City Police Department
-
Hyderabad New Year Events: సిటీ పోలీసుల కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహకులకు సిటీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. వీటిలో పాల్గొనే వారికి కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయి ఉండాలని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన డిజిటల్ లేదా నేరుగా తెచ్చిన సర్టిఫికెట్‌ను చూసిన తర్వాతే లోపలకు అనుమతించాలంటూ కొత్వాల్ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పాటు నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను ఆయన వెల్లడించారు. ►థర్మల్/ఐఆర్ స్క్రీనింగ్ తర్వాత, కచ్చితంగా మాస్కు ధరించిన వారినే లోపలకు అనుమతించాలి. కార్యక్రమం జరిగే చోట భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. ►కార్యక్రమం నిర్వహణకు 48 గంటల ముందే నిర్వాహకులు, ఉద్యోగులు, సిబ్బందికి కోవిడ్ పరీక్షలు చేయించాలి. ►బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజేకు అనుమతి లేదు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు శబ్ధం వినిపించకూడదు. దీన్ని అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తారు. ►ఈవెంట్లతో జరిగే ప్రతి చర్యకు, కష్టనష్టాలకు నిర్వాహకులే బాధ్యత వహించాలి. ►ఎక్సైజ్ విభాగం నిర్దేశించిన సమయానికి మించి మద్యం సరఫరా చేయకూడదు. కపుల్స్ కోసం నిర్దేశించిన పార్టీల్లోకి మైనర్లను అనుమతించకూడదు. బార్ అండ్ రెస్టారెంట్స్‌లో లైవ్ బ్యాండ్స్ నిర్వహించకూడదు. ►మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాలి. ‘డిజిగ్నెటెడ్ డ్రైవర్’ విధానంపై ప్రచారం చేయాలి. ►నిర్వాహకులు కార్యక్రమం జరిగే ప్రాంతంలోనే పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. రహదారులపై వాహనాలు ఆపేలా చేయకూడదు. ఎంట్రీ, ఎగ్జిట్లు వేర్వేరుగా అవసరమైన స్థాయిలో ఉండాలి. జరిమానా.. జైలు మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహన యజమానులదే బాధ్యత. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అవుతాయి. ఈ విషయాలపై ప్రచారం చేపట్టారు. -
హలో.. నేను పోలీసుని..
సాక్షి, హైదరాబాద్: గస్తీ వాహనాల దగ్గరే ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసే నూతన విధానాన్ని సోమవారం నుంచి ప్రారంభించిన నగర పోలీసు విభాగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విచారణలో ఉన్న పిటిషన్లు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని పోలీసులే క్రమం తప్పకుండా బాధితులకు ఫోన్ ద్వారా తెలియపరిచే కొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విధానంలో విచారణలో ఉన్న పిటిషన్లు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని పోలీసులే క్రమం తప్పకుండా బాధితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. బాధితులకు ఇబ్బందులు లేకుండా.. ఏదైనా నేరానికి సంబంధించి కేసు పెట్టడం ఒక ఎత్తయితే.. దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడం మరో ఎత్తుగా మారింది. అనేక కేసులకు సంబంధించి బాధితులు తమ కేసుల్ని విచారిస్తున్న దర్యాప్తు అధికారులను (ఐఓ) కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతుంటారు. అత్యధిక శాతం కేసుల్లో ఎస్ఐ స్థాయి అధికారులే ఐఓలుగా వ్యవహరిస్తుంటారు. హత్య, భారీ చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో ఇన్స్పెక్టర్, వరకట్న వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన వాటిలో ఏసీపీ స్థాయి అధికారులు ఐవోలుగా వ్యవహరిస్తుంటారు. ఎస్ఐలు, ఇతర ఐవోలకు దర్యాప్తు బాధ్యతలతోపాటు పరిపాలన, బందోబస్తు, భద్రతా విధులు, ఇతర డ్యూటీలు తప్పవు. దీంతో చాలా సందర్భాల్లో పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని ఉండటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బాధితులు తమ కాళ్లు అరిగేలా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినా ఆయా దర్యాప్తు అధికారుల్ని కలుసుకోవడం చాలాఅరుదు. అతికష్టమ్మీద కలిసినా వారి స్పందన అనేక సందర్భాల్లో అభ్యంతరకరంగా ఉంటోంది. దీంతో పోలీసు విభాగంపై ఇవి ప్రజల్లో చులకన భావానికి కారణమయ్యే ఆస్కారం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఫిర్యాదుదారులకు కేసు దర్యాప్తు ఇవ్వాల్సిన బాధ్యతల్ని ఐఓలకే అప్పగించారు. కేసుగా మారని పిటిషన్ల విషయంలోనూ ఈ పద్ధతినే అవలంభించనున్నారు. ఆన్లైన్లో అన్నీ ఉండవు.. ఈ–కాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక ఆన్లైన్ విధానాలను పోలీసు విభాగం ప్రవేశపెట్టింది. ‘నో యువర్ కేస్ స్టేటస్’కు అవకాశం కల్పించింది. దీని ద్వారా ఎవరైనా తమ కేసు దర్యాప్తు పురోగతి, చార్జ్‌షీట్ దాఖలై కోర్టు విచారణలో ఉందనో, కేసును మూసేశామనో మాత్రమే తెలుసుకోవచ్చు. అయితే తమ కేసు అప్పటికీ దర్యాప్తు దశలోనే ఉండిపోవడానికో, కేసును మూసేయడానికో కారణం తెలుసుకోవాలంటే మాత్రం ఆన్లైన్ ద్వారా సాధ్యంకాదు. మళ్లీ ఠాణాలు, ఐఓల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల వల్ల కేసు వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండట్లేదు. తొలి రోజు 9 కేసులు.. గస్తీ వాహనాల దగ్గరే ఫిర్యాదులు స్వీకరించే పద్ధతి ప్రారంభమైన తొలిరోజు సోమవారం నాడు నగర వ్యాప్తంగా 9 కేసులు నమోదయ్యాయి. గస్తీ వాహనాల సిబ్బందిపై నమ్మకం ఉంచిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఠాణా అధికారులకే బాధ్యతలు.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ అంజనీకుమార్ కేసు దర్యాప్తు దశ, తీరుతెన్నుల్ని బాధితులు/ఫిర్యాదుదారులకు వివరించాల్సిన బాధ్యతల్ని దర్యాప్తు అధికారులకే అప్పగించాలని నిర్ణయించారు. ప్రతి ఐవో తన దగ్గర ఉన్న కేసుల జాబితాతోపాటు ఫిర్యాదుదారుల ఫోన్ నంబర్లు సైతం కలిగి ఉంటారు. ప్రతిరోజూ కొంతమంది చొప్పున ప్రతి బాధితుడికీ కనీసం 15 రోజులకు ఒకసారైనా ఫోన్లు చేసేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు. సదరు కేసు ప్రస్తుతం ఏ దశలో ఉంది? దర్యాప్తులో జాప్యానికి కారణమేంటి? ఇతర ఇబ్బందులు, సమస్యలు ఏంటి? అనే అంశాలను సవివరంగా చెప్పాలని సూచించారు. ఇలా ప్రతి పోలీసు తాను ఎవరెవరితో మాట్లాడాననే విషయంతోపాటు వారి నంబర్‌ను ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ విధానం అమలయ్యేలా చూడాలని కొత్వాల్ నిర్ణయించారు. పర్యవేక్షణ బాధ్యతల్ని జోనల్ డీసీపీలు, ఏసీపీలకు అప్పగించనున్నారు. అయితే ఫోన్ చేసే బాధ్యతల్ని దర్యాప్తు అధికారికా.. లేక రిసెప్షనిస్టులకు అప్పగించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
సిటీలోనే సింహభాగం!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి తనిఖీలు, సోదాలు ముమ్మరం చేసిన సిటీ పోలీసులు రికార్డు స్థాయి ఫలితాలు సాధించారు. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్వాధీనమైన సొమ్ము లో 61.9 శాతం సిటీలోనే దొరికింది. బంగారం, వెండి, ఇతర వస్తువులు సీజ్ చేయడంలోనూ ఇదే ధోరణి కొనసాగింది. షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి సిటీ పోలీసులు నగదు తరలింపుపై డేగకన్ను వేశారు. ఆది నుంచి పటిష్టచర్యలు పోలింగ్ స్వేచ్ఛాయుతంగా జరగాలంటే నగదు అక్రమ రవాణాను అడ్డుకోవాలని ఎన్నికల సంఘం అనునిత్యం స్పష్టం చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసులు నగదు తరలింపుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓ పక్క సాధారణ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ బృందాలు దీనిపై కన్నేసి ఉంచాయి. ఆదివారం సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.24.23 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. వీటిలో సిటీ పోలీసు విభాగానికి చిక్కిందే రూ.15 కోట్లకు పైగా ఉంది. శని, ఆదివారాల్లోనే టాస్క్‌ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎనిమిది ఉదంతాల్లో రూ.4.9 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతరాల్లోనూ పెద్ద ‘స్థానమే’... కేవలం నగదు మాత్రమే కాకుండా ఓటర్లను ప్రలోభాలకు లోను చేయడానికి వినియోగిస్తారనే అనుమానం ఉన్న ప్రతి రవాణాపైనా సిటీ పోలీసులు కన్నేసి ఉంచారు. సరైన బిల్లులు లేకుండా తరలిస్తున్న వెండి, బంగారం, ఆభరణాలతో పాటు నిషేధిత పదార్థాలైన గంజాయి, గుట్కా తదితరాల స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహాకు చెందిన రూ.3.31 కోట్ల విలువైనవి సీజ్ అయ్యాయి. సిటీ చుట్టూ ఉన్న సైబరాబాద్, రాచకొండల్లోనూ రూ.కోట్లలోనే స్వాధీనం చేసుకున్నారు. కొన్ని మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో లైసెన్స్డ్ ఆయుధాల డిపాజిట్ తగ్గింది. ఏపీ లింకు రవాణా సైతం... ఈసారి తెలంగాణలో పార్లమెంట్, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ–పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరంలో, నగరం మీదుగా నగదు అక్రమ రవాణా భారీగా పెరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది కీలక నాయకులకు హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు, వ్యాపారాలు ఉన్నా యి. వీరంతా ఎన్నికలతో పాటు కొన్ని కీలకమైన సందర్భాల్లో తమ నేతల్ని ‘ఆర్థికంగా ఆదుకుంటున్నారు’. ప్రలోభాలు, లంచాలకు అవసరమైన సొమ్మును తమ వ్యాపారాల ముసుగులో తరలించి వారికి అప్పగిస్తు న్నారు. కొందరు దొంగ లెక్కలు చూపిస్తూ తీసుకువెళ్తుండగా మరికొందరు ఎలాంటి లెక్కలు లేకుండా తమ అనుచరులు, నమ్మినబంట్ల ద్వారా చేరాల్సిన చోటుకు చేర్చేస్తున్నా రు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న కొందరు హవాలా వ్యాపారుల్నీ టీడీపీ వాడుకుంటోంది. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కడ కు డబ్బు పంపాల్సి ఉన్నా దేశభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని తెలిసీ హవాలా మార్గాన్ని ఆశ్రయిస్తోంది. ఆ పార్టీ నేతలు ఈ నగదు సరఫరాల్లో కీలక దళారు లుగా వ్యవహరిస్తున్నారు. నగరంలో పట్టుబడిన డబ్బుకు ఏపీ ఎన్నికలతో లింకుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ కేసుల్ని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు
సాక్షి, హైదరాబాద్: అత్యాచార బాధిత మహిళలకు పోలీసు, వైద్య, న్యాయ, పునరావాస సాయమం దించేందుకు ఏర్పాటైన భరోసా కేంద్రం మరో రికార్డును సొంతం చేసుకోబోతోంది. దీని ఆధీనంలో దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటవు తోంది. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం దీని ఏర్పాటుకు హైకోర్టు ప్రత్యేక అ నుమతి ఇచ్చింది. నాంపల్లిలోని హాకా భవన్లో ఉన్న భరోసా కేంద్రంలోనే ఈ నెల 24 దీన్ని ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు అనుమతితో ఏర్పాటు... నగర కమిషనరేట్ పరిధిలో అత్యాచారం, చిన్నారులపై జరిగే అ«ఘాయిత్యాలు, తీవ్రమైన గృహహింస కేసుల్లో బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి భరోసా కేంద్రాన్ని 2016, మే 7న ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల్లో బాధితులుగా ఉండే వారికి మరింత సేవ చేయడానికి, వీరిలో మనోధైర్యం నింపడానికి భరోసా కేంద్రంలోనే ఈ కేసుల విచారణకు న్యాయ స్థానాన్ని ఏర్పాటు చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ హైకోర్టును అభ్యర్థించారు. దీన్ని పరిశీలించిన కోర్టు అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జీ నేతృత్వంలో ఏర్పాటు చేయడానికి అనుమతి మంజూరు చేసింది. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుగా ఉండే ఈ న్యాయస్థానం ద్వారా పోక్సో యాక్ట్ కేసుల విచారణ వేగవంతం కానుంది. ఈ నెల 24న దీన్ని ప్రారంభించనున్నారు. దేశంలోని తొలిసారిగా.. ఈ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ కోసం ఓ గది ఉండనుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు కోర్టు హాల్లోకి రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం నమోదుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితులకు నిందితులు కనిపించకుండా కోర్టులో ప్రత్యేక అద్దాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా భరోసా కేంద్రం అధీనంలో ఉండనున్న దేశంలోనే తొలి ప్రత్యేక చిన్నారుల కోర్టుగా ఇది రికార్డులకు ఎక్కనుంది. దీని ఏర్పాటుకయ్యే ఖర్చును సిటీ పోలీసు విభాగం భరిస్తోంది. -
అరచేతిలో అతివల భద్రత!
మహిళలకు అండగా రూపొందిన పోలీసు యాప్స్ సిటీబ్యూరో: నగర పోలీసు విభాగం అతివల రక్షణకు పెద్దపీట వేస్తోంది. ఓ పక్క షీ-టీమ్స్ ద్వారా క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న అధికారులు... సామాజిక మాధ్యమాల ద్వారానూ సహాయ సహకారాలు అందిస్తున్నారు. పోలీసులు- ప్రజల మధ్య వారధిగా ఏర్పాటు చే సిన మొబైల్ యాప్ ‘హాక్-ఐ’లో ఈ కోణానికి సంబంధించి మూడు అంశాలను చేర్చారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ప్లేసోర్ట్ నుంచి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్ఓఎస్... విపత్కర పరిస్థితుల్లో అతివలకు అండగా ఉండేందుకు ‘ఎస్ఓఎస్’ విభాగం ఏర్పాటైంది. ‘హాక్-ఐ’లో ఉన్న ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత ప్రాథమికంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపర్చడంతో పాటు సన్నిహితులు, స్నేహితులకు చెందిన ఐదు ఫోన్ నెంబర్లనూ ఫీడ్ చేయాలి. ‘క్రియేట్’ బటన్ నొక్కడం ద్వారా దీని షార్ట్‌కట్ మొబైల్ స్క్రీన్‌పై వస్తుంది. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను ప్రెస్ చేస్తే చాలు... జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లొకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. పొందు పరిచిన నెంబర్లకూ ఈ సమాచారం వెళ్తుంది. ఓసారి ‘ఎస్ఓఎస్’ను నొక్కిన తర్వాత 9 సెకండ్ల కౌంట్‌డౌన్ ఉంటుంది. ఎవరైనా పొరపాటున ప్రెసి చేసి ఉంటే ఈ సమయంలో క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ సమయం తర్వాత అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ... విద్య, ఉద్యోగ రంగాల్లో మహిళలు/యువతులు పురుషులకు దీటుగా దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వేళకాని వేళల్లోనూ ఒంటరిగా ప్రయాణించడం అనివార్యంగా మారింది. ఇదే కొన్ని సందర్భాల్లో ఆకతాయిలు, దుండగులకు కలిసి వస్తోంది. నగరంలో ఇలా ప్రయాణాలు చేసే మహిళల కోసం ‘హాక్-ఐ’లో ఏర్పాటు చేసిన విభాగమే ఉమెన్ ట్రావెల్ మేడ్ ఈజీ. ప్రయాణం ప్రారంభానికి ముందు యాప్‌లోని ఈ విభాగంలోకి ప్రవేశించిన తర్వాత సదరు మహిళ/యువతి ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తున్నారో (డెస్టినేషన్) ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. జీపీఎస్ పరిజ్ఞానంతో పనిచేసే ఈ విభాగం ద్వారా ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి అది పూర్తయ్యే వరకు కమిషనరేట్‌లోని ఐటీ సెల్ పర్యవేక్షిస్తూ ఉంటుంది. నిర్దేశించిన డెస్టినేషన్ కాకుండా సదరు వాహనం వేరే మార్గంలో ప్రయాణిస్తే పోలీసులే గుర్తించి ప్రయాణికురాలిని సంప్రదిస్తారు. మార్గమధ్యంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే క్షణాల్లో ఫిర్యాదు చేసేందుకు ఓ బటన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్... మహిళల భద్రత కోసం ‘హాక్-ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగం ‘క్రైమ్ ఎగనెస్ట్ ఉమెన్’. వారు పని చేసే ప్రాంతంలో, ప్రయాణించే మార్గంలో, ఇంట్లో... ఇలా ఎ క్కడ ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు, వేధింపులు ఎ దురైనా ఈ విభాగాన్ని ఆశ్రయించవచ్చు. నేరుగా పో లీ సుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లే కుండా..ఈ విభాగంలో ఉన్న ఆప్షన్స్‌ను సెలెక్ట్ చేసుకొని పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రాథమింగా ఈ స మాచారాన్ని విశ్లేషించే ఐటీ సెల్ ఫిర్యాదు స్వభావాన్ని బట్టి పోలీసులు, షీ-టీమ్స్, సైబర్ పోలీసులకు సమాచారం అందిస్తారు. దీంతో పాటు డయల్ ‘100’, పో లీ సు ఫేస్బుక్, వాట్సాప్ (9490616555) ద్వారా నూ ఎ లాంటి సహాయ సహకారాలు కావాలన్నా పొందవచ్చు. -
క్రైమ్ మ్యాపింగ్!
ప్రత్యేక యాప్ రూపొందించిన ఐటీ సెల్ నేరాలు జరిగే ప్రాంతాల డిజిటలైజేషన్ త్వరిత గతిన సమాచార సేకరణ..నేరాల నియంత్రణే లక్ష్యం అన్ని స్థాయిల సిబ్బందికీ అందుబాటులోకి నేరాల నియంత్రణకు...కేసుల విచారణ త్వరితగతిన చేపట్టేందుకు...దోషుల్ని వేగవంతంగా పట్టుకునేందుకు నగర పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు టెక్నాలజీని వినియోగించుకుంటోంది. తాజాగా సిటీ పోలీస్ ఐటీ సెల్ ‘క్రైమ్ మ్యాపింగ్’ పేరిట ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. త్వరిత గతిన నేరాల సమాచారం అందించడం..అవసరమైన వివరాలు వేగవంతంగా తెలుసుకోవడం..మరిన్ని నేరాలు జరగకుండా నియంత్రించడానికి ఈ క్రైమ్ మ్యాపింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: ⇔నగరంలోని ఏ ప్రాంతంలో ఏ తరహా నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి..? ⇔ఏదైనా నేరం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలో ఎక్కడ సీసీ కెమెరాలున్నాయి..? ⇔ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ నగరంలో నేరాలు చేసే ముఠాలు ఎన్ని? ఏ తరహావి? ⇔ఫలానా ప్రాంతంలో జరిగిన నేరానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత? కేసు ప్రస్తుతం ఏ స్థితిలో ఉంది? నేరాల నియంత్రణ (ప్రివెన్షన్), కేసుల్ని కొలిక్కి తేవడం (డిటెక్షన్)కు ఈ వివరాలు ఎంతో కీలకం. అయితే వీటిని మాన్యువల్‌గా తీసుకోవాలంటే... దాదాపు వారం రోజులు పడుతుంది. ఈ లోపు నేరం చేసిన వ్యక్తి ‘తీరం’ దాటిపోయే అవకాశం ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకున్న సిటీ పోలీసు ఐటీ సెల్ ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. క్రైమ్ మ్యాపింగ్ పేరుతో తయారు చేసిన దీన్ని కమిషనరేట్‌లోని అన్ని స్థాయిల అధికారులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్‌లో ఉండే ప్రత్యేకతల్లో కీలకమైనవి... థిమేటిక్ క్రైమ్ మ్యాప్ నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే సమయంలో ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి ‘క్రైమ్ మ్యాపింగ్’లో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ విభాగం ఏర్పాటు చేశారు. ఓ అధికారి/సిబ్బంది ఇందులోకి ప్రవేశించడం ద్వారా తనకు అవసరమైన తేదీల మధ్య ఏ ప్రాంతంలో, ఏ తరహా నేరాలు జరిగాయో సంఖ్యలతో సహా తెలుసుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఫలితంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విభాగంలో బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్య, హత్యాయత్నం... ప్రాప ర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు, దొంగతనాలు తదితరాలతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన కేసుల వివరాలనూ పొందుపరిచారు. క్రైమ్ ప్రోన్ రిపోర్ట్ కమిషనరేట్‌లోని జోన్లు, సబ్-డివిజన్లు, పోలీసుస్టేషన్ల వారీగా ఏ తరహా నేరాలు, ఏ సమయంలో, ఏఏ రోజుల్లో, ఏ విధంగా జరుగుతున్నాయో దీని ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు నగరంలో ఓ ఠాణా పరిధిలో ఉన్న ప్రాంతంలో ఎక్కడ నేరాలు జరుగుతున్నాయనేది స్పష్టంగా చూపిస్తుంది. ఆ ఠాణా పరిధిలో ఏ పరిధి (కిలోమీటర్ల విస్తీర్ణంతో సహా) నేరాలకు ఆలవాలంగా మారిందనేదీ మ్యాప్పైన చూపిస్తుంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఆయా రోజులు, సమయాల్లో ప్రత్యేక దృష్టి సారించేలా క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయవచ్చు. మరోపక్క ఠాణాల పరిధిలో గస్తీ విధులు నిర్వర్తించే బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ వాహనాలు, రక్షక్లను ఆయా సమయాల్లో నిర్దేశిత ప్రాంతాల్లో ఎక్కువగా దృష్టి పెట్టేలా ఠాణా అధికారులూ వ్యూహం సిద్ధం చేసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. క్రైమ్ రాడార్ సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. స్నాచింగ్, అటెన్షన్ డైవర్షన్‌తో పాటు ఇతర నేరాలు చోటు చేసుకున్న సమయంలో ఘటనాస్థలికి పోలీసులు చేరుకుంటారు. అయితే అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లోని క్రైమ్ రాడార్లోకి ప్రవేశిస్తే చాలు. ఈ నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. సీసీఆర్బీ సెర్చ్ నగరంలో చైన్ స్నాచింగ్స్, సూడో పోలీసు, దృష్టి మళ్లించి దండుకోవడం తదితర నేరాలు చేసే ముఠాల్లో అనేకం బయటి రాష్ట్రాల నుంచే వచ్చిపోతుంటాయి. ఒకప్పుడు ఏ రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి చెందిన ముఠా నగరంలో ఏ తరహా నేరాలు చేసింది అనే వివరాలు కేవలం సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)తో పాటు కొన్ని ప్రత్యేక విభాగాల దగ్గరే అందుబాటులో ఉండేవి. దీంతో ఠాణా అధికారులు వీరిని సంప్రదించి, ఆయా నేరగాళ్ల చిరుమానాలు తెలుసుకున్న తర్వాతే తదుపరి చర్యలకు ఆస్కారం ఉండేది. ‘క్రైమ్ మ్యాపింగ్’లో ఏర్పాటు చేసిన సీసీఆర్బీ సెర్చ్‌లో నేరం స్వభావం లేదా అనుమానితుల పేర్లు తదితరాలను ఎంటర్ చేస్తే చాలు... దేశంలోని ఏ ప్రాంతంలో వారు ఉంటారు అనేది చూపిస్తుంది. ఎఫ్ఐఆర్తో పాటు ఎంట్రీలు ఈ ‘క్రైమ్ మ్యాపింగ్’ యాప్‌లోకి ఎంట్రీలన్నీ పోలీసుస్టేషన్ స్థాయిలోనే జరిగేలా ఐటీ సెల్ ఇన్చార్జ్ శ్రీనాథ్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. ఫిర్యాదు అందుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలోనే ఠాణాల్లో ఉండే ఈ-కాప్స్ సిబ్బంది ఆ వివరాలను క్రైమ్ మ్యాపింగ్‌లో పొందుపరుస్తారు. ఈ నేపథ్యంలోనే థిమేటిక్ క్రైమ్ మ్యాప్, క్రైమ్ ప్రోన్ రిపోర్ట్ విభాగాల్లో సెర్చ్ చేసినప్పుడు ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబర్లు, అవి నమోదైన తేదీలు సైతం ప్రత్యక్షమయ్యే సౌలభ్యం ఉంది. మ్యాప్‌లో దర్యాప్తు అధికారులు తమకు అవసమైన చోట కల్సర్ పెడితే.. పాప్అప్ రూపంలో అదనపు సమాచారం కనిపిస్తుంది. భవిష్యత్తులో ఈ క్రైమ్ మ్యాపింగ్‌లో మరికొన్ని చేర్చవచ్చు. -
వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ప్రారంభం
- వెల్లడించిన ముంబై నగర పోలీసు శాఖ - 70457 57272 నంబర్‌తో అకౌంటుతో ఫిర్యాదుల స్వీకరణ - అక్రమ వ్యాపారాలకు చెక్ పెట్టేందుకే: ఏఎస్పీ లోహియా - ఫిర్యాదుదారుల వివరాలు గోప్యం సాక్షి, ముంబై: మీకు తెలిసి ఎక్కడైనా అక్రమ వ్యాపారాలు, కార్యకలాపాలు జరుగుతున్నాయా.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడానకి భయమా.. అయితే మీ లాంటి వారి కోసమే నగర పోలీసు శాఖ వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ప్రారంభించింది. మొబైల్ నుంచి ఫిర్యాదు చేయడానికి వీలుగా ఉండేం దుకు ఈ నిర్ణయం తీసుకుంది. 70457 57272 అనే హెల్ప్‌లైన్ నంబర్ వాట్స్‌యాప్ అకౌంటుకు ఫిర్యాదుతో పాటు సంబంధిత సమాచారాన్ని అందించవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయి. ముంబైలోని మురికివాడల్లో పేకాట, మాదకద్రవ్యాల విక్రయం, సారా తయారీ వంటి అక్రమ వ్యాపారాలు జరుగుతుంటా యి. ఈ విషయం తెలిసినా చాలా మంది పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడతారు. దీంతో అక్రమ వ్యాపారులకు చెక్ పె ట్టేందుకు తూర్పు రీజియన్ అదనపు పోలీసు కమిషనర్ మనోజ్ లోహియా వాట్స్‌యాప్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్టుగా అమలు ‘ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ భాగమయ్యింది. కొత్త ఫీచర్స్‌తో వచ్చే మొబైల్స్ తక్కువ ధరకే దొరుకుతున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వాట్స్ యాప్ ఉపయోగిస్తున్నారు. అందుకే వాట్స్‌యాప్‌ను ఫిర్యాదులకు కేంద్రంగా వినియోగించుకోవాలని నిర్ణయించాం. ఎవరైనా సరే ఫొటోలు తీసి అప్లోడ్ చేయవచ్చు’ అని లోహియా అన్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా పోలీసు యూనిట్ నంబరు 6, 7 పరిధిలో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. చెంబూర్, తిలక్‌నగర్, ఘట్కోపర్, పంత్నగర్, విక్రోలి, పార్క్‌సైట్, కంజూర్‌మార్గ్, గోవండీ, ములుండ్, నవ్ఘర్, చునాభట్టి, ట్రాంబే, మాన్‌ఖుర్ద్, శివాజీనగర్, ఆర్సీఎఫ్, దేవ్నార్ తదితర 18 స్టేషన్ల పరిధిలో హెల్ప్‌లైన్‌ను ప్రారంభించామని, ప్రజల స్పంద న బట్టి విస్తరిస్తామని ఆయన చెప్పారు. ‘ప్రజలు వాట్స్‌యాప్ ద్వారా పంపిం చిన ఫిర్యాదులు నేరుగా పోలీసు కంట్రోల్ రూమ్‌కి వెళతాయి. అక్కడి నుంచి డిప్యూటీ పోలీసు కమిషనర్‌కు, స్థానిక పోలీసు స్టేషన్‌లోని పోలీసు ఇన్స్పెక్టర్కు చేరుతాయి. ఫిర్యాదుదారుల పేర్లు బయటపడే ఆస్కారమే ఉండదు’ అని లోహియా స్పష్టం చేశారు. -
స్నాచింగ్..క్యాచింగ్
నగల చోరీలో 77 శాతం రికవరీ ఈ ఏడాది మొత్త 21, 035 కేసులు మహిళలపై తగ్గిన నేరాలు నగరంలో పోలీసుల సంఖ్య.... మంజూరైన పోలీసుల సంఖ్య 12401 ప్రస్తుతం పనిచేస్తున్నవారు 9744 ప్రస్తుతం ఖాళీ పోస్టులు 2657 సిటీబ్యూరో: హైదరాబాద్‌ను నేరరహిత, గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలనే తెలంగాణ ప్రభుత్వ కాంక్షకు అనుగుణంగా నగర పోలీసు శాఖ ఆరు నెలలుగా ముందుకు సాగుతోందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన రాష్ర్టంలో పోలీసు సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు విప్లవాత్మకమైన మార్పులు చేపట్టామని పేర్కొన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో సిటీ పోలీసు 2014 రౌండప్‌పై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో పోలీసుఅధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. గత ఏడాది 19,110 కేసులు నమోదు కాగా, ఈ సారి 21,035 నమోదయ్యాయన్నారు. గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది రికవరీ శాతం 57కు పెరిగిందన్నారు. అయితే చైన్‌స్నాచింగ్ కేసుల్లో 77 శాతం రికవరీ చేసి రికార్డు సృష్టించామన్నారు. ఓ పక్క ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టినా, మరో పక్క నేరగాళ్లను జైళ్లలో పెట్టడానికి పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నామని పేర్కొన్నారు. నేరాల నిరోధం, బాధితులకు సత్వర న్యాయం కోసం అత్యాధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటున్నామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ రూ.30 కోట్లు కేటాయించిందని వివరించారు. నేరాల నిరోధానికి ఐదు నెలలుగా పోలీసులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. ఠాణాల్లో పారిశుద్ధ్య పనులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించామన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా రిసెప్షన్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసుల దుమ్ము దులిపేందుకు ప్రతి 15 రోజులకోసారి యూఐ మేళా నిర్వహిస్తున్నామన్నారు. లోక్ అదాలత్‌ల ద్వారా కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అవుతున్నాయన్నారు. మహిళలపై గత ఏడాది 3,173 నేరాలు జరిగితే ఈ సారి 2,790 కేసులు నమోదయ్యాయన్నారు. జీపీఎస్ గుప్పిట్లోకి గస్తీ వాహనాల వ్యవస్థను తీసుకువచ్చామన్నారు. ఈ సమావేశంలో అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జితేందర్, జాయింట్ పోలీసు కమిషనర్లు వై.నాగిరెడ్డి, శివప్రసాద్, డీసీపీలు పాలరాజు, వెంకటేశ్వరరావు, డాక్టర్ రవిందర్, కమలాసన్‌రెడ్డి, సత్యనారాయణ, సుధీర్‌బాబు, లింబారెడ్డి, రంగనాథ్, ఎల్.ఎస్.చౌహాన్ అదనపు డీసీపీ కోటిరెడ్డి, పాపయ్య, సత్యనారాయణ, నాగరాజు, బాబురావు, పి.యాదగిరి, ఎం.రామ్మోహన్రావు, ఎల్.టి.చంద్రశే ఖర్, రంజన్త్రన్‌కుమార్, కె.విజేందర్‌రెడ్డి, బి.గంగారామ్, అమరేందర్‌రెడ్డితో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఏఐలు పాల్గొన్నారు. చేధించిన కేసులు (శాతాల్లో) బందిపోటు దొంగతనాలు 97 సూడోపోలీసు 91 చైన్స్నాచిగ్లు 77 ఇళ్లలో చోరీలు 55 దోపిడీలు 53 హత్యచేసి దోపిడీ 39 దృష్టి మళ్లించి 39 ఆటోమొబైల్ 34 సీసీఎస్ ఛేదించిన కేసులు.. ►నైజీరియన్ జాబ్ ఫ్రాడ్ ► }లంక కేంద్రంగా జరుగుతున్న కిడ్నీ రాకెట్ ► మిలటరీ రహస్యాలు చేరవేస్తున్న గుట్టు రట్టు ► పాకిస్తాన్ కేంద్రంగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 14 మంది అరెస్టు ►డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్టు ►15 కేసుల్లో 36 మందిని అరెస్టు చేసి రూ.13.60 కోట్ల స్వాధీనం ►బొల్లారం ఠాణాలో అతితక్కువగా 13 చోరీలు జరిగాయి ►ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసులు అత్యధికంగా బేగంపేట ఠాణాలో ఆరు కేసులు నమోదు. ► ఆస్తి కోసం హత్యలు ఈ ఏడాది మూడు జరిగాయి. ► బొల్లారం, కామాటిపురా,డబీర్‌పురా, హబీబ్‌నగర్‌లలో స్నాచింగ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ► అత్యధికంగా మారేడ్‌పల్లిలో నలుగురు మహిళపై అత్యాచార కేసులు నమోదయ్యాయి. ► అత్యధికంగా వరకట్న కేసులు ముషీరాబాద్ ఠాణాలో నాలుగు నమోదయ్యాయి. టాస్క్‌ఫోర్స్ ఛేదించిన కేసులు ► కరుడు గట్టిన చైన్‌స్నాచర్ సయ్యద్సయ్యీద్ హుస్సేన్ అరెస్టు. మిస్టరీ వీడిన 228 కేసులు ► 54 మంది దొంగలను అరెస్టు చేసి 59 వాహనాలను స్వాధీనం ► అక్రమంగా ఆయుధాలు కలిగిన 47 మందిని అరెస్టు ► 26 డ్రగ్స్ కేసులలో 60 మంది నిందితులను అరెస్టు ► 1554 కేసులు ఛేదించి 2,564 మంది నిందితులను అరెస్టు నగర పోలీసు శాఖలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు.. ► కొత్త ఇన్నోవా పెట్రోలింగ్ వాహనాలు ► బ్లూకోల్డ్స్ బైక్స్ ► సాయుధ బలగాల గస్తీ ► పిటిషన్ మేనేజ్మెంట్ సర్వీస్ ► డైలీ పెర్ఫార్మెన్స్ రిపోర్టు (డీపీఆర్) ► కమ్యూనిటీ పోలీసింగ్ ► {పతి ఠాణాకు ఫేస్బుక్ సౌకర్యం ► {Vూప్ ఎస్ఎమ్ఎస్ సర్వీస్ ► పాస్‌పోర్టు దరఖాస్తు దారులకు ఎస్ఎమ్ఎస్ పంపడం ► {Mైమ్ మ్యాపింగ్ ► స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం ► ఈవ్‌టీజింగ్ నిరోధానికి షీ-టీమ్స్ ఏర్పాటు ► {పజలు ప్రశాంత జీవనం గడిపేందుకు 24 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగం ► పీపుల్స్ ఫ్రెండ్లీ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ నేటి వరకు 3000 మంది పోలీసులకు దీనిపై శిక్షణ పూర్తి చేసుకున్నారు. ► పేకాట క్లబ్బుల మూసివేత ► క్యాష్‌లెస్ ట్రాఫిక్ చలానా ► ఠాణాలో సిబ్బందికి పని విభజన ► సేఫ్ కాలనీ ► మార్కెటింగ్ ఇంటెలిజెన్స్