సాక్షి, హైదరాబాద్: అత్యాచార బాధిత మహిళలకు పోలీసు, వైద్య, న్యాయ, పునరావాస సాయమం దించేందుకు ఏర్పాటైన భరోసా కేంద్రం మరో రికార్డును సొంతం చేసుకోబోతోంది. దీని ఆధీనంలో దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటవు తోంది. చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం దీని ఏర్పాటుకు హైకోర్టు ప్రత్యేక అ నుమతి ఇచ్చింది. నాంపల్లిలోని హాకా భవన్‌లో ఉన్న భరోసా కేంద్రంలోనే ఈ నెల 24 దీన్ని ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
హైకోర్టు అనుమతితో ఏర్పాటు...
నగర కమిషనరేట్ పరిధిలో అత్యాచారం, చిన్నారులపై జరిగే అ«ఘాయిత్యాలు, తీవ్రమైన గృహహింస కేసుల్లో బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి భరోసా కేంద్రాన్ని 2016, మే 7న ఏర్పాటు చేశారు. పోక్సో కేసుల్లో బాధితులుగా ఉండే వారికి మరింత సేవ చేయడానికి, వీరిలో మనోధైర్యం నింపడానికి భరోసా కేంద్రంలోనే ఈ కేసుల విచారణకు న్యాయ స్థానాన్ని ఏర్పాటు చేయాలని నగర పోలీసులు నిర్ణయించారు. ఈ మేరకు అనుమతి కోరుతూ హైకోర్టును అభ్యర్థించారు. దీన్ని పరిశీలించిన కోర్టు అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జీ నేతృత్వంలో ఏర్పాటు చేయడానికి అనుమతి మంజూరు చేసింది. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టుగా ఉండే ఈ న్యాయస్థానం ద్వారా పోక్సో యాక్ట్ కేసుల విచారణ వేగవంతం కానుంది. ఈ నెల 24న దీన్ని ప్రారంభించనున్నారు.
దేశంలోని తొలిసారిగా..
ఈ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ కోసం ఓ గది ఉండనుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు కోర్టు హాల్‌లోకి రాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాంగ్మూలం నమోదుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. బాధితులకు నిందితులు కనిపించకుండా కోర్టులో ప్రత్యేక అద్దాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా భరోసా కేంద్రం అధీనంలో ఉండనున్న దేశంలోనే తొలి ప్రత్యేక చిన్నారుల కోర్టుగా ఇది రికార్డులకు ఎక్కనుంది. దీని ఏర్పాటుకయ్యే ఖర్చును సిటీ పోలీసు విభాగం భరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment