఓటువేయనున్నారు. పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా జరగడం కోసం ఎన్నికల కమిషన్ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. 16 మంది ఫ్లయింగ్ పోలీస్ స్క్వాడ్లతోపాటు నిఘా బృందాలను, వీడియో నిఘా బృందాలను నియమించింది. 50 వేలమంది భద్రతా సిబ్బందిని ఎన్నికల విధుల కోసం మోహరించారు, సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలతోపాటు మైక్రో అబ్జర్వర్లను మోహరిస్తారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను అమర్చడంతో పాటు వెబ్ క్యాస్టింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. వరుస సెలవుల కారణంగా పోలింగ్ శాతం తగ్గవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఎన్నికల కమిషన్ భారీ పోలింగ్ జరుగుతుందని ఆశిస్తోంది.
అంతుచిక్కని ఓటరు నాడి...
ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోరు జరుగనుంది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆమ్ ఆద్మీ పార్టీ బలహీనపడడంతో రాజకీయ సమీకరణాలు మారాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటిన ఆప్ ఇటీవలి కాలంలో తమ పార్టీ బలహీన పడిందన్న విషయాన్ని అంగీకరించడంలేదు. దళితులు, అనధికార కాలనీవాసులు తమ వెంటే ఉన్నారని ఆప్ నేతలు అంటున్నారు. కొత్తగా ముస్లింలు, సిక్కులు కూడా తమ పార్టీవైపు మొగ్గు చూపుతున్నారని ఆప్ నేతలు చెబతున్నారు. కానీ రాజకీయ చిత్రం ఇప్పటికీ స్పష్టం కాలేదు. నరేంద్ర మోడీ ప్రభంజనం వల్ల రాజకీయ వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు పైకి కన బడుతోంది. అయితే పైకి కనబడే వాతావరణానికి, ఓటరు నాడికి తేడా ఉంటుందని కొంతమంది రాజకీయ పండితులు అనుభవంతో చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో డీలాపడిన కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగుపడిందని కొందరు అంటున్నారు. తమ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజధానిలో నిర్వహించిన సభలు విజయవంతం కావడంతో కాంగ్రెస్‌లో ఆశలు చిగురించాయి. గడ్డుకాలం ముగిసిందని కాంగ్రెస్ నేతలు ఓ పక్క సంతోషిస్తుండగా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున నిలిచిన ముస్లిం ఓటర్లు ఆ పార్టీ వైపు మెగ్గు చూపడానికి సంకోచిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌కే ఓటు వేయాలని జామా మసీదు షాహీ ఇమామ్ చేసిన విజ్ఞప్తి కాంగ్రెస్‌కు ఏ మేర కు లాభిస్తుందనేది తెలుసుకునేందుకు మే 16 వరకు వేచి ఉండాల్సిందే.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక చర్యలు: ఈసీ
దేశ రాజధానిలో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కే్రందాల్లో పోలింగ్ ప్రక్రియను వీడియోల ద్వారా చిత్రీకరిస్తున్నట్టు ఢిల్లీ ఎన్నికల నిర్వహణ ప్రధానాధికారి విజయ్ దేవ్ తెలి పారు. ఢిల్లీలో మొత్తం 11,763 పోలింగ్ కేంద్రా ల్లో గురువారం ఎన్నికలు జరగనున్నాయి. అందులో 417 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుకాగా, అత్యంత సమస్యాత్మకమైన 90 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు విజయ్‌దేవ్ చెప్పారు. ఆయా కేంద్రాలకు అదనపు పోలీసు బలగాలను పంపడమే కాకుండా పోలిం గ్ ప్రక్రియను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. ప్రత్యే క రక్షణ చర్యల్లో భాగంగా పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించడం లేదన్నారు.
నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఆప్ అభ్యర్థి మొత్తం అభ్యర్థులు
న్యూఢిల్లీ అజయ్‌మాకెన్ మీనాక్షి లేఖీ ఆశిష్ కేతన్ 29
చాందినీచౌక్ కపిల్ సిబల్ హర్షవర్ధన్ ఆశుతోష్ 25
తూర్పు ఢిల్లీ సందీప్ దీక్షిత్ మహేష్ గిరీ రాజ్‌మోహన్ గాంధీ 23
ఈశాన్య ఢిల్లీ జేపీ అగర్వాల్ మనోజ్‌తివారీ ఆనంద్ కుమార్ 23
పశ్చిమ ఢిల్లీ మహాబల్ మిశ్రా పవేశ్ వర్మ జర్నైల్ సింగ్ 17
వాయవ్య ఢిల్లీ కృష్ణాతీరథ్ ఉదిత్‌రాజ్ రాఖీ బిర్లా 14
దక్షిణ ఢిల్లీ రమేష్ కుమార్ రమేష్ బిధూడీ దేవేంద్ర షెహ్రావత్ 19
లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్ శాతం:
సంవత్సరం పురుష ఓటర్లు మహిళా ఓటర్లు మొత్తం ఓటర్లు
1991 52.63 శాతం 43.52 శాతం 48.52 శాతం
1996 51.68 శాతం 49.20 శాతం 50.62 శాతం
1999 45.48 శాతం 40.90 శాతం 40.62 శాతం
2004 49.02 శాతం 44.57 శాతం 47.08 శాతం
2009 53.64 శాతం 49.59 శాతం 52.3 శాతం
Advertisement
Advertisement