వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ప్రారంభం
- వెల్లడించిన ముంబై నగర పోలీసు శాఖ
- 70457 57272 నంబర్‌తో అకౌంటుతో ఫిర్యాదుల స్వీకరణ
- అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టేందుకే: ఏఎస్పీ లోహియా
- ఫిర్యాదుదారుల వివరాలు గోప్యం
సాక్షి, ముంబై: మీకు తెలిసి ఎక్కడైనా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు జరుగుతున్నాయా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానకి భయమా.. అయితే మీ లాంటి వారి కోసమే నగర పోలీసు శాఖ వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. మొబైల్ నుంచి ఫిర్యాదు చేయడానికి వీలుగా ఉండేం దుకు ఈ నిర్ణయం తీసుకుంది. 70457 57272 అనే హెల్ప్‌లైన్ నంబర్ వాట్స్‌యాప్ అకౌంటుకు ఫిర్యాదుతో పాటు సంబంధిత సమాచారాన్ని అందించవచ్చు.
ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. ముంబైలోని మురికివాడల్లో పేకాట, మాదకద్రవ్యాల విక్రయం, సారా తయారీ వంటి అక్రమ వ్యాపారాలు జరుగుతుంటా యి. ఈ విషయం తెలిసినా చాలా మంది పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడతారు. దీంతో అక్రమ వ్యాపారులకు చెక్ పె ట్టేందుకు తూర్పు రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ లోహియా వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
పైలట్ ప్రాజెక్టుగా అమలు
‘ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ భాగమయ్యింది. కొత్త ఫీచర్స్‌తో వచ్చే మొబైల్స్ తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్స్ యాప్ ఉపయోగిస్తున్నారు. అందుకే వాట్స్‌యాప్‌ను ఫిర్యాదులకు కేంద్రంగా వినియోగించుకోవాలని నిర్ణయించాం. ఎవరైనా సరే ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయవచ్చు’ అని లోహియా అన్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా పోలీసు యూనిట్ నంబరు 6, 7 పరిధిలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
చెంబూర్, తిలక్‌నగర్, ఘట్కోపర్, పంత్‌నగర్, విక్రోలి, పార్క్‌సైట్, కంజూర్‌మార్గ్, గోవండీ, ములుండ్, నవ్‌ఘర్, చునాభట్టి, ట్రాంబే, మాన్‌ఖుర్ద్, శివాజీనగర్, ఆర్సీఎఫ్, దేవ్‌నార్ తదితర 18 స్టేషన్ల పరిధిలో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామని, ప్రజల స్పంద న బట్టి విస్తరిస్తామని ఆయన చెప్పారు. ‘ప్రజలు వాట్స్‌యాప్ ద్వారా పంపిం చిన ఫిర్యాదులు నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కి వెళతాయి. అక్కడి నుంచి డిప్యూటీ పోలీసు కమిషనర్‌కు, స్థానిక పోలీసు స్టేషన్‌లోని పోలీసు ఇన్‌స్పెక్టర్‌కు చేరుతాయి. ఫిర్యాదుదారుల పేర్లు బయటపడే ఆస్కారమే ఉండదు’ అని లోహియా స్పష్టం చేశారు.