ఎన్నికలకు సర్వం సిద్ధం
Published Tue, Apr 8 2014 11:58 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి నగరవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేశారు. గురువారం నిర్వహించే పోలింగ్ కోసం 16 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు సహా 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరిస్తున్నారు. ఈసారి బరిలో 150 మంది అభ్యర్థులు ఉండగా, 1.27 కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓటరుకార్డులు, స్లిప్పులు లేకున్నా ఓటు వేయవచ్చని ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయ్ దేవ్ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లెసైన్స్ వంటి గుర్తింపుకార్డుల్లో ఏదైనా ఒకదానిని చూపించి ఓటు వేయవచ్చు. దరఖాస్తు చేసినా ఓటరుకార్డు అందని వాళ్లు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. నగరవ్యాప్తం గా 11,673 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిలో 327 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా, ముమ్మరం చేశారు.
వాహనాలను తనిఖీ చేసే కార్యక్రమాన్ని కూడా మంగళవారం నుంచి ఆరంభించారు. అక్రమమద్యం, నల్లధనాన్ని నిరోధించేందుకు తనిఖీలను నిర్వహిస్తున్నారు. రాత్రివేళల్లో గస్తీని పెంచవలసిందిగా పీసీఆర్ వ్యాన్లు, గస్తీ బృందాలను అధికారులు ఆదేశించారు. ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసులు కన్నేసి ఉంచారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసు స్టేషన్లస్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీల ద్వారా ఓటు హక్కును శాంతియుతంగా వినియోగించుకోవడంపై ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు అప్పమత్తంగా ఉండాలని ఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం తన ఉన్నతాధికారులను ఆదేశించింది.
ఓటు వేయండి, రాయితీలు పొందండి
ఏప్రిల్ 10న నగర ఓటర్లు ఓటువేసి సరదాగా బయట గడపవచ్చు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిని అలరించేందుకు కొన్ని రె స్టారెంట్లు డిస్కౌంటు ఇస్తున్నాయి, కొన్ని బంకులు పెట్రోలు ధరపై తగ్గింపు ప్రకటించాయి. డాక్టర్లు కూడా కన్సల్టేషన్ ఫీజుపై తగ్గింపు ప్రకటించారు. ఓటు వేసినట్లు నిర్ధారించే సిరా గుర్తు మరకను వేలిపై చూపించి ఓటర్లు ఈ తగ్గింపులు పొందవచ్చు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషన్ చేసే ప్రయత్నాలకు సహకరించేందుకు కొన్ని వ్యాపార సంస్థలు ముందుకు వచ్చాయి. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల కమిషన్ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల అభిరుచిని గమనించి రెస్టారెంట్లు, పెట్రోలు పంపులు, సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్లు, రిటైల్ స్టోర్లతో చేతుల కలిపి అనేక ప్రత్యేక ఆఫర్లు ఇప్పించింది. తద్వారా ఓటర్లను పోలింగ్ కేంద్రాల వద్దకు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
Advertisement
Advertisement