సాక్షి, హైదరాబాద్: గస్తీ వాహనాల దగ్గరే ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేసే నూతన విధానాన్ని సోమవారం నుంచి ప్రారంభించిన నగర పోలీసు విభాగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విచారణలో ఉన్న పిటిషన్లు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని పోలీసులే క్రమం తప్పకుండా బాధితులకు ఫోన్ ద్వారా తెలియపరిచే కొత్త విధానాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విధానంలో విచారణలో ఉన్న పిటిషన్లు, దర్యాప్తులో ఉన్న కేసుల పురోగతిని పోలీసులే క్రమం తప్పకుండా బాధితులకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు.
బాధితులకు ఇబ్బందులు లేకుండా..
ఏదైనా నేరానికి సంబంధించి కేసు పెట్టడం ఒక ఎత్తయితే.. దర్యాప్తు పురోగతిని తెలుసుకోవడం మరో ఎత్తుగా మారింది. అనేక కేసులకు సంబంధించి బాధితులు తమ కేసుల్ని విచారిస్తున్న దర్యాప్తు అధికారులను (ఐఓ) కలుసుకోవడానికే ఇబ్బందులు పడుతుంటారు. అత్యధిక శాతం కేసుల్లో ఎస్‌ఐ స్థాయి అధికారులే ఐఓలుగా వ్యవహరిస్తుంటారు. హత్య, భారీ చోరీ, దోపిడీ, బందిపోటు దొంగతనం తదితర కేసుల్లో ఇన్‌స్పెక్టర్, వరకట్న వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదైన వాటిలో ఏసీపీ స్థాయి అధికారులు ఐవోలుగా వ్యవహరిస్తుంటారు.
ఎస్‌ఐలు, ఇతర ఐవోలకు దర్యాప్తు బాధ్యతలతోపాటు పరిపాలన, బందోబస్తు, భద్రతా విధులు, ఇతర డ్యూటీలు తప్పవు. దీంతో చాలా సందర్భాల్లో పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని ఉండటం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బాధితులు తమ కాళ్లు అరిగేలా పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగినా ఆయా దర్యాప్తు అధికారుల్ని కలుసుకోవడం చాలాఅరుదు. అతికష్టమ్మీద కలిసినా వారి స్పందన అనేక సందర్భాల్లో అభ్యంతరకరంగా ఉంటోంది.
దీంతో పోలీసు విభాగంపై ఇవి ప్రజల్లో చులకన భావానికి కారణమయ్యే ఆస్కారం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఫిర్యాదుదారులకు కేసు దర్యాప్తు ఇవ్వాల్సిన బాధ్యతల్ని ఐఓలకే అప్పగించారు. కేసుగా మారని పిటిషన్ల విషయంలోనూ ఈ పద్ధతినే అవలంభించనున్నారు.
ఆన్‌లైన్‌లో అన్నీ ఉండవు..
ఈ–కాప్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక ఆన్‌లైన్ విధానాలను పోలీసు విభాగం ప్రవేశపెట్టింది. ‘నో యువర్ కేస్ స్టేటస్’కు అవకాశం కల్పించింది. దీని ద్వారా ఎవరైనా తమ కేసు దర్యాప్తు పురోగతి, చార్జ్‌షీట్ దాఖలై కోర్టు విచారణలో ఉందనో, కేసును మూసేశామనో మాత్రమే తెలుసుకోవచ్చు. అయితే తమ కేసు అప్పటికీ దర్యాప్తు దశలోనే ఉండిపోవడానికో, కేసును మూసేయడానికో కారణం తెలుసుకోవాలంటే మాత్రం ఆన్‌లైన్ ద్వారా సాధ్యంకాదు. మళ్లీ ఠాణాలు, ఐఓల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిందే. కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాల వల్ల కేసు వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండట్లేదు.
తొలి రోజు 9 కేసులు..
గస్తీ వాహనాల దగ్గరే ఫిర్యాదులు స్వీకరించే పద్ధతి ప్రారంభమైన తొలిరోజు సోమవారం నాడు నగర వ్యాప్తంగా 9 కేసులు నమోదయ్యాయి. గస్తీ వాహనాల సిబ్బందిపై నమ్మకం ఉంచిన నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు సీపీ అంజనీకుమార్ తెలిపారు.
ఠాణా అధికారులకే బాధ్యతలు..
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ అంజనీకుమార్ కేసు దర్యాప్తు దశ, తీరుతెన్నుల్ని బాధితులు/ఫిర్యాదుదారులకు వివరించాల్సిన బాధ్యతల్ని దర్యాప్తు అధికారులకే అప్పగించాలని నిర్ణయించారు. ప్రతి ఐవో తన దగ్గర ఉన్న కేసుల జాబితాతోపాటు ఫిర్యాదుదారుల ఫోన్ నంబర్లు సైతం కలిగి ఉంటారు. ప్రతిరోజూ కొంతమంది చొప్పున ప్రతి బాధితుడికీ కనీసం 15 రోజులకు ఒకసారైనా ఫోన్లు చేసేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారు.
సదరు కేసు ప్రస్తుతం ఏ దశలో ఉంది? దర్యాప్తులో జాప్యానికి కారణమేంటి? ఇతర ఇబ్బందులు, సమస్యలు ఏంటి? అనే అంశాలను సవివరంగా చెప్పాలని సూచించారు. ఇలా ప్రతి పోలీసు తాను ఎవరెవరితో మాట్లాడాననే విషయంతోపాటు వారి నంబర్‌ను ఉన్నతాధికారులకు అందించాల్సి ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా ఈ విధానం అమలయ్యేలా చూడాలని కొత్వాల్ నిర్ణయించారు. పర్యవేక్షణ బాధ్యతల్ని జోనల్ డీసీపీలు, ఏసీపీలకు అప్పగించనున్నారు. అయితే ఫోన్ చేసే బాధ్యతల్ని దర్యాప్తు అధికారికా.. లేక రిసెప్షనిస్టులకు అప్పగించాలన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment