జై తెలంగాణ అంటేనే సస్పెండ్ చేశారు!
జై తెలంగాణ అంటేనే సస్పెండ్ చేశారు!
Published Sat, Dec 17 2016 10:34 AM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీలో జై తెలంగాణ అంటేనే సస్పెండ్ చేశారని, తెలంగాణకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించినా పంపేశారని.. అసలు కుర్చీలోంచి లేస్తేనే సస్పెండ్ చేశారని మంత్రి హరీష్ రావు అన్నారు. అలాంటిది సభను అడ్డుకుంటే ఎందుకు ఊరుకుంటారని ప్రశ్నించారు. అటు పార్లమెంటులోను, ఇటు అసెంబ్లీలోను కూడా సభను జరగనివ్వకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయని, ఈ సభ ఏదో కొంతమందిది కాదు.. 119 మంది సభ్యులందరిదీ అని చెప్పారు. అంతకుముందు తొమ్మిది మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడంతో.. ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఎప్పుడైనా తాము ప్రస్తావించిన అంశాలను చర్చకు రానిచ్చారా అని అడిగారు. ప్రశ్నోత్తరాల సమయం అయిపోయిన తర్వాత వాయిదాలు వేస్తున్నారని.. ఇప్పుడు సభ్యుల సస్పెన్షన్ అంశాన్ని పునరాలోచించాలని, లేనిపక్షంలో తాను కూడా నిరసనగా వాకౌట్ చేయాల్సి వస్తుందని జానారెడ్డి అన్నారు. మెజారిటీ ఉందని రెండు నిమిషాల్లోనే సస్పెండ్ చేస్తారా, ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించడం సరికాదని అన్నారు. వెల్ లోకి రాకముందే సస్పెండ్ చేయడానికి కారణం ఎంటని అడిగారు. ప్రభుత్వ చర్యలు, వైఫల్యాలను ప్రశ్నించకూడదా అని ప్రశ్నించారు.
దానికి హరీష్ స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఫిరాయింపుల గురించి బీఏసీలో ప్రస్తావించలేదని, అయినా అది స్పీకర్ పరిధిలోని అంశమని చెప్పారు. మాట్లాడటానికి ఏమీ లేదు కాబట్టే కాంగ్రెస్ పార్టీ సభను అడ్డుకోవాలని చూస్తోందన్నారు. గతంలో జై తెలంగాణ అన్నందుకే తమను సస్పెండ్ చేసినప్పుడు మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడని జానారెడ్డి.. ఇప్పుడు సభకు అంతరాయం కలిగించినందుకు సభ్యులను సస్పెండ్ చేస్తే ఎలా ప్రశ్నిస్తారన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశామని, ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని చెప్పారు.
జానారెడ్డి వాకౌట్
కాగా.. ప్రభుత్వ తీరును నిరసిస్తూ జానారెడ్డి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం ఆయన చాంబర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అయి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
Advertisement
Advertisement