‘హస్తిన’లో ముక్కోణం | Lok Sabha polls: Campaign for April 10 elections ends in Delhi | Sakshi
Sakshi News home page

‘హస్తిన’లో ముక్కోణం

Published Wed, Apr 9 2014 12:00 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

Lok Sabha polls: Campaign for April 10 elections ends in Delhi

 సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 10న జరగనున్న లోక్‌సభ ఎన్నికలు యావద్దేశానికి ఆసక్తికరంగా మారాయి. ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలు ఉండగా, ఇక్కడి నుంచి స్థానాలు చేజిక్కించుకున్న పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం ఒకటిరెండు సార్లు  మినహా పలుసార్లు నిజమైంది. ఢిల్లీ పరిధిలో న్యూఢిల్లీ, చాందినీచౌక్, సౌత్ ఢిల్లీ, నార్త్‌వెస్ట్ ఢిల్లీ, నార్త్‌ఈస్ట్ ఢిల్లీ, వెస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానాలు ఉండగా, వీటిలో నార్త్‌వెస్ట్ ఢిల్లీ రిజర్వ్‌డ్ స్థానం. గత లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ వాసులు ఈ ఏడు లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్‌కే కట్టబెట్టారు. దాదాపు 1.20 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న ఢిల్లీలో 13 మంది మహిళలు సహా 150 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
 
 దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు వచ్చి ఉంటున్నా, ఢిల్లీ రాజకీయాల్లో కుల మతాలు ఇంకా కీలక పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. ధరల పెరుగుదల, తాగునీటి సమస్య, అధిక విద్యుత్ చార్జీలు వంటి అంశాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. ఢిల్లీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ఇదివరకటి షీలా దీక్షిత్ సర్కారు ఇతోధికంగా కృషి చేసినా, స్థానిక సమస్యల పరిష్కారంలో వైఫల్యం కారణంగా ఓటర్లు కాంగ్రెస్‌ను ఓడిం చారు. గత లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్, బీజేపీలకే ఢిల్లీ రాజకీయ పోరు పరిమితమై ఉండేది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆవిర్భావంతో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది.
 
 ఫలితంగా ఢిల్లీలో ఈ లోక్‌సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే, ఢిల్లీలోనే ‘ఆప్’ బలంగా ఉందనేది నిరాకరించలేని సత్యం. కాంగ్రెస్ ఓటుబ్యాంకుగా ఉంటూ వచ్చిన దళితులు, అనధికార కాలనీ వాసులను తనవైపు తిప్పుకొని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దెబ్బతీసిన ‘ఆప్’ ఇప్పుడు ముస్లింల వైపు దృష్టి సారించింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో చూపినంతగా ‘ఆప్’ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన 49 రోజులకే అధికారాన్ని వదిలి పలాయనం చిత్తగించిందనే విమర్శ ‘ఆప్’ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. ఢిల్లీ కాంగ్రెస్‌కు పదిహేనేళ్లుగా కేంద్ర బిందువుగా ఉన్న షీలా దీక్షిత్, అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఢిల్లీ రాజకీయాల నుంచి నిష్ర్కమించి, కేరళ గవర్నర్‌గా వెళ్లిపోవడం తెలిసిందే. 
 
 ఆ నియోజకవర్గాల్లో కులాలే కీలకం
 వెస్ట్ ఢిల్లీ, సౌత్ ఢిల్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయించడంలో కులాలదే కీలక పాత్ర.  సౌత్ ఢిల్లీ నుంచి కాంగ్రెస్ తరఫున రమేశ్‌కుమార్, బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బిదూరీ, ‘ఆప్’ తరఫున దేవేంద్ర సెహ్రావత్ పోటీ చేస్తున్నారు. జాట్, గుజ్జర్ ఓటర్లు ఇక్కడి అభ్యర్థుల తలరాతలను నిర్ణయించడంలో కీలకపాత్ర పోషిస్తారు. వెస్ట్ ఢిల్లీలో సిక్కుల ఓటర్లకు గాలం వేసే లక్ష్యంతో ‘ఆప్’ జర్నైల్ సింగ్‌ను బరిలోకి దించింది. మిగతా పార్టీలు కూడా కులసమీకరణల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశాయి. 
 
 సర్వేల అంచనాలు
 సీఎన్‌ఎన్-ఐబీఎన్, సీఎస్‌డీఎస్
 పార్టీ గెలుపొందే స్థానాలు
 బీజేపీ 2-4
 ఆమ్ ఆద్మీ పార్టీ 2-4
 కాంగ్రెస్ 1
 సహారా సమయ్
 బీజేపీ 5-7
 ఆమ్ ఆద్మీ పార్టీ 0-2
 కాంగ్రెస్ 0-1
 ఏబీపీ న్యూస్-నీల్సన్
 బీజేపీ 3
 ఆమ్ ఆద్మీ పార్టీ 3
 కాంగ్రెస్ 1
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement