న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసినందున, కరెంటు చార్జీల పెంపు ఫైల్‌ను ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ (డీఈఆర్సీ) బయటికి తీస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి టారిఫ్ పెంపునకు అనుమతించాలని కమిషన్ ఇది వరకే ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. చార్జీల పెంపు కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) సమర్పించిన పిటిషన్లపై డీఈఆర్సీ వచ్చే వారంలో అభిప్రాయాలు/అభ్యంతరాల స్వీకరణకు బహిరంగ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. అభిప్రాయాలను పరిశీలించి కొత్త టారిఫ్‌ను ఖ రారు చేసేందుకు దాదాపు మూడు నెలల గడువు అవసరమవుతుందని, జూలై వరకు ఇదే టారిఫ్ కొనసాగవచ్చని డీఈఆర్సీ వర్గాలు తెలిపాయి.
ప్రజల సూచనలను డిస్కమ్‌లు, సంబంధిత సంఘాల ప్రతినిధులతో కలసి డీఈఆర్సీ చర్చిస్తుంది. నిజానికి డిస్కమ్‌లు సమర్పించిన పిటిషన్లలో టారిఫ్ పెంపు ప్రస్తావన లేకున్నా, తమ పాత బకాయిలు చెల్లించాలని డీఈఆర్సీని కోరాయి. రాజధానికి విద్యుత్ సరఫరా చేస్తున్న మూడు డిస్కమ్‌లకు రూ.ఎనిమిది వేల కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉంది. దీనిని బట్టి చూస్తే ఈసారి కూడా డీఈఆర్సీ టారిఫ్‌ను భారీగానే పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు సాధారణ వినియోగదారులకు కూడా ‘టైం ఆఫ్ ది డే’ టారిఫ్‌ను అమలుచేయాలని డి స్కమ్‌లు కోరుతున్నాయి. ఈ పద్ధతిలో రద్దీ సమయాల్లో ఎక్కువగా, రద్దీ రహిత సమయాల్లో తక్కువ చార్జీలను వసూలు చేస్తారు.
అంతిమంగా ఈ విధానం వినియోగదారుడికి నష్టం చేస్తుందనే వాదనలూ ఉన్నాయి. దీనిపై డీఈఆర్సీ ఇంత వరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, దీనిపైనా వినియోగదారుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని కమిషన్ వర్గాలు తెలిపాయి. అయితే డిస్కమ్‌లు దొంగ లెక్కలు చూపుతూ నష్టాలు ప్రకటిస్తున్నాయనే ఆరోపణలు రావడంతో, వీటి ఖాతాలపై కాగ్ ఆడిటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగ్ ప్రైవేటు సంస్థల ఖాతాలపై ఆడిటింగ్ నిర్వహించే అధికారం లేదంటూ డిస్కమ్‌లు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కేసుపై విచారణ నిర్వహించిన ఉన్నత న్యాయస్థానం డిస్కమ్‌ల పిటిషన్లను తోసిపుచ్చింది. కాగ్ ఆడిటింగ్‌కు సహకరించాలని ఆదేశించింది.
కరెంటు ‘షాక్’కు రెడీ!
Published Mon, Apr 14 2014 12:01 AM | Last Updated on Wed, Sep 5 2018 3:44 PM
Advertisement